కొత్తపాళీ …. నవంబర్ 2007

January 31, 2008 Uncategorized 6 Comments


http://kottapali.blogspot.com

ముచ్చటగా మూడు వసంతాలు కూడ నిండని తెలుగు బ్లాగ్మయంలో ఒక యేడాదిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలాంటి టపాలతో చదువరులను అలరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. సరిగ్గా అలాంటి అరుదైన విలక్షణత్వాన్ని సొంతం చేసుకున్నదే కొత్తపాళీ గారి బ్లాగు కొత్తపాళీగారి అసలు పేరు నారాయణస్వామి. కొత్తపాళిగారు ఉద్యోగరీత్యా ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్ రాష్టంలో ఉంటున్నారు. కొత్తపాళిగారు నిర్వహిస్తున్న నాలుగు బ్లాగులలో ఇక్కడ మనం సమీక్షిస్తున్న “కొత్తపాళి” ఒకటి మాత్రమే. మిగతా బ్లాగులు విన్నవీ కన్నవీ , Classical Telugu Poetry in Translation, Classical Telugu Poetry . కొత్తపాళి బ్లాగు గత ఏడాది అక్టోబర్ నెలలో మొదలైంది. రచయిత తన బ్లాగులో తాను చెదురుమదురుగా వ్రాస్తున్న టపాలని, విషయాన్ని బట్టి గుర్తుంచుకోవడానికి వీలుగా 12 వర్గాలుగా విభజించారు. అవి. 1.మాటలు, 2.వ్యక్తులు, 3.కవిత్వం, 4.సంగీతం, 5.నీతి, 6.(అ)సాధారణ వ్యక్తులు, 7.జ్ఞాపకాలు, 8.నా గొంతు, 9.పుస్తకాలు, 10.ప్రకృతి, 11.భక్తి, 12.సంస్కృతం. ఈ అన్ని వర్గాల క్రింద పలు రచనలున్నాయి.

కొత్తపాళిగారి రచనలకు ప్రేరణ : “నేనూ నా కుటుంబం అనే స్వార్ధపరిధిని దాటి ఒక్క అడుగన్నా బయటికి వెయ్యాలి. ఊరికే మట్టిబొమ్మలా పెట్టినచోటే కూర్చుంటే ఎవరికి ప్రయోజనం .. ’కలుగ నేటికి? తల్లుల కడుపు చేటు’.. మీకిష్టమైన మీకు తృప్తి నిచ్చే పని కాబట్టి చెయ్యాల్సిన వ్యక్తి మీరే.. ఎందుకంటే ఇంకెవ్వరూ చెయ్యరు కాబట్టి, చెయ్యాల్సిన సమయం ఇప్పుడే” అంటారు రచయిత ’మనిషై పుట్టినందుకు’ అనే టపాలొ.

ఆయన ఇప్పటివరకు చేసిన టపాలన్నీ ఈ ప్రవచిత ఆశయానికి అనుగుణంగానే ఉండడం గమనార్హం. పైకి మాటామంతీలా కనపడే టపాల్లో సైతం ఏదో అంతర్లీన సందేశం మనల్ని అలవోకగా స్పృశిస్తుంది. ” కదిలేది కదిలించేదీ పెను నిద్దుర వదిలించేది ” అని కవిత్వం గురించి శ్రీశ్రీ చెప్పినది గుర్తొస్తుంది కొత్తపాళిగారి బ్లాగు చదివినప్పుడు. విభిన్న లక్ష్యాలకు అంకితమైన మహామనీషుల గురించి టూకీగా ఆయన రాసిన స్కెచ్‍లు తెలుగు బ్లాగు లోకంలో ఒక కొత్త ఒరవడిని దిద్దాయి. ఆ విధంగా ఆయన రచన అనే సంఘసేవకురాలి గురించి, కుర్ట్ వానగట్ అనే రచయిత గురించి, మేడసాని మోహన్‍గారి కృషి గురించి, నవోదయ పబ్లిషర్స్ అధినేత శ్రీ అట్లూరి రామమోహనరావుగారి గురించి, అమెరికాలో తెలుగు భాషాభోధనకై కృషి చేస్తున్న శ్రీ వేమూరి వేంకటేశ్వరరావుగారి గురించి విపులంగా నెజ్జనులకు తెలియజేసారు.

తెలుగు భాషాభిమానం : ఈ విషయంలో నివాసాంధ్రులు ప్రవాసాంధ్రుల నుంచి నేర్చుకోదగినది ఎంతైనా ఉంది. కొత్తపాళిగారి ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉంటున్నప్పటికీ ఆయనలో తెలుగు భాషాభిమానమూ, మాతృదేశాభిమానమూ ఇనుమడించాయే గాని మసకబారలేదు. “సీసపద్యం అంటే ఏంటి? అని అడిగేవాళ్ళు లక్షణ పద్యాన్ని వందసార్లు ఇంపోజిషన్ రాయాల్సి ఉంటుంది.” అంటారు చలోక్తిగా “మీకిష్టమైన సీసపద్యం” అనే టపాలో!

సామాన్యత్వంలో అసామాన్యత్వం : “రొటీన్ అనగానే అదేదో జాలిపడవలసినది అసహ్యించుకోదగినది” అనే భావం స్పురిస్తుంది.. నా మట్టుకు నాకు కొంచెం రొటీను ఉండడం మంచిదే అనిపిస్తుంది. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తులు రచయితల్ని, కళాకారుల్ని చూసి అసూయపడతారు.. వాళ్లకు రొటీను లేదని. అది పొరబాటు.. పేరుపొందిన ఏ కళాకారుడి జీవితాన్ని చూసినా క్రమం తప్పకుండా నిరంతరం సాధన చెయ్యడం కనిపిస్తుంది. ” అంటారు కొత్తపాళి ఒక చోట. తెలుగు బ్లాగింగులో నూతన ప్రమాణాల్ని నెలకొల్పి అనతికాలంలోనే అనల్పమైన ప్రాచుర్యాన్ని ఆర్జించుకున్న కొత్తపాళి బ్లాగు అవశ్యం, పఠనీయం, పాఠనీయం..

సమీక్ష : తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

కంప్యూటర్ ఎరా రెండవ పాఠకుల సమావేశ నివేదిక

January 27, 2008 Uncategorized 5 Comments

“కంప్యూటర్ ఎరా” రెండవ సమావేశ నివేదిక
స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటలు.

హాజరైన సభ్యులు:

1. జి.పి. జాకబ్
2. ఎన్. కృష్ణ కిషోర్
3. మున్నా కాల్పనిక్
4. డి. శశి భూషణ్
5. సి.హెచ్. శివరామ ప్రసాద్ (విజయవాడ)
6. జి. చైతన్య
7. సి.హెచ్. సత్యనారాయణ
8. కె. నాగభూషణం (వరంగల్)
9. పి. శ్రీనివాస్
10. పి. శ్రీకర్
11. నల్లమోతు శ్రీధర్
శ్రీనివాస్ (పర్చూరు), నవీన్ రెడ్డి చివరి నిముషంలో అర్జెంటు పని పడడం వల్ల రాలేకపోయారు. టి. రామచంద్రరావు గారు (కర్నూలు) ప్రయాణ సదుపాయం కారణంగా హాజరుకాలేకపోయారు. రవీంద్ర కాట్రగడ్డ, వినయ్ గార్లు కూడా అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. మౌర్య, అభిరామ్, మురళి తదితరులు దూరప్రాంతాల నుండి రావడం వీలుపడక హాజరు కాలేకపోయారు. జాకబ్ గారి మిత్రులు ఒకరు మీటింగ్ తుదిదశలో కలవగలిగారు.

అందరి పరిచయాలూ అయ్యాక పలు పలు అంశాలపై చర్చ జరిగింది. చాలా మంచి ఆలోచనలు వచ్చాయి. పాత ఫోరంలోని ముఖ్యమైన పోస్ట్ లను కొత్త ఫోరంకి తీసుకువచ్చి మార్చి నెలాఖరు నాటికి పాత ఫోరంని పూర్తిగా క్లోజ్ చేయాలన్నది ఆలోచన. దానికి గాను కొంతమంది ఉత్సాహవంతులు పాత ఫోరంలోని పోస్టులను కొత్త ఫోరంలోకి బదిలీ చేసే ప్రక్రియను బాధ్యతగా స్వీకరించాలన్న ప్రతిపాదనకు చైతన్య గారు, నాగభూషణం గారు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రసాద్ గారు, శ్రీనివాస్ కర, జ్యోతి గారు, జాకబ్, మౌర్య, వర్మ దాట్ల, నల్లమోతు శ్రీధర్ వంటి వారు ఇదే పనిలో కొంత ప్రోగ్రెస్ సాధించారు. చైతన్య, నాగభూషణం గార్లు కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల త్వరగా కంటెంట్ ని ట్రాన్స్ ఫర్ చేయగలుగుతాం.

ఇకపోతే కొత్త ఫోరమ్ ని ఇప్పుడే మొదలుపెట్టాం కాబట్టి దానిలో స్పామ్ పోస్టులు, ఇల్లీగల్ కంటెంట్ లేకుండా ఇప్పటినుండే జాగ్రత్తగా నిర్వహించుకోవడం ఎలా అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైతే అనధికారిక పోస్టులు చేస్తారో ఆ పోస్ట్ చేసిన వారికి PM, Email చేసి ఎడ్యుకేట్ చేయడంతోపాటు, పోస్ట్ లోని సమాచారాన్ని తీసేసి.. ఆ సమాచారం ఎందుకు తీసివేయబడిందో కారణం తెలిపితే బాగుంటుంది అనే సూచనలు వచ్చాయి. దయచేసి ఇకపై మోడరేటర్లందరూ ఈ విధంగా చేయగలరు.

మనం చేస్తున్న కార్యకలాపాలను మరింత మంది దృష్టికి తీసుకువెళ్లి వారికి ఉపయోగపడేలా చేయడంతోపాటు వారినీ భాగస్వాములను చేయడం ఎలా అనే విషయమై స్కూల్, కాలేజీ యాజమాన్యాల సహకారంతో రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో సెమినార్లు నిర్వహిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన ప్రసాద్ గారు చేశారు. దీనికి వెంటనే ప్రతిస్పందనగా చైతన్య సత్తుపల్లి (ఖమ్మం జిల్లా)లో తమ కాలేజీల్లో వీలైనంత త్వరలో సెమినార్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇతర పాఠకులు కూడా తమకు అవకాశం ఉంటే, మీకు పరిచయం ఉన్న స్కూల్, కాలేజీల యాజమాన్వాలతో మాట్లాడి ఐ.టి ట్రెండ్స్, ఐ.టి. రంగంలో నిలదొక్కుకోవాలంటే ఎలా, ఐ.టి. రంగంలోకి ప్రవేశించేవారి మైండ్ సెట్ ఎలా ఉండాలి వంటి విషయాలపై సెమినార్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తే ఆయా విషయాలపై అవగాహన ఉన్నవారు హాజరై (వీవెన్, సుధాకర్, కిరణ్ కుమార్ చావా, వెంకటరమణ, దాట్ల శ్రీనివాసరాజు వంటి నిపుణులతోనూ ఈ విషయం ప్రస్తావిస్తాను) విద్యార్థులను గైడ్ చెయ్యడానికి వీలుపడుతుంది.

అలాగే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పాఠకుల సమాచారం ఒకచోట చేర్చడం తద్వారా ఆయా ఊళ్లలో ఉండే పాఠకులు అక్కడికక్కడే సమావేశాలు నిర్వహించుకుని, సాంకేతికపరమైన చర్చలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం విషయమై ప్రసాద్ గారు ఓ టేబుల్ ఫోరంలో క్రియేట్ చేసి ఎవరైనా అందులో తమ వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాటు చేద్దామన్నారు. త్వరలో ఆ పద్ధతి ప్రారంభించడం జరుగుతుంది. అలాగే పరిచయస్థులకు way2sms.com వంటి వెబ్ సైట్ల ద్వారా http://computerera.co.in/forum, http://computerera.co.in/chat సైట్ల గురించి పరిచయం చేయడం, Orkutలోని స్నేహితులకు స్ర్కాప్ లు పంపించడం, పాంప్లెట్లు ప్రచురించి విద్యాసంస్థల్లో పంపిణీ చేయడం వంటి చక్కని సూచనలు వచ్చాయి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని మీవంతు సహకారంగా ఈ మీటింగ్ కి హాజరు కాలేని పాఠకులు కూడా తమకు తెలిసిన స్నేహితులకు, పరిచయస్థులకు SMSలు (మంచి అనేక కొటేషన్లని SMSల రూపంలో ఫార్వార్డ్ చేస్తుంటాం. అవి జనాలను మోటివేట్ చేస్తాయో లేదో తెలియదు కానీ, కనీసం అందరికి సహాయపడడానికి రూపొందించబడిన పై వెబ్ సైట్ల గురించి ఒక్క మెసేజ్ మీకు తెలిసిన వారికి పంపించగలరు), Orkut Scraps రూపంలో పరిచయం చెయ్యగలరు.

అలాగే ఫోరంలోని సమాచారం ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. ఒక పోస్ట్ రాశామంటే అది ఎంతోమందికి అలా ఉపయోగపడుతూనే ఉంటుంది. అదే ఛాట్ రూమ్ లో ఒకరికి సందేహం తీర్చామంటే అది ఆ ఒక్కరికి, లేదా మరో ఇద్దరు ముగ్గురకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపధ్యంలో తరచూ ఛాట్ రూమ్ లో తీర్చే సందేహాలను ఫోరంలో వివరంగా పోస్టులను రాయడం ద్వారా.. ఇకపై అవే సందేహాలు ఛాట్ రూమ్ లో మళ్లీ మళ్లీ అడగబడుతుంటే ఫోరంలోని సంబంధింత లింక్ ని ఇస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన వచ్చింది. అదే సమయంలో అలా తరచూ అడగబడే సందేహాలను ఫోరంలో ఓ థ్రెడ్ లో ప్రచురించి, ఛాట్ రూమ్ లోనే లింకుల వద్ద FAQల పేరిట ఆ థ్రెడ్ యొక్క లింక్ ఇస్తే మరీ బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది.

ఇకపోతే ఫోరంలో ఎవరైనా ఏదైనా సందేహం అడిగినప్పుడు దానికి ఎవరైనా ఇచ్చిన సమాధానం వల్ల పరిష్కారం లభించినప్పుడు ఆ పోస్ట్ సబ్జెక్ట్ లైన్ లో “Solved” అనే పదం చేర్చడం ద్వారా మరింత మంది ఆ పోస్టు ద్వారా ప్రయోజనం పొందవచ్చన్న ఆలోచన జాకబ్ గారు వ్యక్తపరిచారు. ఈ నేపధ్యంలో సందేహాలు అడిగేవారు ఎవరైనా ఇచ్చిన సమాధానం వల్ల తమ సందేహం పరిష్కరించబడితే దయచేసి తమ పోస్ట్ సబ్జెక్ట్ లైన్ ని edit చేసి Solved అనే పదాన్ని చేర్చండి. అలాగే అనేక ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పిన వారికి పాయింట్లు ఇచ్చే పద్ధతిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అదీ మొదలుపెట్టాలి.

మాతృభాష విషయమై మనం చేసే పోస్టులలో వీలైతే పూర్తిగానూ, లేదా పాక్షికంగానూ లేదా కనీసం సబ్జెక్ట్ లైన్ వరకూ అయినా తెలుగులో టైప్ చేస్తే బాగుంటుంది అని ప్రతిపాదించడం జరిగింది. దయచేసి వీలైన వారందరూ దీనిని పాటించగలరు.

నిరంతరం ఫోరంని పరిశీలిస్తుండే మోడరేటర్లుగా వ్యవహరించడానికి చైతన్య, నాగభూషణం గారు ముందుకు వచ్చారు. అలాగే ఇక్కడ మరో విషయమూ చర్చలోకి వచ్చింది. ఫోరంలోని వేర్వేరు విభాగాలను వేర్వేరు వ్యక్తులు మోడరేట్ చేయాలన్నది. ఉదా.కు.. సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్స్ అనే విభాగానికి ప్రసాద్ గారు మోడరేట్ చేస్తే పిసి చిట్కాలు అనే విభాగానికి చైతన్య, మరో విభాగానికి మౌర్య, అభిరామ్, శ్రీనివాస్ ఇలా బాధ్యతలు పంచుకుంటే పని సులువు అవుతుంది అన్న ప్రతిపాదన ప్రసాద్ గారు చేశారు. వీలైనంత త్వరలో ఆయా బాధ్యతల విభజన చేసుకుందాం. మోడరేటింగ్ పై ఆసక్తి ఉండి, మన లక్ష్యాల పట్ల చిత్తశుద్ది కలిగిన వ్యక్తులు ముందుకు రాగలరు. అలాగే మోడరేటర్ల మధ్య సరైన
సమన్వయం ఉండాలి. ఒకరికొకరు తరచూ సంప్రదించుకుంటూ తమ మధ్య అభిప్రాయ బేధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదు, అందరం సమానమే. కలిసి కష్టపడదాం, కలిసి నాలెడ్జ్ ని షేర్ చేద్దాం.

http://computerera.co.in/chat అనే “సాంకేతిక సహాయం” ఛాట్ రూమ్ లో ప్రశ్నలు అడిగేవారు ఎక్కువయ్యారు, సమాధానాలు చెప్పేవారు తక్కువయ్యారు అన్న ప్రస్తావన వచ్చి, వీలైన వారందరూ రోజులో కొద్దో గొప్పో సమయం అక్కడ స్పెండ్ చేస్తూ ఇతరులకు సాయపడదామని నిర్ణయించుకోవడం జరిగింది. మీటింగ్ కి హాజరు అవలేకపోయిన మిగిలిన పాఠకులు కూడా మీకు వీలైన సమయాల్లో ఆ ఛాట్ రూమ్ లో గడుపుతూ మీ సందేహాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకు కాస్త సాయపడండి. మనం ఎంత సాయపడితే మనకు అంత సాయం లభిస్తుంది. అలాగే ఛాట్ రూమ్ ని సందర్శించే సభ్యులకు ఇల్లీగల్ సమాచారం, హ్యాకింగ్ వంటి పద్ధతుల గురించి అడగవద్దని, ఒకే మెసేజ్ ని పలుమార్లు కాపీ పేస్ట్ చేసి స్పామ్ చేయవద్దని, ఇలా పలు అంశాల విషయమై ఓపికగా గైడ్ చేయవలసి ఉంటుంది. అందరినీ మనలో కలుపుకుపోవాలి కానీ విసుక్కుని ఎవరినీ దూరం చేసుకోకూడదు.

అలాగే ఛాట్ రూమ్ లో ఇప్పటికే పరిష్కరించబడిన సమాధానాలను గిరిచంద్ గారు (అహ్మదాబాద్) ఛాట్ లాగ్ ల ఆధారంగా ప్రశ్న, సమాధానాలను ఓ క్రమపద్ధతిలో అమర్చుతున్నారు. దానిని అటు ఫోరంలో FAQలుగా ప్రచురించడంతోపాటు ఛాట్ లో ఇతరుల సమస్యలను పరిష్కరించే ప్రతీ వ్యక్తీ వద్ద ఓ కాపీ ఉంచుకునేలా ఏర్పాటు చేయాలి.

నాగభూషణం (వరంగల్) గారు Free Software Foundation వంటి సంస్థలతో వాటి నిర్వాహకులు కిరణ్ చంద్ర వంటి వారిని కలవడం ద్వారా అవగాహన కుదుర్చుకుంటే నాలెడ్జ్ ని అందరికీ చేరవేసే మన లక్ష్యాన్ని చాలా సులభంగా సాధించవచ్చని సూచించారు. ఈ విషయమై మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఉచిత సాఫ్ట్ వేర్ల వాడకం విషయమై మనం మన సర్కిల్ లో మోటివేషన్ తీసుకురావడం ద్వారా వారి ఉద్యమానికి మన వంతు సాయపడుతూ.. మనం చేస్తున్న ప్రయత్నాలకు వారి సహకారాన్ని ఆసరాగా తీసుకోవచ్చు.

ఇంకా ఎన్నో అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ.. చీకట్లు ముసురుకోవడం, వణికించే చలితో మాటలు రాకపోవడం, అప్పటికే 7 గంటలు అవడం వల్ల ఎవరికీ వెళ్లాలని అన్పించకపోయినా కదలక తప్పలేదు. మెల్లగా ముచ్చట్లు చెప్పుకుంటూ క్యాంటీన్ వరకూ వెళ్లి మిర్చి బజ్జీ, టీలతో కొద్దిగా శరీరాన్ని వెచ్చబరుచుకుని ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నాం.

ఆడియో నివేదిక:

ఈ సమావేశానికి డిజిటల్ కెమెరా అందుబాటులో లేకపోవడం వల్ల ఫొటోలు తీయడానికి వీలుపడలేదు. అలాగే సెల్ కెమెరాతో వీడియో తీద్దామన్న ఆలోచన వచ్చేసరికి చీకటి పడిపోయింది. లాప్ టాప్ లో రికార్డ్ చేసిన ఆడియో ఏ కారణం చేతనో ఓవర్ లాప్ అయిపోయి ఒకేసారి రెండు వాయిస్ లు వస్తున్నాయి. అందుకే ఇంత వివరంగా మీటింగ్ రిపోర్ట్ ని రాయడం జరిగింది. దాదాపు ఓ ముప్పావు గంట వరకూ ఆడియో రికార్డ్ చేయగలిగాం. దానిని ఒకటి రెండు రోజుల్లో ఇదే పోస్ట్ లో ప్రచురించడం జరుగుతుంది.

గమనిక: ఈ సమావేశం గురించి, ఇందులో చర్చించబడిన అంశాల గురించి మీ అభిప్రాయాలను, సూచనలను సైతం ఇక్కడ పంచుకోగలరు.

- నల్లమోతు శ్రీధర్

సిస్టమ్ క్రాష్ …

January 21, 2008 Uncategorized No Comments

మనం కంప్యూటర్లో ఎప్పటికప్పుడు అత్యంత విలువైన సమాచారం స్టోర్ చేస్తుంటాము.ఈ నేపధ్యంలో దాన్ని బ్యాకప్ తీసుకోవడం మరిచిపోయినప్పుడు ఒక్కసారిగా హార్డ్ డిస్క్ క్రాష్ అయితే పరిస్థితి ఏమిటి? కనీసం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి వెళ్ళగలిగితే… Recover my files, GetDataback వంటి సాఫ్ట్ వేర్లని ఉపయోగించి డిలీట్ అయిన ఫైళ్ళని/పార్టీషన్లని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అయిటే విండోస్ కూడా బూట్ అవని విధంగా సిస్టం క్రాష్ అయినప్పుడు ప్రత్యామ్నాయమార్గం చూసుకోవలసిందే కదా!!

సిస్టం ఎందుకు క్రాష్ అవుతుంది…

సహజంగా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కరెంట్ పోవడం వంటి సందర్భాల్లో హార్డ్ డిస్క్ క్రాష్ అయి కనీసం ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి కూడా బూట్ అవని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో యూజర్ హార్డ్ డిస్క్‌లో తాను స్టోర్ చేసుకున్న ముఖ్యమైన సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయలేకపోతాడు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. హార్డ్ డిస్క్/ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయినంతమాత్రాన “మనం డేటాని నష్టపోయాము, ఇక అది తిరిగిరాదు” అని భయపడాల్సిన పని లేదు. వాస్తవానికి డిస్కుపై డేటా సురక్షితంగానే ఉంటుంది. కేవలం ఆ డేటాని యాక్సెస్ చేయడానికి కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్‌ని మాత్రమే మనం నష్టపోవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేకమైన క్రాష్ రికవరీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించడం ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిలేకుండా మీ హార్డ్ డిస్క్ నుండి డేటాని రికవర్ చేసుకోవచ్చు.


RecoverSoft Data Rescue

సిస్టమ్ క్రాష్ అయి కనీసం విండోస్ కూడా బూట్ అవనప్పుడు డేటాని రికవర్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ Recovery Soft Data Rescue PC.Win XP, 2003లపై మాత్రమే పనిచేసే ఈ సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే సిడి రైటర్‌లో ఖాళీ సిడిని ఇన్‌సర్ట్ చేయమని కోరుతుంది. ఇన్‌సర్ట్ చేసిన వెంటనే ఒక బూటబుల్ సిడిని ఈ సాఫ్ట్ వేర్ తయారు చేస్తుంది.ఇక మన సిస్టమ్ క్రాష్ అయినప్పుడు సింపుల్‌గా ఆ బూటబుల్ సిడితో సిస్టమ్‌ని బూట్ చేయవలసి ఉంటుంది.హార్డ్ డిస్క్‌ని స్కాన్ చేసేలా మనం ఆప్షన్‌ని ఎంచుకున్న వెంటనే ఈ ప్రోగ్రామ్ హార్డ్ దిస్క్‌లోని అన్ని ఫైళ్ళ వివరాలనూ జాబితాగా చూపిస్తూ ప్రతీ ఫైల్‌కీ Excellent, Good, Possible, Poor అనే విధంగా రేటింగులు ఇస్తుంది. Excellent కండీషన్‌లో ఉన్న ఫైళ్ళు తప్పకుండా రికవర్ అవుతాయి. Good,Poossible కండిషన్‌లో ఉన్న ఫైళ్ళపై కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. ఎటొచ్చి మీ ఫైళ్ళు Poor కండీషన్‌లో ఉంటే అవి రికవర్ అవడం కష్టం! రికవర్ చెయ్యదలుచుకున్న ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ ఫైల్‌ని ఏ పార్టీషన్ పైకి రికవర్ చేయాలో ఎంచుకోవాలి. ఒకవేళ మీ వద్ద USB Flash మెమరీ కార్డ్‌లు ఉంటే వాటిపైకి డేటా రిజ్కవర్ అయ్యే విధంగా కూడా ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్ వేర్‌తో ఉన్న ప్రధానమైన సమస్య రికవర్ చేసిన డేటాని NTFS ఫైల్ సిస్టమ్‌లో ఉన్న పార్టీషన్లపైకి రికవర్ చెయ్యడానికి వీలుపడదు.

Ontrack EasyRecovery Lite
ఈ సాఫ్ట్ వేర్ కూడా సిస్టమ్‌ని బూట్ చేసి, హార్డ్ డిస్క్‌ని స్కాన్ చేసి రికవర్ అవగలిగిన ఫైళ్లని G (Good) అనే రేటింగుతోను, రికవర్ అవడానికి వీలుపడని ఫైళ్లని D(Deleted) అనే రేటింగుతోనూ చూపిస్తుంది. ఫ్లాపీ,జిప్ డ్రైవ్ వంటి అన్ని రకాల మీడియాపైకి రికవర్ చేసిన డేటాని కాపీ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలుకల్పిస్తుంది. అయితే ఇంటర్‌నెట్‌పై ఫ్రీగా లభించే ఈ Lite వెర్షన్ ఒకసారికి కేవలం 25 ఫైళ్ళని మాత్రమే రికవర్ చేయగలుగుతుంది. క్రాష్ రికవరీ సదుపాయంతో పాటు పొరబాటున మనం డిలీట్ చేసిన ఫైళ్ళని రికవర్ చేసుకోవడానికి అలాగే ఫార్మేట్ చేయబడిన పార్టీషన్ల నుండి డేటాని రికవర్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్‌లో ఆప్షన్లు లభిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ RSS ఫీడ్‌కి సబ్‌స్క్రైబ్ చేయండి.

January 21, 2008 Uncategorized 1 Comment

చాలామందికి తెలియని విషయం ఒకటుంది.. Microsoft Download Center వేరు.. Microsoft Update వేరు అన్నది కొంతమందికే తెలుసు. మనం Windows Automatic Updates సర్వీస్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేయ్యడానికి ప్రయత్నించినప్పుడు అది Microsoft UPdates సైట్‌కి కనెక్ట్ అయి మన సిస్టమ్‌లో లేని సెక్యూరిటీ ప్యాచ్‌లు, hot fixలు ఏవైనా ఉంటే వాటిని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది. అయితే మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ ఎప్పటికప్పుడూ వేర్వేరు సాఫ్ట్ వేర్లని విడుదల చేస్తుంటుంది. అలాంటి కొత్త సాఫ్ట్ వేర్లు అన్నింటిని Microsoft Download Center వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటూంది. ఈ నేపధ్యంలో ఎప్పటికప్పుడూ ఏయే కొత్త సాఫ్ట్ వేర్లు మైక్రోసాఫ్ట్ నుండి విడుదల చేయబడుతున్నాయో తెలుసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ RSS ఫీడ్‌కి మీ ఇ-మెయిల్ అడ్రస్‌తో సబ్‌స్క్రైబ్ చేస్తే తాజాగా విడుదలయ్యే సాఫ్ట్ వేర్ల వివరాలు మెయిల్‌కి వచ్చేస్తాయి.

Mouse ఎలా పని చేస్తుంది…

January 19, 2008 Uncategorized No Comments

మన చేతి యొక్క కదలికను సిగ్నళ్ళుగా మార్చి కంప్యూటర్ ఆ సిగ్నళ్లని ఉపయోగించుకునే విధంగా పని చేసేదే మౌస్! మౌస్‌లలొ Normal, Optical మౌస్‌లని రెండు రకాలున్నాయి. Normal మౌస్ పనితీరు ఇలా ఉంటుంది.మౌస్ లోపల ఉండే బాల్ టేబుల్ ఉపరితలాన్ని తగులుతూ మనం మౌస్ ఏ దిశలో మూవ్ చేస్తామో ఆ దిశలో తిరుగుతుంటుంది. మౌస్ లోపల ఉండే రెండు రోలర్స్ బాల్‌ని తాకుతూ ఉంటాయి. Xదిసలో కదలికను గుర్తించిన్ అవెంటనే వాటిలో ఒక రోలర్ తిరుగుతుంది. అలాగే Y దిశలో కదలిక కనిపించినప్పుడు మొదటి రోలర్‌కి 90 డిగ్రీల దిశలో ఆ రోలర్ తిరుగుతుంటుంది. ప్రతీ రోలర్ shaftకి కనెక్ట్ చెయ్యబడి ఆ shaft రంధ్రాలను కలిగిఉండే డిస్క్ ని తిప్పుతుంటుంది. డిస్క్‌కి ఒక వైపు infrared LED మరోవైపు infrared sensor ఉంటాయి. LED నుండి వెలువడే కాంతి కిరణాన్ని డిస్క్ పై ఉండే holes సాయంతో సెన్సార్ గుర్తిస్తుంది.ఈ కాంతి యొక్క pulse మౌస్ స్పీడ్, అది ప్రయాణించే దూరాన్ని బట్టి మారుతుంటుంది. మౌస్‌లోనే ఉండే ఓ చిన్న ప్రాసెసర్ చిప్ infrared sensors నుండి వెలువడిన pulses ని చదివి కంప్యూటర్ అర్ధం చేసుకోగలిగే బైనరీ డేటాగా వాటిని కన్వర్ట్ చేస్తుంది. మౌస్ కేబుల్ ద్వారా ఆ బైనరీ డేటాని మౌస్ ప్రాసెసర్ కంప్యూటర్‌కి చేరవేస్తుంది. Normal మౌస్‌కి ప్రత్యామ్యాయంగా 1999 వ సంవత్సరంలో కనుగొనబడిన ఆప్టీకల్ మౌస్ ఓ చిన్న కెమెరాని ఉపయోగిస్తూ సెకనుకు 1500 ఫోటోలను తీస్తుంటుంది. ఏ ఉపరితలంపై అయినా పని చేస్తుందిది.


ఆప్టికల్ మౌస్‌లో ఉండే ఎర్రని LED ప్రస్తుతపు ఉపరితలపు యొక్క సమాచారాన్ని మౌస్‌లోని CMOS Sensorకి చేరవేస్తుంది. ఇలా తన వద్దకు చేరిన ప్రతీ ఇమేజ్‌ని CMOS SEnsor మళ్ళీ Digital Signal Processor (DSP) అనే ప్రదేశానికి విశ్లేషణ నిమిత్తం పంపిస్తుంది.సెకనుకు 18 మిలియన్ ఇన్‌స్ట్రక్‌షన్లని ప్రాసెస్ చేయగలిగే ఈ DSP తన వద్దకు చేరిన ఇమేజ్‌లను ఒకదానితో మరొకటి సరిపోల్చడం ద్వారా మౌస్ ఏ దిశగా ఎంత దూరం కదిలించబడిందో నిర్ధారించి అ సమాచారాన్ని కంప్యూటర్‌కి అందిస్తుంది. ఈ తతంగం అంతా ఒక్కో సెకనుకు కొన్ని వందల పర్యాయాలు కంప్యూటర్ ఆన్ చేసి ఉన్నంతసేపూ జరుగుతూనే ఉంటుంది. Normal మౌస్‌లతో పోలిస్తే ఆప్టికల్ మౌస్‌లు ఫెయిలయ్యే అవకాశాలు చాలా తక్కువ. Normal మౌస్‌లలో మాదిరిగా మౌస్ లోపలికి మురికి చేరుకుని సెన్సార్లకి అడ్డుపడే ఇబ్బంది ఆప్టికల్ మౌస్‌లలో ఉండదు. అలగే Normal మౌస్‌ల మాదిరిగా తప్పనిసరిగా మౌస్ ప్యాడ్ ఉండాల్సిన పని ఆప్టికల్ మౌస్‌లకు ఉండదు.

3D ఎఫెక్టులతో సెర్చింగ్ చేసుకోండి.

January 19, 2008 Uncategorized No Comments


Google, Yahoo వంటి సెర్చ్ ఇంజిన్లలో ఏదైనా కీవర్డ్‌ని టైప్ చేసి వెదికినప్పుడు పేజీల కొద్ది లింకులు ప్రత్యక్షమవుతాయి కదా! వాటిలొ దేనిని ఓపెన్ చేయాలని మనం తలగోక్కోవలసి వస్తుంది. ఇక ఆ బాధ లేదు. 3D Web Search టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ టూల్ ద్వారా Google, Yahoo, Ebay, Flickr వంటి సెర్చ్ ఇంజిన్లలో మీరు ఏ కీవర్డ్ కోసం సెర్చ్ చేసినా అన్ని సెర్చ్ రిజల్ట్స్ యొక్క టెక్స్ట్ లింకులు కాకుండా వాటి పేజీల ప్రివ్యూలు ఆకర్షణీయంగా కనిపించే పద్ధతిలో అమర్చబడి స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.

ప్రతీ పదానికి సంబంధించి 200 పనులు


నెట్‍లో ప్రతీ వెబ్‍పేజీలోనూ వందలకొద్ది పదాలు పొందుపరచబడి ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా పదాన్ని సెలెక్ట్ చేసుకుని దానిని google వంటి సెర్చ్ ఇంజిన్లలో వెదకాలనుకోవచ్చు. దానికి సంబంధించిన రిఫరెన్సులు చూడాలనుకోవచ్చు. దాన్ని వేరే భాషలోకి అనువదించాలనుకోవచ్చు. లేదా లాప్‍టాప్ వంటి పదాలను సెలెక్ట్ చేసుకుని వాటిని ఆన్‍లైన్‍లో కొనుగోలు చేయాలనుకోవచ్చు. లేదా ఆ పదాన్ని మీ స్నేహితునికి మెయిల్ చేయాలనుకోవచ్చు. ఇలా ఒక పదాన్ని పట్టుకుని దాదాపు 200లకు పైగా వేర్వేరు పనులను నెరవేర్చిపెట్టే addon నే Make every word interactive with HyperWords.

మీ వెబ్‍సైట్ నెమ్మదిగా లోడ్ అవుతుందా?

January 16, 2008 Uncategorized 2 Comments


మీ వెబ్‍సైట్ ఎంత వేగంగా లోడ్ అయితే సందర్శకులు అంత సంతోషిస్తారు. ఈవాళ్టి రోజుల్లో ఎంత గొప్ప వెబ్‌సైట్ కోసమైనా ఐదు, పది సెకండ్లకు మించి వేచి చూసే ఓపిక ఎవరికీ ఉండడం లేదు.ఈ నేపధ్యంలో మీ వెబ్‌సైట్ బాగా నెమ్మదిగా ఓపెనవుతోందంటే దానికి గల కారణాలను అన్వేషించి సరిచేసుకోవడం ఒక్కటే పరిష్కారం. ఆకర్షణ కోసం మనం వెబ్‌పేజీల్లో పొందుపరిచే CSS, Iframes, Flash, JavaScript, ఫోటోలు వంటివి లోడ్ అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.వాటికితోడు మనం Google Adsense ప్రకటనల్ని మన సైట్‌లో పొందుపరుచుకున్నట్లయితే ఆ ప్రకటనలు మన సైట్‌కి వచ్చి చేరడానికి కూడా కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అలాగే Youtube,Flash వంటి వీడియో లింకులు వంటివి సైట్ నెమ్మదిగా లోడ్ అవడానికి దారితీసే అంశాలే. అలాగే Imageshack, Flickr వంటి వెబ్‌సైట్లలొ హోస్ట్ చేయబడి మన వెబ్‌సైట్‌లో అక్కడి నుండి డిస్‌ప్లే చేయబడవలసిన ఫోటోలూ సైట్ ఓపెనింగ్ నెమ్మదించడానికి కారణమవుతాయి. ఈ నేపథ్యంలో Pingdom అనే టూల్‍ని ఉపయోగించడం ద్వారా మీ సైట్ నెమ్మదించడానికి ఏయే అంశాలు కారణం అవుతున్నాయన్నది వివరంగా ఒక గ్రాఫ్ రూపంలో తెలుసుకుని వాటిని సరిచేసుకోవచ్చు.

రోజువారీ కార్యకలాపాలు రికార్డ్ చేసేలా

January 12, 2008 Uncategorized No Comments

కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మనం రకరకాల ప్రోగ్రాములను రన్ చేస్తుంటాం, పలు వెబ్ సైట్లని వి జిట్ చేస్తుంటాం, డాక్యుమెంట్లని టైప్ చేస్తుంటాం, ఇలా మనం సిస్టమ్ ఆన్ చేసినప్పటి నుండి తిరిగి కట్టేసేటంతవరకు మనము చేసే పనులన్నీ రికార్డ్ చేయబడి ఒక వీడియో రూపంలో మార్చబడితే ఎలా ఉంటుంది? snaplogger అనే ప్రోగ్రాం ఈ పనిని నిజం చేసి పెడుతుంది. ఇది మనం పిసిని ఆన్ చేసిన క్షణం నుండి నిరంతరాయంగా మొత్తం కంప్యూటర్ స్క్రీన్ లేదా మనం ఎంచుకున్న విండోని పలు ఫోటోలుగా కేప్చర్ చెస్తుంటుంది. కొన్ని సెకండ్లకు ఓ ఫోటో చొప్పున మీకు తెలియకుండానే రికార్డ్ చేయబడుతుంది. ఈ ఫోటోలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యే వీడియో మాదిరిగా కన్వర్ట్ చేస్తుంది.

మీ మేధస్సుకు పదును పెట్టే ప్రశ్నలు కావాలా?

January 12, 2008 Uncategorized 1 Comment

మీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారా… ఎంత సేపు ఆ క్లాసు పుస్తకాలనే ఏమి చదువుతారు.. కొద్దిగా జనరల్ నాలెడ్జ్‌ని పెంచే ప్రయత్నాన్ని చేయండి. మీరు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ని వాడుతుంటే https://addons.mozilla.org /en-US/firefox/addon/1311 అనే వెబ్ పేజ్‌లో లభించే Quiz Addicts Toolbar అనే చిన్న టూల్ బార్ addon ని మీ కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది ప్రతీ పది నిముషాలకు ఓ సారి ఓ చక్కని ప్రశ్నని ఆన్సర్ చేయమని కోరుతుంది.తర్వాత సమాధానమూ చూపిస్తుందనుకోండి. మీ మేధస్సుని పెంచే వేలకొద్ది ప్రశ్నలు మీ ఫైర్‌ఫాక్స్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంటాయి.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి