E-తెలుగు, కంప్యూటర్ ఎరా సంయుక్త సమావేశం జూలై 2008 నివేదిక
సమయం: 13, జూలై, 2008, మధ్యాహ్నం 3 గంటలు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్.
హాజరైన సభ్యులు
1. కృష్ణకుమార్
2. శ్రవణ్ కుమార్
3. సిహెచ్. రామ్ కుమార్
4. నల్లమోతు శ్రీధర్
5. జి. శ్రీనివాస్
6. ఎన్. విక్రమ్
7. కె.జె. సత్యసాయిరాం
8. జి. ఛాయాదేవి
9. బి. ప్రసన్న కుమారి
10. పి. కశ్యప్
11. సి. భాస్కరరావు
12. దూర్వాసుల పద్మనాభం
13. తుమ్మల శిరీష్ కుమార్
14. గబ్బిట సుబ్రహ్మణ్య విఠల్
15. సి. ఫణిరామ దీక్షితులు
16. వీవెన్
17. కొత్తపల్లి సీతారాం
18. నువ్వుశెట్టి కృష్ణకిషోర్
19. కట్టా విజయ్
20. శ్రీధర్ పతి

ఎడమ నుండి కుడికి వరుసగా: సిబిరావు, కశ్యప్, ప్రసన్నకుమారి, ఛాయాదేవి, సత్యసాయిరాం, విక్రమ్, శ్రీనివాస్
సభ్యుల పరిచయాలు పూర్తయిన తర్వాత కొత్త పల్లి సీతారాం గారు తెలుగు భాష నానాటికీ ఎంతగా ఉనికిని కోల్పోతోందో కొన్ని అంశాలను ఉటంకిస్తూ భాష గాలి లాంటిదని దానికి ఆయువు లాంటి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడం ద్వారా భాషని స్థిరంగా నిలబెట్టుకోగలమని విశ్లేషిస్తూ.. తను స్వయంగా పరిశోధించి కనుగొన్న సరికొత్త ఏనిమేషన్ టెక్నాలజీ సహకారంతో వేమన పద్యాలు, దసరా పద్యాలు వంటి సాంస్కృతిక సంపదకు దృశ్యరూపం కల్పించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలుగు భాషని కాపాడడంలో ప్రభుత్వం, ఇతర భాషా పరిరక్షణా ఉద్యమాల పాత్ర కొంతసేపు చర్చనీయాంశం అయింది. అలాగే ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధనకు ప్రభుత్వం పూర్తిస్థాయి సుముఖత వ్యక్తం చేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు వగైరా ప్రస్తావించబడ్డాయి. చదువరి గారు, సిబి రావు గారు. కశ్యప్ గారు పద్మనాభం గారు తదితరులు సమస్య యొక్క పార్శ్యాలను విభిన్న కోణాల్లో చర్చించారు. అలాగే ఈ సమావేశానికి దూర్వాసుల పద్మనాభం గారు విఠల్ గారి కుటుంబ సభ్యులను, కొత్తపల్లి సీతారాం గారిని ఆహ్వానించడం ద్వారా మన ఉద్యమాన్ని మరికొందరు భాషాభిమానులకు పరిచయం చేశారు. సమావేశానికి హాజరైన కంప్యూటర్ ఎరా పాఠకులను తెలుగులో బ్లాగులు ప్రారంభించమని సిబి రావు గారు, పద్మనాభం గారు కోరారు. చదువరి గారు e-తెలుగు “సంస్థ” హోదా చేరక మునుపు ఏ స్థాయిలో కార్యకలాపాలను నిర్వహించబడ్డాయో అదే స్థాయిలో కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలియజేశారు. e-తెలుగు చేపడుతున్న స్థానికీకరణ వంటి పనులకు మరింత మంది ఔత్సాహికులు స్వచ్చంధంగా తమ సహకారం అందిస్తే పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.

ఎడమ నుండి కుడికి వరుసగా: విక్రమ్, శ్రీనివాస్, నల్లమోతు శ్రీధర్, రామ్ కుమార్, శ్రవణ్ కుమార్
విభిన్న శైలిల్లో యూనీకోడ్ ఫాంట్ల రూపకల్పన విషయమై వీవెన్ ప్రస్తావిస్తూ.. సి-డాక్ వారు విడుదల చేసిన ఫాంట్లలో ఆకృతుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచెయ్యడానికి ఫాంట్ మాపింగ్ పై అవగాహన ఉన్న నిపుణుల సహకారం అవసరం అని తెలిపారు. వివిధ సాఫ్ట్ వేర్ ఉపకరణాల స్థానికీకరణ విషయం ప్రస్తావిస్తూ.. వర్డ్ ప్రెస్ తెలుగీకరణ 66% పూర్తయిందని, వికీపీడియా సాఫ్ట్ వేర్, ఉబుంటు స్థానికీకరణ పనులు జరుగుతున్నట్లు వీవెన్ వెల్లడించారు. ఇలా పలు విషయాలు చర్చిస్తుండగా జాన్ హైడ్ కనుమూరి గారు రావడం ఆయన ఇటీవల విడుదల చేసిన “అమ్మ సంకలనం” గురించి అందరూ అభినందించడం జరిగింది. ఈ నేపధ్యంలో త్వరలో తాను “గ్రంధాలయాల సంకలనం” పేరిట మరో సరికొత్త ప్రాజెక్ట్ ని విడుదల చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎడమ నుండి కుడికి వరుసగా: రామదీక్షితులు, విఠల్, తుమ్మల శిరీష్ కుమార్, దూర్వాసుల పద్మనాభం, కొత్తపల్లి సీతారాం, సిబిరావు
తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి “కంప్యూటర్ ఎరా” చేపట్టిన సాంకేతిక సహాయం ఛాట్ రూమ్, ఫోరంల విషయమై.. సభ్యుల భాగస్వామ్యం మరింత పెంపొందించాలంటే ఓపెన్ గా ఉన్న సందేహాలు లాగిన్ పేజీలో ఆటోమేటిక్ గా వచ్చేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కశ్యప్ గారు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి కెరీర్ దృష్ట్యా వస్తున్న యువతకు కెరీర్ గైడెన్స్ ఇచ్చేలా చిన్న చిన్న సెమినార్లు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు చదువరి గారు ప్రత్యక్షంగానే కాకుండా ఫోరంలో కూడా తగిన సమాచారం అందిస్తే బాగుంటుంది అని సూచించారు. కంప్యూటర్ ఎరా ఛాట్, ఫోరంలకు బొత్తాం తయారు చేస్తే వీలైన వారందరూ తమ బ్లాగుల్లో పెడతారని కట్టా విజయ్ గారు సూచించారు.
చివరిగా యధావిధిగా క్యాంటీన్ కి వెళ్లి తేనీరు సేవించి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ ఇంటి దారి పట్టాం.















