పిల్లల కోసం చాలామంచి తెలుగు సైట్లు..

నేటి కాలంలో ఆంగ్లం ఉండగా తెలుగు ఎందుకు దండగ అని భావించే తల్లితండ్రులు ఎందరో. పరీక్షల కోసమై తప్పనిసరి పరిస్థితిలో, అవసరమున్నంతే తెలుగు నేర్చుకోవాల్సిన గ్రహచారం పట్టింది పిల్లలకు. తెలుగు ఎందుకు అని అన్నప్పుడు , ఆ భాష ఎంత సులువైనదో అని నేర్పించడానికి సులువైన , ఆకర్షణియమైన విధానంలో ఒక వెబ్‍సైట్‍ని మొదలెట్టారు లలిత . మాటలు కూడా రాని చిన్నారులకు బొమ్మల ద్వారా ఎన్నో వస్తువులను పరిచయం చేసి, వాటిని సులువుగా గుర్తుపట్టేలా చేయొచ్చంటారు ఆవిడ. ప్రవాసంలో ఉన్నా కూడా తమ పిల్లలకు, తెలుగు భాషపై మక్కువ పెంచుతూ పిల్లల ఉత్సాహమే పెట్టుబడిగా ఎందరో కుటుంబాల చిన్నారులకోసం telugu4kids అనే సైట్‍ను నిర్వహిస్తున్నారు. ఈ సైట్‍లో తేలికైన పదాలతో రైమ్స్, పద్యాలు, పొడుపుకథలు, చిన్న చిన్న కథలు, వ్యాకరణం, పదాలు , సంఖ్యలు మొదలగునవి పిల్లలకు నేర్పించే విధానం చెప్పబడింది. అదే విధంగా  bookbox అనే సైట్‍లో కథలను అందమైన బొమ్మలతో , ఒక చిత్రంలా అందించారు. తమ చిన్నారులు తెలుగుభాషని సులువుగా నేర్చుకోవాలనుకుని కోరుకునే తల్లితండ్రులు తప్పక చూడవలసిన సైట్లు ఇవి.

ఆ పాత మధురాలు..

తెలుగు గడ్డపై జన్మించి కళకే జీవితాన్ని అంకితం చేసి, అవిశ్రాంత కళాపిపాసతో ఆణిముత్యాల్లాంటి కళాఖండాలను సృష్టించి, మన జీవితాలను మనస్సులను స్పృశించి, వాటిలోని మాధుర్యాన్ని ఆస్వాదించమని మనకు వదిలి వెళ్ళారు ఎందరో కళామతల్లి ముద్దుబిడ్డలు. కాని నేటి మిశ్రమ లేదా అర్ధంకాని సంగీతం, కీచుగొంతులు, అరువు గొంతులతో తెలుగు బాషను, సంగీతాన్ని ఖూని చేస్తుంటే తమ హృదయాలలో ఆగ్రహావేశాలతో తల్లడిల్లేవారు ఎందరో. ఈ నేపధ్యంలో ఆ పాత మధురాల్ని సృష్టించిన కళాకారులకు అంకితమిస్తూ ప్రవాస భారతీయ దంపతులు శ్రీ వంశి మాగంటి, శ్రీమతి శ్రీదేవి మాగంటి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆన్‍లైన్ రేడియో సైటే ( http://www.radio.maganti.org ) . ప్రతి శనివారం భారతీయ కాలమానం ప్రకారం రాత్రి పదిన్నరకు మొదలయ్యే ఈ రేడియో కార్యక్రమాలలో ఇంతవరకూ మాయబజార్, నాగయ్య, టంగుటూరి సూర్యకుమారి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, సాలూరి రాజేశ్వరరావు, భానుమతి, బి.ఎన్.రెడ్డి, గూడవలి రామబ్రహ్మం మొదలైన ఎందరో మేటి కళాకారుల అద్భుత పాటల నిధిని అందించారు. రాబోయే రోజులలో ఈ మధురమైన నిధినిక్షేపాలు ఎన్నో మనకు అందివ్వనున్నారు నిర్వాహకులు..

మనసులో మాట .. బ్లాగు సమీక్ష

August 25, 2008 Uncategorized 8 Comments

ఒక మధ్యతరగతి మహిళ తన నిత్య జీవితంలో చూసిన సంఘటనలు, అభిరుచులు,  అనుభవాలు అన్నీ కలగలిపి రాస్తున్న బ్లాగు మనసులోమాట. తెలుగు బ్లాగ్లోకంలో అడుగుపెట్టి ఆరు నెలలు కూడ నిండకుండానే వైవిధ్యమైన టపాలతో అందరిని ఆకట్టుకున్నారు సుజాత.  మొదలయిన అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానుల్ని కూడగట్టుకున్న బ్లాగు కూడా. తనదయిన శైలిలో, చిరు హాస్యం జోడించి ఏంతోమందిని ఆకట్టుకుంటున్నారు.  భాషమీద పట్టు, కొత్త కొత్త పద ప్రయోగాలతో (అంటె ఇంతకు ముందు విననివి, కనిపెట్టినవి కాదు) ఆహ్లాదంగా వ్రాస్తారు. అసలు లైమ్ లైటులోకి రావాడానికి ముఖ్యకారణం బరువు బాధ్యతలే ననుకుంటాను. బరువు గురించి పండించిన హాస్యం పొట్ట చెక్కలయ్యే నవ్వు తెప్పిస్తుంది. అతి బరువు బాధ లని తనదైన శైలిలో వ్రాసి పలువురి మెప్పు కూడా పోందారు. అక్కడితో ఒక కొత్త తార తలుక్కుమంది. అప్పటినుండి ఎన్నో టపాలు, మరెన్నో మెప్పులు.

మెళ్ళో తాళి, కాళ్ళకి మెట్టేలు పడగానే ఆంటీ అని బిరుదు కూడా ఉచితంగా దానంతట అదే వచ్చేస్తుందట. ఇదేమి విచిత్రం చెప్మా. పెళ్ళవగానే అందరి ఆడవాళ్ళని ఆంటీలని పిలవడం మన తెలుగు వారి సాంప్రదాయం అని చెబుతున్నారు. ఇక చదవడం మొదలెడితే ఆపనక్కరలేదు. పడి పడి నవ్వడం. ఈ టపా ద్వారా హాస్యంలో తనది అందెవేసిన చెయ్యి అని మరోసారి నిరూపణ జరిగింది. ఈ టపా ఎందరినో తమ అనుభవాలను పంచుకునేలా చేసింది కూడా. అంటే అందరూ ఈ ఆంటి, అంకుల్ బాధితులే అన్నమాట.

సుజాత అప్పుడప్పుడు తనకు నచ్చిన పుస్తకాల గురించి కూడా చక్కటి సమీక్షలు ఇస్తుంటారు. మంచి పుస్తకం  మనకు మంచి స్నేహితుడు/రాలు అవుతుందో లేదో కాని తనకు మాత్రం ఆకలి తీర్చే రుచికరమైన భోజనం లాగానో, దాహం తీర్చే మంచి నీళ్లలాగానో కనపడుతుంది.  కాకపోతే, ఎవరికైనా భోజనం చేయగానే, ఆకలి, నీళ్ళు తాగగానే దాహం తీరతాయి. నాకలా కాదు! అంటారావిడ.

పెళ్ళనగానే గుర్తోచ్చింది, పెళ్ళికి కొత్త నిర్వచనం కూడా ఇచ్చారు. పెళ్ళంటే నూరేళ్ళ పంటా కాదు మంటా కాదు, కేవలం వంటేనట. ఒక్కసారి పెళ్ళయిన తర్వాత  వంట గదిలో అడుగు పెడితే ఇక జీవితకాలం అంతా వంటింటికే అంకితం అవుతారన్న మాట ఆడవాళ్ళు. అక్షర సత్యాలు. ముఖ్యంగా ఆ సంభాషణలు అదిరాయి. “ఏవమ్మో, మగాళ్ళు వంట చెయ్యడం మా ఇంటా వంటా లేదు” ” నాలుగయ్యింది ఇంకా నా మొహానికి కాఫీ కూడా లేదు”  దాదాపు ప్రతి మహిళ అనుకునే విషయమే ఇది.  అందుకే సుజాత రాసే ఎన్నో టపాలు మహిళలను ఎక్కువగా, పురుషులను మరి కాస్త ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి అని చెప్పవచ్చు.

పైదంతా చదివి హాస్యం ఒక్కటే దొరుకుతుంది ఆ బ్లాగులో అనుకునేరు. అది నిజంగా కలగూరగంపే. ఏన్నో సీరియస్ విషయాల మీద కూడా టపాలు వ్రాయడం జరిగింది. ముఖ్యంగా అమ్మ నాన్నలని వృద్దాశ్రమంలో పడేసే సుపుత్రుల గురించి, అసలు పెద్దవాళ్ళు కూడా ఆశ్రమాలకి వెళ్ళాలని ఎందుకనుకుంటారో మంచి విశ్లేషణ కూడా ఇచ్చారు.
కులమా నీకు మరణం లేదా అని ఎంతో చక్కటి టైటిలుతో మన నర నరాల్లో నాటుకుపోయిన కుల వ్యవస్థ గురించి, అది మనకి చేస్తున్న నష్టాన్ని, పెంచుతున్న దూరాన్ని కూడా చక్కాగా వివరించారు. అసలు ఈ కుల కట్టుబాట్లకి అంతమే లేదా అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది ఆ టపా. అలాగే స్వర్గీయ ఎన్.టి.ఆర్ గురించి, భారతంలో కర్ణుడిలా ఆయన చావుకు గల ఎన్నో కారణాలు వివరించారు. ఇంకా మగువలందరి చేత కుళ్ళుకునేలా చేసింది అత్తగారి కథ. అందరు మాతృదినోత్సవ సందర్భాన అమ్మ గురించి తమ అనుభవాలు రాస్తే , సుజాత గారు విభిన్నంగా మావారి అమ్మ కథ అని  తన అనుభవాలు, చెప్పి అబ్బా ఇలాంటి అత్తగారు ఉంటే ఎంత బావుణ్ణు అనేలా చేసింది. అత్తగారనగానే సూర్యకాంతంలా ఊహించుకుంటాం అందరము, అలాకాదు ఇంకా అన్నపూర్ణ , పండరీభాయి లాంటి వాళ్ళు, అంతకంటే మంచివాళ్ళు కూడా ఉంటారు అని చెప్పకనే చెప్పారు.   భానుమతి గారి అత్తగారి కథలు కడుపుబ్బ నవ్విస్తే, సుజాత గారి అత్తగారి కథ  అత్తగారిలోని అమ్మను కూడా చూపించింది. ఇక తన గెలుపుకి చిహ్నంగా తన పెళ్ళి కబుర్లు ఎంతొ చక్కగా కళ్ళు చమర్చేలా చెప్పారు. నిజ జీవితంలో జరిగే సర్ధుబాటులు, మెలోడ్రామాలు లేని ముచ్చట్లు అన్ని కలపోసి తన లవ్ స్టోరీను కళ్ళముందు కదిలించారు. ముఖ్యంగా తన పెళ్ళి చూపుల విషయం చెప్పిన వేంటనే, ” మరి నా సంగతేమిటి” అన్న శ్రీనివాస్ గారి ప్రేమ, “హమ్మయ్య మొత్తానికి అడిగేసాడు” అనుకున్న సుజాత గారి మనసులో మాట చూసి, అబ్బ సినిమాలో ఇలాంటివి ఉండవెందుకు అని కాస్త నిట్టూర్చాను. పెళ్ళికిముందు కాదన్నవారే, తరువాత తన భర్తని శ్రీరాముడని పొగుడుతుంటే, తను పొందే ఆనందం, తన కళ్ళల్లో కనపడే మెరుపూ, చదివిన వారి కళ్ళలో మనస్సులో కనపడతాయి.
అల్లరి చేద్దామని ఎంత ప్రయత్నించినా, అల్లరి చెయ్యడానికి వీలు లేకుండ కట్టిపడేసిన సంఘటనలని చక్కగా వల్లించారు. అల్లరి చెయ్యడమే గొప్పేమిటి, చెయ్యకపోవడమూ గొప్పే మరి. ఆలాగే తాను పత్రికారంగంలో పని చేసేటప్పుడు ఎదుర్కొన్న సంఘటనలు ,అనుభవాలు అన్నీ వివరించారు. ఆ టపాలలొ మనకు తెలియని ఎన్నో విషయాలు అందరిని ఆశ్చర్యచకితులను చేసాయి అని నిక్కచ్చిగా చెప్పవచ్చు.

ఇలా ఎన్నెన్నో టపాలతో వైవిధ్యంగా వ్రాసి, ఎంతో మంది అభిమానుల్ని సంపాదించారు. వ్రాయడం తనకి కొత్త కాకపోయినా, బ్లాగులోకానికి మాత్రం కేవలం అరు నెల్లగానే తెలుసు. తాను రాసే ఏ విషయమైనా , అది తన బ్లాగులో టపా ఐనా, ఇతర బ్లాగులలో రాసే వ్యాఖ్యలైనా  నిక్కచ్చిగా రాయడంలో దిట్ట అని అందరికి ఈ పాటికి అర్ధమయ్యింది. ఇంకా మనసులో మాట తొక్కని మెట్లు ఎన్నో ఉన్నాయి, అవన్ని కూడా తొక్కేసి ఎన్ని కొత్త విషయాల మీద వ్రాసి , ఎంతో కీర్తిని పొంది  పాఠకులందరి  మనస్సుల్లో స్థిరస్థానాన్ని పోందాలని కోరుకుంటున్నాను.

సమీక్షకులు : పాలడుగు శ్రీకాంత్

AVG టూల్‌బార్ Search History క్లియర్

AVG 8.0 Free Edition ని మీ కంప్యూటర్లో  ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు పొరబాటున టూల్‌బార్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయమనే ఆప్షన్‌ని టిక్ చేసినట్లయితే IE?Firefox బ్రౌజర్లలో ఆ టూల్‌బార్ వచ్చి చేరుతుంది. అందులో ఉన్న search  సదుపాయం ద్వారా నెట్‌లో ఏమైనా వెదికినట్లయితే ఆ హిస్టరీ లోపల సేవ్ అవుతుంటుంది. ఈ నేపధ్యంలో ఈ AVG Toolbar Search History  ఇతరుల కంటపడకుండా క్లియర్ చేసుకోదలచుకున్నట్లయితే  ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వాడేవాళ్ళు అడ్రస్‌బార్‌లో about:config అనే కమాండ్‌ని టైప్ చేసి , తిరిగి filter అనే ప్రదేశం వద్ద.. avg.toolbar.searchHistory అనే పదాన్ని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే బాక్స్‌లోని సమాచారాన్ని డిలీట్ చేయండి. Internet Explorer బ్రౌజర్‌ని ఉపయోగించేవారు ముందు Internet Explorer ని క్లోజ్ చేసి ControlPanel>Folder Options> View  అనే విభాగంలో Show hidden files and folders అనే ఆప్షన్‌ని టిక్ చేసి OK  బటన్‌ని ప్రెస్ చేసి ఇప్పుడు My Computerని ఓపెన్ చేసి C:\Documents and Settings\Application Data\AVGTOOLBAR  అనే ఫోల్డర్‌లోకి వెళ్ళి COMBOSEARCH.acs అనే ఫైల్‌ని డిలీట్ చేయాలి. Win Vista లో ఇది C:\Users\AppData\Local\AVGTOOLBAR\COMBOSEARCH.acs లో ఉంటుంది.

షట్‌డౌన్ సమయంలో అప్‌డేట్లు ఇన్‌స్టాల్ చేయమంటూ…

XP  ఆపరేటింగ్ సిస్టమ్‌లో Automatic Updates ఆప్షన్‌ని ఎనేబుల్ చేసినప్పుడు  మనం నెట్‌కి కనెక్ట్ అయి ఉండగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్లు డౌన్‌లోడ్ అవుతుంటాయి. ఇలా డౌన్‌లోడ్ అయిన అప్‌డేట్లు మనం కంప్యూటర్‌ని షట్‌డౌన్ చేసే సమయంలో Turn off అనే బటన్‌ని గనుక క్లిక్ చేసినట్లయితే  అవన్నీ  ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాతే పిసి షట్‌డౌన్ చేయబడుతుంది. ఇలా షట్‌డౌన్ సమయంలో అప్‌డేట్లు ఇన్‌స్టలేషన్ చేస్తారా.. అంటూ మెసేజ్ రాకుండా ఉండాలంటే… గ్రూప్ పాలసీలో User Configurations>Administrative Templates>Windows Components>Windows Update అనే విభాగంలో కుడిచేతి వైపు  Do not display”Install Updates and Shut Down” option in Shutdown Windows dialog box ‘  అనే ఆప్షన్‌ని మౌస్‌తో డబుల్‌క్లిక్ చేసి Enabledగా సెట్ చేయండి. ఇకపై ఈ ఆప్షన్ అడగబడదు.

త్రీడీ టెక్స్ట్ కావాలా?.. ఇదిగోండి మార్గం!..

త్రీడీ రూపంలో ఉండే సమాచారం చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. త్రీడీ టెక్స్ట్‌ని రూపొందించడానికి అనేక సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నా Xara 3D6 అనే సాఫ్ట్‌వేర్ చాలా నాణ్యమైన ఔట్‌పుట్‌ని అందిస్తోంది. ఇందులో TTF కోవకు చెందిన అన్ని భాషల ఫాంట్లని త్రీడి రూపంలో పొందవచ్చు . బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, త్రీడి కలర్ వంటి అంశాలను ఈ సాఫ్ట్‌వేర్‌లో సులభంగా ఎంచుకోవచ్చు. అలాగే మన టెక్స్ట్‌ని ఇదే సాఫ్ట్‌వేర్‌లో లభించే రెడీమేడ్ ఆకారాల్లో పొందుపరచుకోవచ్చు కూడా. టెక్స్ట్ యొక్క ఏంగిల్‌ని, త్రీడి పరిధిని సులభంగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. చివరిగా దాన్ని JPEG ఇమేజ్ ఫార్మేట్‌లో సేవ్ చేసుకోవచ్చు.

Opera Mini.. ఇప్పుడూ మరింత వేగంగా!!

వివిధ రకాల PDA కోవకు చెందిన ఫోన్లని ఉపయోగించేవారు తమ ఫోన్‌లో అధునాతన వెబ్ బ్రౌజర్ ఉన్నప్పటికీ ప్రస్తుతం వాడుకలో ఉన్న GPRS WAP  కనెక్షన్లు స్లోగా ఉండడం వల్ల మరింత వేగంగా నెట్‌ని బ్రౌజ్ చెయ్యడానికి ఎక్కువగా ఉపయోగించే మొబైల్ బ్రౌజర్ Opera Mini.  ఇప్పటికే ఇతర బ్రౌజర్ల కన్నా వేగంగా ఉండే ఈ బ్రౌజర్‌లో తాజా 4.1 వెర్షన్‌లో మరికొన్ని సదుపాయాలు పొందుపరచబడ్డాయి. Opera సర్వర్లు అప్‌డేట్ చెయ్యబడడం వల్ల గతంతో పోలిస్తే 50% వేగంగా పేజీలు లోడ్ చేయబడుతున్నాయి. ప్రస్తుతం మనం బ్రౌజ్ చేస్తున్న పేజీలోకావలసిన text కోసం search చేసేలా ఆప్షన్ కల్పించబడింది. అలాగే అడ్రస్‌బార్‌లో వెబ్‌సైట్ అడ్రస్‌లను పూర్తిగా టైప్ చెయ్యనవసరం లేకుండా గతంలో టైప్ చేసిన అడ్రస్‌లను మెమరీలో గుర్తుంచుకోవడం ద్వారా autosuggest చెయ్యబడేలా  ఆప్షన్ లభిస్తోంది. ఇంతకాలం Opera Mini  ద్వారా ఫైళ్ళని డౌన్‌లోడ్ చేసుకోవడం వీలు పడేది కాదు. ఇప్పుడు వివిధ సైట్ల నుండి ఫైళ్ళని సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌పేజీలను మన ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చు. కూడా!  పేజీలను లాండ్‌స్కేప్ మోడ్‌లోనూ చూడొచ్చు.

పదాలు చెప్పే కథలు…

August 19, 2008 Uncategorized No Comments

Rendering : geometrics  లక్షణాలు కలిగిన ఇమేజ్‌లను సృష్టించే ప్రక్రియని ఇలా పిలుస్తారు.  కలర్, షేడింగ్ ఎఫెక్టులను ఆపాదించడం ద్వారా ఆయా ఇమేజ్‌లు రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. సహజంగా CAD డ్రాయింగులలో బిల్డింగ్ ప్లాన్లు,బిల్డింగ్ నమూనాల రూపకలనకూ, అలాగే త్రీడి ఆబ్జెక్టుల రూపకల్పనకు రెండరింగ్ ప్రక్రియ అనుసరించబడుతుంది.

Repeat Counter ” దీనినే లూప్ కౌంటర్ అని కూడా పిలవవచ్చు. మళ్ళీ మళ్ళీ ఎన్ని మార్లు execute చెయ్యాలన్నది ఈ repeat counter లో ప్రస్తావించబడి ఉంటుంది.

Repeat Delay : కీబోర్డ్‌పై ఒక కీని ( అది a-z, 0-9 ఏదైనా కావొచ్చు) ని అలాగే ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఆ కీ పలుమార్లు ప్రస్తుతం మనం ఓపెన్ చేసి ఉన్న అప్లికేషన్‌లో టైప్ అవుతుంది కదా! అలా నిరంతరాయంగా  ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు  ఒకసారి స్క్రీన్‌పై  టైప్ అవడానికి, మరోసారి టైప్ అవడానికి మధ్య చోటు చేసుకునే delayని repeat delay అని పిలుస్తారు.

Repeater: ఒక నెట్‌వర్క్‌లో డేటాని కమ్యూనికేట్  చేసేటప్పుడు కొంత పరిధి దాటిన తర్వాత సిగ్నల్ ( సందేశాలు ) బలహీనం అవడం సహజం. అలా బలహీనపడే సందేశాలను amplify ( పునరుత్తేజపరిచి ) చేసి తిరిగి పూర్తి స్థాయిలో సందేశాల ప్రసరణ జరిగేలా  ఏర్పాటు చేయ్యడానికి వినియోగించబడే డివైజ్‌నే Repeater అంటారు. నెట్‌వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో రెండు నెట్‌వర్క్‌లను అనుసంధానం చెయ్యడానికి ఇది వాడబడుతుంది.

Repeat Key: కొన్ని రకాల కీబోర్డ్‌లలో ( ప్రస్తుతం అవి వాడుకలో లేవు ) repeat key అని  ఒక కీ ప్రత్యేకంగా ఉంటుంది. దీని ఉపయోగం ఏమిటంటే మీరు వర్డ్‌లో ఒక డాక్యుమెంట్‌ని రూపొందించేటప్పుడు కీబోర్డ్‌పై ఉండే F అనే కీని ఓ వందసార్లు రిపీటెడ్‌గా టైప్ చెయ్యవలసి వచ్చిందనుకోండి. అప్పుడు F కీని  ప్రెస్ చేసి పట్టుకోవడంతోపాటు అలాంటి పాతతరం కీబోర్డ్‌లపై  ఉండే Repeat కీని కూడా మన పని పూర్తయ్యేటంత వరకూ   అలాగే ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రస్తుతం మనం వాడుతున్న కీబోర్డ్‌లలో .. ఒక కీని అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే అది ఆటోమేటిక్‌గా రిపీట్ చెయ్యబడేలా ఏర్పాటు చేయబడి ఉంది కాబట్టి ఈ repeat కీనిపూర్తిగా కీబోర్డ్ నుండి తొలగించారు.

Repetitive Strain injury: కంప్యూటర్లపై గంటల తరబడి పనిచేసే ఉద్యోగులకు  సహజంగా తలెత్తే సమస్య ఇది . ప్రధానంగా గంటల తరబడి  కీబోర్డ్‌పై వేగంగా టైప్ చెయ్యవలసి రావడం వల్ల, ఒకే పనిని, మౌస్, కీబోర్డ్‌ల సాయంతో పలుమార్లు చెయయ్వలసి రావడం వల్ల చేతి వేళ్ళలోని కండరాలు, నరాలు తీవ్రమైన వత్తిడికి గురవుతాయి. తద్వారా దీర్ఘకాలంలొ తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాంటి రుగ్మతని ఇలా పిలుస్తారు.

Replace: ప్రస్తుతం ఉన్న డేటా స్థానంలో కొత్త సమాచారాన్ని చేర్చడాన్ని ఈ పేరుతో పిలుస్తుంటారు. సహజంగా word,  one note, pagemaker వంటి డాక్యుమెంట్ల  తయారీ సాఫ్ట్‌వేర్లు ఈ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో టైప్ చేయబడిన సమాచారంలో ఒక పదాన్ని వెదికి దాని స్థానంలో మనకు కావాల్సిన కొత్త పదాన్ని జొప్పించడానికి ఈ కమాండ్ ఉపకరిస్తుంది. replace కమాండ్‌లో caseని కూడా పారామీటర్‌గా పేర్కొనవచ్చు.

Replay Attack: సక్రమంగా ఉన్న మెసేజ్‌ని అటకాయించి అందులో కొంత సమాచారం జొప్పించి తిరిగి ఆ మేసేజ్‌ని ప్రసారం చేసే ప్రక్రియని reply attack అంటారు. నెట్‌వర్క్‌పై దాడులు చెయ్యడానికి హ్యాకర్లు సహజంగా  ఈ తరహా దాడులను అనుసరించడం జరుగుతుంది.
Replication : డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఎన్విరాన్‌మెంట్‌లో  డేటా బేస్  మొత్తాన్ని కాని , లేదా అందులోని కొంత భాగాన్ని కానీ నెట్‌వర్క్‌లోని ఇతర సిస్టమ్‌లకు కాపీ చెయ్యడాన్ని replication పేరుతో వ్యవహరిస్తారు. అలాగే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్  ఉత్పత్తులను తయారుచేసే కంపెనీల  వారు తమ డివైజ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్లని ఖాతాదారులకు విక్రయించడానికి ఒక మాస్టర్ కాపీ నుండి పలు కాపీలను సృష్టించే ప్రక్రియని ఇదే పేరుతో పిలుస్తుంటారు.

Report: ఏదైనా అంశం గురించి ప్రింటెడ్ ఫారం రూపంలో నివేదిక సమర్పించడాన్ని report అంటారు. అయితే అది ఖచ్చితంగా ప్రింటెడ్ ఫారమే అయి ఉండనవసరం లేదు. ఉదా.కు.. మీరు మీ ఆఫీసులోని పై అధికారులకు ఆర్ధిక నివేదికలు సమర్పించడానికి ప్రింటింగ్‌ని ఆశ్రయిస్తుంటారు. కొని సందర్భాల్లో మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉండే డయాగ్నస్టిక్ ప్రోగ్రాములు మన కంప్యూటర్ మొత్తాన్ని స్కాన్ చేసి స్క్రీన్ మీదనే ఓ రిపోర్ట్ చూపిస్తుంటాయి. అంటే సందర్భాన్ని బట్టి ఔట్‌పుట్ మారుతుందన్నమాట.

పెన్ డ్రైవ్‍లను తనిఖీ చెయ్యడం ఎలాగంటే…

USB పెన్‌డ్రైవ్‌లు కొన్న కొద్దిరోజులకే డిటెక్ట్ అవకపోవడం, రీడింగ్/రైటింగ్ సమయంలో సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఇటీవలికాలంలో వినిపిస్తున్నాయి. నాసిరకం మీడియా, ఉత్పత్తి దశలోనే లోపాలు తలెత్తడం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ నేపధ్యంలో మీరు కొత్త పెన్ డ్రైవ్‌ని కొనుగోలు చేసిన వెంటనే మొట్టమొదట చేయవలసిన పని Check Flash అనే ఉచిత టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీ పెన్‌డ్రైవ్‌ని ఎంచుకుని Access Typeగా Use temporaray file, as logical drive అనే మూడు ఆప్షన్లని ఒకదాని తర్వాత ఒకటి ఎంచుకుని  Write and Read testని నిర్వహించండి. దీంతో మీవద్ద ఉన్న పెన్‌డ్రైవ్ మెమరీ అడ్రస్‌లు సక్రమంగా ఉన్నదీ లేనిదీ తేలుతుంది. అలాగే Windowsలో ఉండే Scandisk ద్వారా పెన్‌డ్రైవ్‌లో ఉండే బేడ్ సెక్టార్లని కూడా గుర్తించడం మర్చిపోకండి.

వెబ్‌పేజీలు వేగంగా లోడ్ అయ్యేలా..

“256 Kbps స్పీడ్ గల కనెక్షన్ తీసుకున్నా, డౌన్‌లోడింగ్ వేగమైంది కాని వెబ్‌సైట్లని ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మునుపటి లానే స్లోగా ఓపెన్ అవుతున్నాయి” అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. DSN, HostName resolutions యొక్క ప్రయారిటీని పెంచడం ద్వారా ఈ సమస్యని కొంతవరకూ అధిగమించవచ్చు. అదెలాగంటే Start>Run కమాండ్ బాక్స్‌లో regedit అని టైప్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రాంలోకి వెళ్ళి HKEY_LOCAL MACHINES\System\CurrentControlSet\Sevices|Tcpip\serviceProvider అనే విభాగంలోకి వెళ్ళండి. ఇక్కడ Local Priority, Hosts Priority, DNSPriority, NetbtPriority  అనే నాలుగు విలువలు కనిపిస్తుంటాయి. వీటిలో Local Priority అనే ఎంట్రీని డబుల్ క్లిక్ చేసి Value Data అనే ఆప్షన్ వద్ద 005 అనే విలువను ఇవ్వండి. అలాగె Hosts Priority  అనె ఆప్షన్ వద్ద దబుల్ క్లిక్ చేసి Value Data వద్ద 006  అనే విలువను ఇవ్వండి. ఆ తర్వాత DNSPriority అనే ఆప్షన్ వద్ద  డబుల్ క్లిక్ చేసి  దాని Value Data గా 007 గా మార్చండి. చివరిగా NetbtPriority అనే ఆప్షన్‌ని డబుల్ క్లిక్ చేసి దాని Value Data గా 008 అనే విలువను ఇవ్వండీ. ఇప్పుడు కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేసిన్ చూస్తే కొంతవరకూ వెబ్‌పేజీల బ్రౌజింగ్ మునుపటి కన్నా వేగవంతం అయిన విషయాన్ని గమనించవచ్చు.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి