Home » Uncategorized » Currently Reading:

ఇతర బ్రౌజర్లకు నెటిజన్లని మార్చే బాధ్యత తీసుకుందాం

December 17, 2008 Uncategorized 16 Comments

చర్వితచరణంగా Internet Explorerలో మళ్లీ మరో కీలకమైన సెక్యూరిటీ లోపం బయటపడింది.  మొత్తానికి ఈనాడు వంటి దినపత్రికలు ఈసారి ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తించి నెట్ వాడకందారులను చైతన్యపరిచేలా వార్తలు రాయడం శుభపరిణామం. IEకి ప్రత్యామ్నాయంగా కొన్నేళ్లపాటు Opera చలామణి అయిన విషయం విదితమే. ఇప్పటికీ Opera స్థాయి ఏమాత్రం తగ్గలేదు. అయితే IE స్థానాన్ని బలంగా కదిలించగలగడంలో Mozilla Firefox కీలకపాత్ర పోషించింది.  బ్రౌజర్ సెక్యూరిటీపై కొద్దిపాటి అవగాహన ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు IE జోలికే వెళ్లడం లేదు. కారణం ActiveX controls, BHO’s (browser hijackers) వంటి అంశాలతో పాటు ఇతర అనేక సెక్యూరిటీ లోపాలు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవాలంటేనే భయపడేలా పిసి వాడకందారులను భయపెట్టేశాయి. ఇప్పటికీ అధికశాతం మంది IEని వాడుతూనే ఉన్నారు.

దీనికి కొన్ని కారణాలు:

  • Windowsతో పాటు డీఫాల్ట్ గా IE రావడం. అస్సలు web browser యొక్క ప్రాధాన్యత చాలామందికి తెలియకపోవడం. మరీ ముఖ్యంగా windowsతో పాటు వచ్చినదే ప్రామాణికం అన్న భ్రమలో చాలామంది ఉండడం. Firefox, Opera, Chrome, Safari వంటి అనేక ప్రత్యామ్నాయ బ్రౌజర్లు ఉన్నాయని తెలియకపోవడం.
  • ఇప్పుడు స్వంతంగా నెట్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ మొదట్లో బయట నెట్ సెంటర్లలో నెట్ బ్రౌజ్ చేసినవారే. నెట్ సెంటర్లలో నేను 1996 నుండి గమనిస్తున్నాను. అప్పట్లోనే IEకి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటివరకూ అధికశాతం నెట్ సెంటర్లు IEనే వాడుతున్నాయి. కారణం ఒక్కటే.. “వేరే దానికి మారితే మా సెంటర్ కి వచ్చే కస్టమర్ కి కొత్తగా ఉంటుంది” అని “కంప్యూటర్ ఎరా” పాఠకులైన అనేక నెట్ సెంటర్ల నిర్వాహకులు చెబుతుంటారు నేరుగా కలిసినప్పుడు గానీ,  ఫోన్లలో వారి సందేహాలు తీర్చుకునేటప్పుడు గానీ! అంటే మార్పుని కస్టమర్ల ఆహ్వానించలేరనే ఉద్దేశంతో IEతోనే నెట్టుకువస్తున్నారన్నమాట.
  • మన నోళ్లలో ఎక్కువ నానేది ఏదైనా బాగా ప్రాచుర్యం సంతరించుకుంటుదన్నది విదితమే. సహజంగా మనం వెబ్ బ్రౌజర్ ప్రస్తావన వచ్చినప్పుడు “IEలోకెళ్లి ఆ సెట్టింగ్ చేయండి”, “IE అడ్రస్ బార్ లో google.com అని కొట్టండి” ఇలా గైడ్ లైన్స్ ఇస్తూ ఇంటర్నెట్ బ్రౌజర్ అంటే Internet Explorer పేరే స్ఫురించేలా ప్రవర్తిస్తుంటాం. ఇది కొత్తగా కంప్యూటర్ నేర్చుకునేవారికీ, నెట్ వాడేవారి మీదా ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే IEతోనే జనాలు సతమతం అవడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అనేక అంశాలు కారణం అవుతూ ఉంటాయి.

మనమేం చెయ్యగలం:

అవగాహన కలిగిన వ్యక్తి తనకు వీలైనంత మేర మరొకరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యతని స్వీకరించడం బాధ్యతగా ఫీల్ కావాలి. మనలో చాలామంది IEని వదిలేసి Firefox, Opera, Chrome వంటి ప్రత్యామ్నాయ బ్రౌజర్లని వాడుతున్నాం. అదీ గాక బ్లాగర్లుగా మనకొక platform ఉంది. బ్రౌజర్ అంటే IEనే అని భావించే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న పిసి యూజర్లు ఎందరో మన బ్లాగుల్ని సందర్శిస్తుంటారు. అలాంటి వారిలో ఆలోచన రేకెత్తేలా “IEకి బదులుగా Firefox, Opera, Chrome వంటి బ్రౌజర్లు సురక్షితమైనవి అవి వాడండి” అని సైడ్ బార్ లోనో, మరో చోటో చిన్న మెసేజ్ మనం పెట్టవచ్చు.

నేనేం చేశానంటే:

గత ఆరు నెలలుగా http://computerera.co.in/forum “కంప్యూటర్ ఎరా” ఫోరంలో ఓ చిన్న ఏర్పాటు చేశాను. ఆ ఫోరంలో ఇప్పటివరకూ 6,552 మంది రిజిస్టర్డ్ సభ్యులు, 9,567 వరకూ పోస్టులూ ఉన్నాయి. ఫోరంని సందర్శించే వారి OS, browser, IPలు వగైరా సమాచారం track చెయ్యడానికి Woopra అనే ఓ శక్తివంతమైన సర్వీస్ ని మా VBulletin ఫోరం scriptతో integrate చేయడం జరిగింది. దాని నివేదికల ప్రకారం మొదట్లో IE6 వాడేవారు 42% వరకూ, IE7 వాడేవారు 25% వరకూ, Firefox వాడేవారు 20% వరకూ, Opera వంటి ఇతర బ్రౌజర్లు వాడేవారు 13% వరకూ ఉండేవారు.  దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా కంప్యూటర్ ఎరా ఫోరంని IE ద్వారా యాక్సెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తే పై భాగంలో సీరియస్ వార్నింగ్ చూపించబడేలా ఓ రెండు లైన్ల html కోడ్ ని header scriptలో జతచేయడం జరిగింది. అప్పటి నుండి నిశితంగా గమనిస్తూ వస్తున్నాను. IE వాడేవారు ఫోరంలోకి ప్రవేశించిన వెంటనే పైన కన్పించే వార్నింగ్ వద్ద firefox లింకుని క్లిక్ చేసి ఆ సైట్ కి వెళ్తున్నట్లు outclicks నమోదు అవుతున్నాయి. ఇప్పుడు 6,552 సభ్యులన్న కంప్యూటర్ ఎరా ఫోరంలో 72% మంది Firefoxని వాడుతున్నారు. IE6ని వాడేవారు 10%, IE7 వాడేవారు 13%, ఇతర బ్రౌజర్లు వాడేవారు 5%.

ఇక్కడ చివరిగా ఒక్క విషయం నేను Internet Explorer ద్వేషిని కాదు. ఒక తెలుగు కంప్యూటర్ మేగజైన్ ఎడిటర్ గా ప్రతీ పిసి యూజర్ సెక్యూరిటీ పరంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటాను. సెక్యూరిటీ పరంగా Firefox, Opera వంటి ప్రత్యామ్నాయాల కన్నా IE మెరుగ్గా ఉంటే ఇప్పటికిప్పుడు IEకి వత్తాసు పలకడానికి నేను వెనుకాడను. మన బ్లాగు మిత్రులను కోరేది మనకంటూ బ్లాగులు ఉన్నాయి, సందర్శకులు వస్తుంటారు, వారు కనీసం ఆలోచించేలా firefox వంటి ఇతర బ్రౌజర్లు వాడమని చెప్పగలిగే బాధ్యతని చిన్న మెసేజ్ మన బ్లాగు సైడ్ బార్ లో పెట్టడం ద్వారా చేద్దాం. ఇప్పుడు ఈ బ్లాగుకి వాడుతున్నది కస్టమ్ wordpress టెంప్లేట్. ఇప్పటికిప్పుడు నేను దీనిలో ఆ మెసేజ్ పెట్టలేకున్నాను, ఫోరంలో ఎటూ గత కొన్ని నెలలుగా ఏర్పాటు చేశాను. మీరు బ్లాగర్ లో add element ద్వారా text మెసేజ్ ని సైడ్ బార్ లో జతచెయ్యవచ్చు.

Currently there are "16 comments" on this Article:

  1. >> నెట్ సెంటర్లలో నేను 1996 నుండి గమనిస్తున్నాను. అప్పట్లోనే ఈఏకి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ అప్పటి నుండి ఇప్పటివరకూ అధికశాతం నెట్ సెంటర్లు ఈఏనే వాడుతున్నాయి.

    ఇప్పటి ఐఈ ఆధిపత్యం సంగతి నిజమే కానీ 1999 దాకా ఐఈ కన్నా నెట్‌స్కేప్ నేవిగేటర్ హవా ఎక్కువ నడిచింది.

    మిగతా బ్రౌజర్లలో లోపాల్లేవని కాదు. ఐఈ పై జరిగినన్ని దాడులు వాటిమీద జరగకపోవటం వాటి లోపాలంత ఎక్కువగా బయటపడకపోవటానిక్కారణం. In a way, IE is a victim of its own popularity. ఇప్పుడు మనమంతా కలిసి సఫారీనో, మొజిల్లానో మొదటి స్థానంలోకి తీసుకొస్తే హ్యాకర్ల దాడులు కొత్త నంబర్ వన్ మీదకి మళ్లుతాయి. అప్పుడు ఐఈ నే గొప్ప బ్రౌజర్లా కనిపిస్తుంది.

  2. nallamothusridhar says:

    అబ్రకదబ్ర గారు, Windows 95 OEM Service Release 2.1 (ఇది 1995లో విడుదల చెయ్యబడింది)తో పాటు Internet Explorer 3 ఇంటిగ్రేట్ చెయ్యబడి లభించేది. అప్పటివరకూ Netscape Navigator ప్రాచుర్యాన్ని నేను కాదనడం లేదు. మరో విషయం ఆ తర్వాత కూడా geeks netscape navigator వాడుతూనే వచ్చారు కొంతకాలం. ఎటొచ్చీ విండోస్ వినియోగం, నెట్ వినియోగం పెరుగుతుండే కొద్దీ బేసిక్ యూజర్లు windowsతో పాటు ఇంటిగ్రేట్ చెయ్యబడిన IEపై ఆధారపడడం మొదలెట్టారన్నది అప్పటి నా పరిశీలన. ఒకవేళ దీనిలో ఏదైనా నా తప్పుడు అభిప్రాయం ఉంటే మన్నించండి. ప్రధానంగా ఇక్కడ నేను అప్పటి నుండి గమనిస్తున్నాను అన్నది ఓ చిన్న ఊతంగా తీసుకున్నాను తప్ప హిస్టరీ ఈ పోస్ట్ కి బేసిస్ కాదు.

    ఇకపోతే IE నుండి మారండి అంటే మిగతా బ్రౌజర్లలో లోపాలు లేవు అని కాదు. ఒక end userగా ఆలోచించండి. ఈరోజు ఎక్కువ సెక్యూరిటీ లోపాలు ఉన్న బ్రౌజర్ నుండి మిమ్మలను మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటారా.. లేక భవిష్యత్ లో ఎటూ ఇప్పుడు కొద్దిగా సేఫ్ గా ఉన్న బ్రౌజర్లు మనం పాపులర్ చెయ్యడం వల్ల సెక్యూరిటీ అటాక్ లకు గురవుతాయన్న ఆలోచనతో ఏదైనా ఒకటే ఇవ్వాళ కాకపోయినా రేపైనా అని ఇప్పుడు ఉదాసీనంగా ఉంటారా? నేను ప్రస్తావిస్తున్నది ఈ రోజు పరిస్థితి. ఈ క్షణం అప్రమత్తంగా ఉండడం గురించి. చివర్లో చెప్పాను రేపు Firefox కన్నా IE బాగుంటుంది అనిపిస్తే దాని గురించి వకాల్తా పుచ్చుకోవడానికైనా రెడీ అని! ఇప్పుడు కొద్దిపాటి మెరుగ్గా ఉన్నదాన్ని వాడమని పిసి యూజర్లని చెబుదాం.

  3. Vara Prasad says:

    >>ఈరోజు ఎక్కువ సెక్యూరిటీ లోపాలు ఉన్న బ్రౌజర్ నుండి మిమ్మలను మీరు రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటారా
    Recent review of the top browsers revealed that IE is more secure than Firefox and Chrome. Usability wise others are better though. I agree with ‘అబ్రకదబ్ర’ that IE is a victim of its own popularity.

  4. Aruna Pappu says:

    హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
    సమయం : శనివారం సాయంత్రం 6- 7
    వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
    దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.

  5. nallamothusridhar says:

    వరప్రసాద్ గారు ముందుగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు ఏదో రీసెంట్ రివ్యూ గురించి చెప్పారు. ఇలాంటి రివ్యూలు మీరూ, నేనూ, ఇతరులం అందరం కొన్నేళ్లుగా గమనిస్తూనే ఉన్నాం. ఒక్కసారి హ్యాకర్ కంటెంట్ ని అందించే సైట్లకు వెళ్లి చూస్తే వివిధ బ్రౌజర్ exploitsలను కొల్లగొట్టడానికి scripts ఏ బ్రౌజర్ కి ఎక్కువగా లభిస్తాయో పరిశీలించవచ్చు. మరో విషయం ఇది firefox బెటరా, IE బెటరా వేదేది బెటరా అన్న డిబేట్ కాదు. గత కొన్నేళ్లుగా ట్రబుల్ షూటింగ్ పరంగా నా దృష్టికి వచ్చిన వివిధ అంశాల ఆధారంగా నా అభిప్రాయం చెప్పాను. ఇక్కడ నేను ఇతర బ్రౌజర్లని వెనుకేసుకురావడం లేదు అన్నది మరోసారి గ్రహించండి. ఈ క్షణానికి మీకు IEనే సేఫ్ గా అనిపిస్తే నిక్షేపంగా దానితోనే కంటిన్యూ అవండి. వేరేవి సేఫ్ అని భావించే వారు వారు వాటితో కంటిన్యూ అవుతారు. ఏదైనా మనకు కావలసింది బెటర్ మెంటే కదా!

  6. laxmi says:

    ఈ రోజు ఈనాడు లో వచ్చిన ఒక ఆర్టికల్ లింక్ ఇది

    http://www.eenadu.net/story.asp?qry1=4&reccount=39

    మైక్రోసాఫ్ట్ సంస్థ స్వయం గా IE లో సమస్యలు ఉన్నాయి, మేము అది ఫిక్స్ చేసే వరకూ వేరే బ్రౌసర్ ల కి మళ్ళండి అని చెప్తుంటే మనం కాదు అని ఎలా అనగలము

  7. nallamothusridhar says:

    అరుణ గారు, శుభవార్త చెప్పారు. ధన్యవాదాలు. తప్పకుండా వీలైన బ్లాగర్లందరం హాజరవుదాం.

  8. Cinderella says:

    Where do I get these kind of sites “ఒక్కసారి హ్యాకర్ కంటెంట్ ని అందించే సైట్లకు వెళ్లి చూస్తే”…
    Please….

  9. nallamothusridhar says:

    Cinderella గారు, ఒక టెక్నికల్ రైటర్ గా హ్యాకింగ్, స్ఫూఫింగ్, రివర్స్ ఇంజనీరింగ్ వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండడం నా వృత్తిధర్మం. ఆ ప్రాసెస్ లో భాగంగా నేను ఇలాంటి సైట్లని మోనిటర్ చెయ్యవలసి వస్తుంటుంది. ఆయా సైట్లు మెయిల్ ఐడిలను తస్కరించడం దగ్గర్నుండి DDoS అటాక్స్ వరకూ ఎన్నో ప్రమాదకరమైన టెక్నిక్ లను కలిగి ఉంటాయి కనుక, అవి హర్షణీయం కాదు కనుక నాకు నేను వాటి వివరాలు ఇక్కడ వెల్లడించలేను.

  10. kishore says:

    Thank You.A good Post by Sridhar.You are correct.
    Don’t Use IE.
    Reason:-
    When i use IE7 i get some messages like “Antivirus 2009″,”Your System Has so many Viruses” such type of message boxes.I foolishley click No on those boxes.Even i click on No i get infected by Viruses.Finally i found the reason that the hackers are writing code such that even we click on No we wil be infected by their viruses.So that means IE is not secure.So please don’t use IE.Use Opera or Fire Fox.

    [Reply]

  11. బాబు says:

    ఏ కోణం నుంచి చూసినా ఫైర్ ఫాక్స్ IE కన్నా మంచి బ్రౌజర్. మీ సూచన అభినందనీయం. కానీ కొన్ని సైట్లు IE లోనే పని చేస్తున్నాయి. అవీ కూడా ముఖ్యమైన వ్యాపార లావాదేవీలు నడిచే సైట్లు! నెటిజనుల తో పాటు సంస్థలను కూడా ఇతర బ్రౌజర్లకు మార్చే బాధ్యత తీసుకోవాలి. నా వరకు నేను చాలామందిని మార్చగలిగాను కానీ, సంస్థలను మార్చడం అంత సులభమైన పని కాదు. ఈ విషయమై నేను ఎయిర్ టెల్ వారితో సంప్రదించగా వారు కూల్ గా ఒక ప్రశ్న అడిగారు.” ఫైర్ ఫాక్స్ అంటే ఏమిటి?” అని…….

  12. nallamothusridhar says:

    లక్ష్మి గారు, కిషోర్ గారు, బాబు గారు అవేర్ నెస్ కోసం రాసిన ఈ పోస్ట్ ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.

  13. కూడలికి వచ్చే IE వాడుకరులకి ఇప్పుడు హెచ్చరిక చూపిస్తున్నాను. (ఇంతకు మునుపు IE6 మరియు ఆ క్రింది పాఠాంతరాలు వాడుతున్నవారికి మాత్రమే హెచ్చరిక కనబడేది.)

  14. @బాబు, సంస్థలని మార్చడానికి మనం కాస్త ఓపిక తెచ్చుకుని వివరించాలి. లేకపోతే, వారితో వ్యవహారాలు మానుకుంటామని చెప్పాలి.

    @అబ్రకదబ్ర, మీరు చెప్పిన ‘popularity victim’ అంశానికి మరో కోణం చేరుస్తున్నాను.

    అన్ని విహారుణులూ, ఆ మాటకొస్తే ఏ కంప్యూటర్ ఉపకరణమూ, సహజంగా భద్రం కావు అన్న విషయాన్ని అంగీకరిస్తున్నాను. కానీ…

    ఇతర విహారుణులు (ముఖ్యంగా మెజిల్లా ఫైర్‌ఫాక్స్ ) భద్రతా లోపాలని త్వరగా పరిష్కరించి లోపరహిత విహారిణిని అంతిమ వాడుకరులకి అత్యంత తక్కువ సమయంలో (ఐయ్యీతో పోలిస్తే) ఇవ్వగలవు.

    గమనిక: నేను మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అభిమానిని. ఈ క్రింది అంశాలు మొజిల్లాని పొగుడుతున్నట్టుగా అనిపించవచ్చు.

    మొజిల్లాకి భద్రతా లోపాలని సవరించి కొత్త వెర్షన్లని కేవలం వారం రోజుల్లోనే విడుదల చేసిన ఘనత ఉంది. ఒకవేళ మంటనక్క గనుక దాడులకి లక్ష్యం అయితే, బయల్పడిన లోపాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలదని మొజిల్లా వికాస ప్రక్రియని గమనించే వాడిగా చెప్పగలను. అంతేగాక, భద్రతా లోపాలని దాచుకోకుండా బహిరంగపరిచి (ఉదాహరణకి మంటనక్క 3 లోని భద్రతా లోపాలు మరియు వాటిని సరిదిద్దిన చరిత్ర) ఆ లోపాలు మనల్ని ప్రభావితం చేయకుండా ఉండే చిట్కా/జాగ్రత్తలను ఎప్పటికప్పుడు అందించే విధానం మరే విహారిణి వద్దా నేను చూడలేదు. అయితే, అంతిమ వాడుకరులు వీటిని అనుసరించ(లే)రనుకోండి. మొజిల్లా సెక్యూరిటీ బ్లాగు: http://blog.mozilla.com/security/

  15. shiva says:

    ఐఇ ని మానివేయటం చాలా మంచిది .సపారి , పైర్పాక్స్ , క్రోం లు మూడూ మంచి బ్రౌజర్లే.

  16. aditya-ram-chran-rohit says:

    Yes Yes it is exactly correct and firefox saves lot of times also. it is very very speed than I.E.
    All the members plz use firefox

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Comment on this Article:







Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి