Home » Uncategorized » Currently Reading:

నవంబర్ 2008 బ్లాగు రివ్యూ: మనలోని మాట – నా మనసులోని మాట

October 27, 2008 Uncategorized 13 Comments

ఈ సమీక్ష యొక్క PDF ఫైల్ ని http://documents.scribd.com/docs/1l54zwier0sleiqwiro7.pdf అనే లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వేల సంఖ్యల్లో ఉన్న తెలుగు బ్లాగుల్లో పదుల్లో ఉన్న మహిళా బ్లాగులన్నీ తమకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. తెలుగు బ్లాగులకు అద్భుతమైన టపాలతో తళుకులీనే మహిళా బ్లాగర్లు వృత్తిపరమైన, కుటుంబపరమైన వత్తిడులను సమర్ధంగా నిర్వహిస్తూ కూడా దీన్ని చక్కని ప్రవృత్తిగా కొనసాగిస్తున్న వైనం ముచ్చటేస్తుంది. సందర్శకులను అలరించే టపాలతో దిగ్విజయంగా బ్లాగు ప్రస్థానం సాగిస్తున్న ప్రముఖ మహిళా బ్లాగరి శ్రీమతి రమణిగారు. హైదరాబాదు వాస్తవ్యురాలైన ఈవిడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. “మనలోని మాట – నా మనసులోని మాట” అంటూ చదువరులందరినీ అలరించే, ఆలోచింపజేసే ఎన్నో ముచ్చట్లు తన బ్లాగులో చెబుతున్నారు రమణిగారు !

పత్రికలో వచ్చిన వ్యాసంతో తెలుగు బ్లాగుల గురించి తెలుసుకున్న రమణి “మన పిల్లలు డబ్బులిచ్చి కాదు, బాల్యాన్ని అమ్ముకుని చదువుకుంటున్నారు” అంటూ అందరినీ ఆలోచింపజేసే టపాతో ఏడాది క్రితం బ్లాగు ప్రారంభించారు. దైనందిన జీవితంలో తనకు ఎదురై మనసుని మెలిపెట్టిన సంఘటనను నేపధ్యంగా తీసుకుని రమణిగారు ఆ టపాలో వ్యక్తపరచిన భావాలు నేటితరం తల్లితండ్రులను నిర్మొహమాటంగా నిలదీస్తాయి! “అనుబంధం – ఆత్మీయత” అనే మలి టపాలోనే పలుచనబడిపోతున్న మానవ సంబంధాల గురించి స్పృశించారు. “ఒక రిలేషన్‌లో మహిళ మగవారి నుండి ఏం కోరుకుంటుంది?” అనే టపాలో మగువ మనసు లోతుల్లోని భావాలని అద్భుతంగా ఆవిష్కరించారు. తను రాసే టపాలు ప్రతి గృహిణి నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో విషయాలు, అనుభవాలను ప్రతిఫలిస్తాయి. అందుకే ఆ టపాల్ని చదివిన మహిళలెవరైనా వాటిలో తమని తాము తరచి చూసుకోగలుగుతారు. ప్రతీ టపాలోనూ స్పష్టమైన , పరిణితితో కూడిన దృక్పధం గోచరిస్తుంది.

“దేవుడు భక్తి” అనే టపాలో ఇలా అంటారు… “పూర్వకాలంలో భక్తి అంటే స్వర్గం కోసమో నరకం కోసమో అని విన్నాము. కాని ఇప్పటి భక్తి స్వర్గ నరకాల కోసం కాదు.. జీవితం కోసం. జీవించడం కోసం. జీవితానికి సంబంధించిన కోరికల కోసం! నిరుద్యోగికి ఉద్యోగం రావాలనో.. ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావాలనో.. ఎవరికి తగ్గ రీతిలో వాళ్లు ఎప్పుడే ఇబ్బంది ఎదురైతే అవి పోవాలనే దేవుడిని కోరుకోవడం జరుగుతుంది.

” అన్నింట్లోనూ దేవుడిని చూసే మనిషి తీరా చివరకు చేరుకునే మజిలీ “దేవుడా నీవే దిక్కు” అంటూ రమణిగారు తార్కికంగా విశ్లేషించిన తీరు.. అదే టపాలో అలాగని తాను నాస్తికురాలిని కాదంటూ దేవుడికి, జీవితానికి ఎలా ముడిపెట్టాలో స్పష్టమైన గీతను గీసిన పద్ధతి బాగున్నాయి. “దీని భావమేమి తిరుమలేశా?” అనే టపాలో బ్లాగరి ఆ వేంకటేశ్వరుడితోనే ఈ మెసేజ్ 15 మందికి పంపండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది వంటి SMSలు, మెయిల్ మెసేజ్‌ల గురించి సంవాదం చేస్తూ చివరకూ వేంకటేశ్వరుడు సైతం అలిమేలుమంగని ప్రసన్నం చేసుకోవడానికి అదే బాటని పట్టేలా సృష్టించిన హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. అలాంటి మెసేజ్‌లు పంపేవారికి చురుక్కుమనిపించేలా రమణిగారు ఈ టపాని సృష్టించారు.

“జీవిత పరమార్ధం” అనే టపాలో మనిషి జీవితంలోని వివిధ దశలను విశ్లేషిస్తూ ఒక సందర్భంలో ఇలా అంటారు.. “బాగా ఆకలేస్తున్నవాడిని నీ జీవిత పరమార్ధమేమిటి అని అడిగితే ప్రస్తుతం ఆకలి తీర్చుకోవడం అన్నట్లు.. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారిపోయేదే ఈ జీవిత అర్ధం., పరమార్ధం అని నాకనిపిస్తుంది. అవధిలేని (అవనిలోని) ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం. ఏ పని చేసిన మన ఆత్మ సంతృప్తి చెందాలి అదే జీవిత పరమార్ధం.” అంటూ అందరినీ తొలిచే అతి పెద్ద ప్రశ్నార్ధకాన్ని అవలీలగా తన తర్కంతో చేధించిన తీరు చాలా బాగుంది.

జోలపాటలు, పిల్లలు అడిగే కథల గురించి “తల్లడిల్లే వేళా… తల్లి పాడే జోలా” అనే టపాలో పిల్లల మానసిక స్థితిని రమణిగారు ఎంత అద్భుతంగా విశ్లేషించారో మీరే చూడండి.. “ఫలానా హోంవర్క్ చూసి ఫలానా టీచర్ ఏమంటుందో? లేదా ఫలానాది చదువుకోలేదు అని టీచర్ కొడుతుందేమో అన్న ఆలోచనలవల్ల కలిగే భయం తల్లిని తన దగ్గర ఉండమనో, తన దగ్గర పడుకోమనో చెప్పేటట్లు చేస్తాయి. అలా ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు పాట పాడమనో, లేదా కథ చెప్పమనో అడిగేలా ఉసిగొల్పుతాయి. ఊ.. కొడ్తూ నిశ్చింతగా నిద్రపోవడానికి చేసే చిన్ని మనసుల అతి చిన్న ప్రయత్నమిది…” అంటారు. ఎంత లోతైన విశ్లేషణో! అనునిత్యం తటస్థించే విభిన్న అంశాల గురించి తార్కికంగా ఆలోచిస్తూ చక్కని నిశ్చితాభిప్రాయాలకు వస్తుంటారు అనిపిస్తుంది రమణిగారి బ్లాగులోని టపాలు అలా తరచి చూస్తే! ఎన్నో సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన ఆవిడ బ్లాగులో ప్రస్పుటంగా కని్‌పిస్తుంది. ఇలాంటి బ్లాగర్లు తెలుగు బ్లాగు ప్రపంచానికి జీవం పోస్తున్నారనిపించక మానదు.

మంచి విషయాలు చెప్పడం వరకే కాకుండా మనం కూడా తప్పనిసరిగా పాటించాలని తన ఇంటి దగ్గర ఇరుగుపొరుగులతో కలిసి విజయవంతంగా నిర్వహించిన ” బత్తీబంద్” కార్యక్రమ విశేషాలు “విజయోత్సాహం” అనే టపాలో వివరించారు. బ్లాగులోకంలో చోటుచేసుకుంటున్న పరిణామలను కూడా నిశితంగా పరిశీలిస్తూ బ్లాగర్ల మధ్య చక్కని వాతావరణం నెలకొనడానికి తన వంతు విజ్ఞతను “ఎవరికెవరు ఈ బ్లాగ్లోకంలో ఎవరికి ఎరుక?” అనే టపాలో ఇతరులకు పంచిపెట్టిన తీరు బాగుంది.

వారమంతా అలసిన భార్యకు సాయం చెయ్యడానికి భర్త ఒక్క ఆదివారం చేసిన వంట ప్రహసనం ఎన్ని ఇక్కట్లకు దారితీసిందో “దొరకునా ఇటువంటి సేవ” అంటూ చాలా చక్కగా వర్ణించారు. బహుశా ఉద్యోగినులైన మహిళలకు ఇది స్వానుభవామేమో! ఇటీవల బ్లాగర్లకు అద్భుతమైన సందేశాన్నిచ్చిన టపా “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” . ఇప్పుడు రమణి అనగానే అందరు బ్లాగర్లకు గుర్తొచ్చేది రోట్లో రుబ్బిన “కందిపచ్చడి”.

తోటి బ్లాగర్ల టపాలను ఠంచనుగా చదువుతూ విభిన్న అంశాలపై తన గళాన్ని టపాల రూపంలో వినిపించే నైజం రమణిగారి అనేక టపాల్లో గోచరిస్తుంది. మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు, ప్రస్తుత పోకడలపై స్పష్టమైన భావజాలం ఆ టపాల్లో కనిపిస్తుంది. ఆవిడ టపాలు మనసులో ఎంత ఆలోచన రేకెత్తిస్తాయంటే గతంలో చదివినవే అయినా ఈ సమీక్ష కోసం మళ్లీ తెరిచి చదువుతుంటే సమీక్ష సంగతి పక్కన పడేసి ఆ టపాల్లో బందీ అయిపోవడం జరుగుతోంది. అయస్కాంతం లాంటి టపాలతో కూడిన ఈ బ్లాగుని మిస్ అయ్యే సాహసం చెయ్యకండి. ఇలాంటి మంచి అంశాలతో రమణిగారు తెలుగు బ్లాగ్లోకాన్ని మరింత అలరిస్తారని ఆశిద్దాం.

సమీక్ష : జ్యోతి వలబోజు

Currently there are "13 comments" on this Article:

  1. రమణి గారి బ్లాగు తెలుగు బ్లాగులలో ఆణిముత్యం లాంటిది . అందులోని టపాలు వేటికవే చదువ తగ్గవి . మంచి సమీక్ష .

  2. Purnima says:

    మంచి పరిచయం! రమణిగారికి అభినందనలు!

  3. malathi says:

    రమణీయ బ్లాగరి రమణికీ, సమీక్షకులు జ్యోతికీ కూడా అభినందనలు. చాలాబాగా చెప్పేరు.

  4. కొత్తపాళీ says:

    రమణి గారి బ్లాగు ముత్యమనీ వాకృచ్చిన తెలుగు రత్నగారి అభిప్రాయంతో విభేదిస్తున్నా మధ్యక్షా.
    రమణి గారి బ్లాగు “మణి” పూస అవుతుంది కానీ ముత్యం కాదని ఇందుమూలముగా తెలియచేసుకుంటున్నాము.
    రమణి గారు, ఈ సమీక్షలో చెప్పిన ప్రతి మాట నిజం. అభినందనలు.

  5. వికటకవి says:

    రమణి గారిది చదవతగ్గ బ్లాగు. అభినందనలు.

  6. varudhinit says:

    అభినందనలు రమణీమణి!

    కొత్తపాళీ గారూ, బాగా చెప్పారు.

  7. psmlakshmi says:

    రమణిగారి టపాల్లో కొన్నే చదివాను. ఈ పరిచయం చదవగానే ఎన్ని మిస్ అయ్యానో అనిపించింది. ఇతరులను ఆలోచింపచేసే రచనలు వాటికవ్వేసాటి. రమణిగారూ శుభాకాంక్షలు. చక్కని సమీక్ష అందించిన జ్యోతిగారూ శుభాకాంక్షలు. psmlakshmi

  8. manchiparichayam ramanigaru chala baga chepparu. very good

  9. Adbuthamaina sarali ramanigaridi very intrasting keep it up ramani

  10. ramani says:

    సమీక్షించిన జ్యోతిగారికి, వ్యాఖ్యలతో ప్రోత్సహించన మిత్రులకి/మిత్రురాళ్ళకి, పెద్దలకి, కంప్యూటర్ ఎరా సంపాదకులు శ్రీధర్ గారికి కృతజ్ఞతలు.

  11. చాలా ఆలస్యంగా చదివాను,అయినా ఆనందమే,రమణి గారిది సామాన్యంగా కనిపించే విభిన్నశైలి,ఆవిడే అచ్చంగా వాడే కొన్ని పదాలున్నాయి :) కాకుంటే కొన్నిటపాలు సుదీర్ఘంగా ఉన్నాయి అనిపిస్తుంది.ఏడాది క్రితం రమణి గారి రాతలకీ ఇప్పటికీ గుణాత్మకంగా మంచి పరిణితి కనిపిస్తుంది,ఈ విధంగా మంచి అభ్యాసం కొనసాగిస్తే మనకి ఒక మంచి వ్యాఖ్యాత,వ్యాసకర్త దొరుకుతారు అన్న ఆశ కలుగుతుంది.అభినందనలు రమణి గారు,జ్యోతి గారి వచనం సరళంగా సాగింది,బాగుంది

  12. ramani says:

    థాంక్స్ రాజేంద్ర గారు. ఒకవిధంగా చెప్పాలంటే మీ అందరి ప్రోత్సాహమే నా బ్లాగు ఈరోజిలా రివ్యూ దాకా రావడానికి కారణమని చెప్పొచ్చు. తప్పక మీ సలహాలని పాటిస్తాను. (సుధీర్ఘం విషయంలో మరి కొంచం జాగ్రత్త తీసుకొంటాను)

  13. budugu says:

    రమణి గారు మీకు అభినందనలు. మీరు సుధీర్ఘంగా రాసినా చదవాలనిపించేలా ఉంటాయి. మంచి శైలి మీది. జ్యోతిగారు మీ రచనా శైలి గంభీరత చాటుకుంది.

Search This Site:

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ TV 9, ABN, I News, ETV2, NTV, Zee 24 గంటలు, Studio N, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 100కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1704 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. My Contact Number: 9000239948 Mail ID: sridharcera@gmail.com

Comment on this Article:







ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి

ఆండ్రాయిడ్ లో పొందండి!

నా వీడియోలను మీ దగ్గర ఉన్న Android ఫోన్ లో పొందాలంటే ఈ క్రింది లింక్ ని మీ ఫోన్ బ్రౌజర్ లో ఓపెన్ చేసి వెంటనే వచ్చే అప్లికేషన్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. అన్ని వీడియోలూ ఎంజాయ్ చేయండి. http://goo.gl/DqsA4

లేదా ఈ క్రింది QR Codeని మీ Android ఫోన్ లోని Barcode Scannerతో స్కాన్ చేస్తే నేరుగా అప్లికేషన్ డౌన్ లోడ్ పేజీకి వెళ్లవచ్చు. Image and video hosting by TinyPic