కొత్త పాళీ గారికి జన్మదిన శుభాకాంక్షలు

October 28, 2008 Uncategorized 25 Comments

కొందరు వ్యక్తులను తలుచుకుంటే ఎనలేని గౌరవం మనసులో నిండిపోతుంది. వారి వ్యక్తిత్వంలోని ఉన్నత భావాలు, జిజ్ఞాస, కష్టించి పనిచేసే స్వభావం వంటివి వారి చుట్టూ ఓ ఆకర్షణావలయం సృష్టిస్తాయేమోననిపిస్తుంది. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగి, తెలుగు బ్లాగ్లోకంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రని వేసుకున్న బ్లాగరి “కొత్తపాళీ”గా అందరికీ చిరపరిచితులైన ఎస్. నారాయణస్వామి గారు. జీవితాన్ని విభిన్న కోణాల్లో స్పృశిస్తూ, ఆయా అనుభవాలను మదిలో ప్రోది చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆయన సాగించే ప్రయాణాన్ని చూసి ఏకలవ్య శిష్యుల్లా అనుసరించబుద్ధి అవుతుంది. స్వతహాగా మృధుస్వభావి అయిన కొత్తపాళీ గారిలో పట్టుదల, కష్టించి పనిచేసే నైజం, సమాజం పట్ల ఆయన కనబరిచే బాధ్యత, వెన్నుతట్టి ప్రోత్సహించే మంచితనం వంటి ఎన్నో లక్షణాలు ఎంతోమందిని ఆయనకు సన్నిహితులను చేస్తాయి. అలాంటి మహోన్నత వ్యక్తికి “కంప్యూటర్ ఎరా” సాంకేతిక సహాయం మిత్రబృందం తరఫున, బ్లాగు మిత్రుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు సుఖసంతోషాలతో ఆయన జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కొత్తపాళీ గారిపై ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా ఏనిమేషన్ ని తయారుచేసిన మిత్రులు జీవి (గోపాల్ వీరనాల) గారికి, చిలకపాటి శివరామప్రసాద్ గారికి ధన్యవాదాలు. స్వతహాగా తన పనేదో తాను సిన్సియర్ గా చేసుకువెళ్లే గురుతుల్యుడు కొత్తపాళీ గారికి ఇలాంటివి నచ్చవు అని తెలిసినా మా సంతోషం కోసం మేము తెలియజేస్తున్న శుభాకాంక్షలు. మా కోసమైనా మా అభిమానాన్ని స్వీకరించమని మనవి.

నవంబర్ 2008 బ్లాగు రివ్యూ: మనలోని మాట – నా మనసులోని మాట

October 27, 2008 Uncategorized 13 Comments

ఈ సమీక్ష యొక్క PDF ఫైల్ ని http://documents.scribd.com/docs/1l54zwier0sleiqwiro7.pdf అనే లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వేల సంఖ్యల్లో ఉన్న తెలుగు బ్లాగుల్లో పదుల్లో ఉన్న మహిళా బ్లాగులన్నీ తమకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటున్నాయి. తెలుగు బ్లాగులకు అద్భుతమైన టపాలతో తళుకులీనే మహిళా బ్లాగర్లు వృత్తిపరమైన, కుటుంబపరమైన వత్తిడులను సమర్ధంగా నిర్వహిస్తూ కూడా దీన్ని చక్కని ప్రవృత్తిగా కొనసాగిస్తున్న వైనం ముచ్చటేస్తుంది. సందర్శకులను అలరించే టపాలతో దిగ్విజయంగా బ్లాగు ప్రస్థానం సాగిస్తున్న ప్రముఖ మహిళా బ్లాగరి శ్రీమతి రమణిగారు. హైదరాబాదు వాస్తవ్యురాలైన ఈవిడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. “మనలోని మాట – నా మనసులోని మాట” అంటూ చదువరులందరినీ అలరించే, ఆలోచింపజేసే ఎన్నో ముచ్చట్లు తన బ్లాగులో చెబుతున్నారు రమణిగారు !

పత్రికలో వచ్చిన వ్యాసంతో తెలుగు బ్లాగుల గురించి తెలుసుకున్న రమణి “మన పిల్లలు డబ్బులిచ్చి కాదు, బాల్యాన్ని అమ్ముకుని చదువుకుంటున్నారు” అంటూ అందరినీ ఆలోచింపజేసే టపాతో ఏడాది క్రితం బ్లాగు ప్రారంభించారు. దైనందిన జీవితంలో తనకు ఎదురై మనసుని మెలిపెట్టిన సంఘటనను నేపధ్యంగా తీసుకుని రమణిగారు ఆ టపాలో వ్యక్తపరచిన భావాలు నేటితరం తల్లితండ్రులను నిర్మొహమాటంగా నిలదీస్తాయి! “అనుబంధం – ఆత్మీయత” అనే మలి టపాలోనే పలుచనబడిపోతున్న మానవ సంబంధాల గురించి స్పృశించారు. “ఒక రిలేషన్‌లో మహిళ మగవారి నుండి ఏం కోరుకుంటుంది?” అనే టపాలో మగువ మనసు లోతుల్లోని భావాలని అద్భుతంగా ఆవిష్కరించారు. తను రాసే టపాలు ప్రతి గృహిణి నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో విషయాలు, అనుభవాలను ప్రతిఫలిస్తాయి. అందుకే ఆ టపాల్ని చదివిన మహిళలెవరైనా వాటిలో తమని తాము తరచి చూసుకోగలుగుతారు. ప్రతీ టపాలోనూ స్పష్టమైన , పరిణితితో కూడిన దృక్పధం గోచరిస్తుంది.

“దేవుడు భక్తి” అనే టపాలో ఇలా అంటారు… “పూర్వకాలంలో భక్తి అంటే స్వర్గం కోసమో నరకం కోసమో అని విన్నాము. కాని ఇప్పటి భక్తి స్వర్గ నరకాల కోసం కాదు.. జీవితం కోసం. జీవించడం కోసం. జీవితానికి సంబంధించిన కోరికల కోసం! నిరుద్యోగికి ఉద్యోగం రావాలనో.. ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావాలనో.. ఎవరికి తగ్గ రీతిలో వాళ్లు ఎప్పుడే ఇబ్బంది ఎదురైతే అవి పోవాలనే దేవుడిని కోరుకోవడం జరుగుతుంది.

” అన్నింట్లోనూ దేవుడిని చూసే మనిషి తీరా చివరకు చేరుకునే మజిలీ “దేవుడా నీవే దిక్కు” అంటూ రమణిగారు తార్కికంగా విశ్లేషించిన తీరు.. అదే టపాలో అలాగని తాను నాస్తికురాలిని కాదంటూ దేవుడికి, జీవితానికి ఎలా ముడిపెట్టాలో స్పష్టమైన గీతను గీసిన పద్ధతి బాగున్నాయి. “దీని భావమేమి తిరుమలేశా?” అనే టపాలో బ్లాగరి ఆ వేంకటేశ్వరుడితోనే ఈ మెసేజ్ 15 మందికి పంపండి, మీకు అదృష్టం కలిసి వస్తుంది వంటి SMSలు, మెయిల్ మెసేజ్‌ల గురించి సంవాదం చేస్తూ చివరకూ వేంకటేశ్వరుడు సైతం అలిమేలుమంగని ప్రసన్నం చేసుకోవడానికి అదే బాటని పట్టేలా సృష్టించిన హాస్యం కడుపుబ్బా నవ్విస్తుంది. అలాంటి మెసేజ్‌లు పంపేవారికి చురుక్కుమనిపించేలా రమణిగారు ఈ టపాని సృష్టించారు.

“జీవిత పరమార్ధం” అనే టపాలో మనిషి జీవితంలోని వివిధ దశలను విశ్లేషిస్తూ ఒక సందర్భంలో ఇలా అంటారు.. “బాగా ఆకలేస్తున్నవాడిని నీ జీవిత పరమార్ధమేమిటి అని అడిగితే ప్రస్తుతం ఆకలి తీర్చుకోవడం అన్నట్లు.. అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారిపోయేదే ఈ జీవిత అర్ధం., పరమార్ధం అని నాకనిపిస్తుంది. అవధిలేని (అవనిలోని) ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధం. ఏ పని చేసిన మన ఆత్మ సంతృప్తి చెందాలి అదే జీవిత పరమార్ధం.” అంటూ అందరినీ తొలిచే అతి పెద్ద ప్రశ్నార్ధకాన్ని అవలీలగా తన తర్కంతో చేధించిన తీరు చాలా బాగుంది.

జోలపాటలు, పిల్లలు అడిగే కథల గురించి “తల్లడిల్లే వేళా… తల్లి పాడే జోలా” అనే టపాలో పిల్లల మానసిక స్థితిని రమణిగారు ఎంత అద్భుతంగా విశ్లేషించారో మీరే చూడండి.. “ఫలానా హోంవర్క్ చూసి ఫలానా టీచర్ ఏమంటుందో? లేదా ఫలానాది చదువుకోలేదు అని టీచర్ కొడుతుందేమో అన్న ఆలోచనలవల్ల కలిగే భయం తల్లిని తన దగ్గర ఉండమనో, తన దగ్గర పడుకోమనో చెప్పేటట్లు చేస్తాయి. అలా ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు పాట పాడమనో, లేదా కథ చెప్పమనో అడిగేలా ఉసిగొల్పుతాయి. ఊ.. కొడ్తూ నిశ్చింతగా నిద్రపోవడానికి చేసే చిన్ని మనసుల అతి చిన్న ప్రయత్నమిది…” అంటారు. ఎంత లోతైన విశ్లేషణో! అనునిత్యం తటస్థించే విభిన్న అంశాల గురించి తార్కికంగా ఆలోచిస్తూ చక్కని నిశ్చితాభిప్రాయాలకు వస్తుంటారు అనిపిస్తుంది రమణిగారి బ్లాగులోని టపాలు అలా తరచి చూస్తే! ఎన్నో సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన ఆవిడ బ్లాగులో ప్రస్పుటంగా కని్‌పిస్తుంది. ఇలాంటి బ్లాగర్లు తెలుగు బ్లాగు ప్రపంచానికి జీవం పోస్తున్నారనిపించక మానదు.

మంచి విషయాలు చెప్పడం వరకే కాకుండా మనం కూడా తప్పనిసరిగా పాటించాలని తన ఇంటి దగ్గర ఇరుగుపొరుగులతో కలిసి విజయవంతంగా నిర్వహించిన ” బత్తీబంద్” కార్యక్రమ విశేషాలు “విజయోత్సాహం” అనే టపాలో వివరించారు. బ్లాగులోకంలో చోటుచేసుకుంటున్న పరిణామలను కూడా నిశితంగా పరిశీలిస్తూ బ్లాగర్ల మధ్య చక్కని వాతావరణం నెలకొనడానికి తన వంతు విజ్ఞతను “ఎవరికెవరు ఈ బ్లాగ్లోకంలో ఎవరికి ఎరుక?” అనే టపాలో ఇతరులకు పంచిపెట్టిన తీరు బాగుంది.

వారమంతా అలసిన భార్యకు సాయం చెయ్యడానికి భర్త ఒక్క ఆదివారం చేసిన వంట ప్రహసనం ఎన్ని ఇక్కట్లకు దారితీసిందో “దొరకునా ఇటువంటి సేవ” అంటూ చాలా చక్కగా వర్ణించారు. బహుశా ఉద్యోగినులైన మహిళలకు ఇది స్వానుభవామేమో! ఇటీవల బ్లాగర్లకు అద్భుతమైన సందేశాన్నిచ్చిన టపా “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” . ఇప్పుడు రమణి అనగానే అందరు బ్లాగర్లకు గుర్తొచ్చేది రోట్లో రుబ్బిన “కందిపచ్చడి”.

తోటి బ్లాగర్ల టపాలను ఠంచనుగా చదువుతూ విభిన్న అంశాలపై తన గళాన్ని టపాల రూపంలో వినిపించే నైజం రమణిగారి అనేక టపాల్లో గోచరిస్తుంది. మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు, ప్రస్తుత పోకడలపై స్పష్టమైన భావజాలం ఆ టపాల్లో కనిపిస్తుంది. ఆవిడ టపాలు మనసులో ఎంత ఆలోచన రేకెత్తిస్తాయంటే గతంలో చదివినవే అయినా ఈ సమీక్ష కోసం మళ్లీ తెరిచి చదువుతుంటే సమీక్ష సంగతి పక్కన పడేసి ఆ టపాల్లో బందీ అయిపోవడం జరుగుతోంది. అయస్కాంతం లాంటి టపాలతో కూడిన ఈ బ్లాగుని మిస్ అయ్యే సాహసం చెయ్యకండి. ఇలాంటి మంచి అంశాలతో రమణిగారు తెలుగు బ్లాగ్లోకాన్ని మరింత అలరిస్తారని ఆశిద్దాం.

సమీక్ష : జ్యోతి వలబోజు

Your Computer might be at risk మెసేజ్ రాకుండా

Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ లో మన కంప్యూటర్లో Firewall ఇన్ స్టాల్ చెయ్యబడి లేకపోయినా, విండోస్ తోపాటు డీఫాల్ట్ గా వచ్చే Firewall డిసేబుల్ చెయ్యబడినా, Automatic Updates డిసేబుల్ చెయ్యబడినా, లేదా ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ ఏదీ ఇన్ స్టాల్ చెయ్యబడకపోయినా system trayలో ఈ క్రింది చిత్రంలో చూపించబడిన విధంగా Your Computer might be at risk అనే బెలూన్ మెసేజ్ చూపించబడుతుంటుంది. ఈ మెసేజ్ కన్పిస్తోందంటే ఒక రకంగా మన మంచికే. Firewall, Antivirus, Automatic Updates మూడు మన సిస్టమ్ ని జాగ్రత్తగా కాపాడే అతి కీలకమైన రక్షణావ్యవస్థలు. ఏ కారణం చేతైనా వాటిలో ఏది లేకపోయినా ఇలా మెసేజ్ చూపించబడి మనల్ని alert చెయ్యడం మంచి ఏర్పాటే.

అయితే కొందరికి ఈ మెసేజ్ చిరాకుగా ఉంటుంది. అలాంటి వారు Start>Settings>Control Panel>Security Centerలోకి వెళ్లి అందులో ఎడమచేతి వైపు Change the way Security Center alerts me అనే ఆప్షన్ ని క్లిక్ చేసి Alert Settings అని వచ్చే బాక్స్ లో Firewall, Automatic Updates, Virus Protection అనే మూడు ఆప్షన్ల పక్కనా టిక్ తీసేసి OK కొట్టండి. అంతే ఇకపై System trayలో Alert రాకుండా ఉంటుంది.

జీమెయిల్ లో ఇప్పుడు స్మైలీలూ వచ్చేశాయి

ఇంతకాలం జీమెయిల్ లో మెసేజ్ కంపోజ్ చేసేటప్పుడు ఎక్కడైనా మన ఎమోషన్లని పొందుపరుద్దామంటే smileys లేకపోవడంతో కాంప్రమైజ్ కావలసి వచ్చేది. ఇప్పుడు తాజాగా Web based (అంటే mail.goolge.com సైట్ ద్వారా ఓపెన్ చేసే) వెర్షన్ లో Smileys కోసం ఓ బటన్ పెట్టారు. Highlight Color బటన్ పక్కన ఈ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ క్రిందనే అనేక స్మైలీలు ప్రత్యక్షమవుతాయి.  కావలసిన స్మైలీపై మౌస్ తో క్లిక్ చేస్తే అది Message బాక్స్ లోకి వచ్చి చేరుతుంది.

పెద్ద సెక్యూరిటీ లోపం – విండోస్ వెంటనే అప్ డేట్ చేసుకోండి

2003వ సంవత్సరంలో XP యూజర్లందరినీ భయపెట్టిన MSBlast Wormని కొంతమంది చూసే ఉంటారు. RPC (Remote Procedure Call) పేరిట ఓ విండో వచ్చి 60 సెకండ్లలో కంప్యూటర్ రీస్టార్ట్ అయ్యేది. వేరే లొకేషన్ నుండి మన పిసికి కనెక్ట్ అయ్యే రిమోట్ కంప్యూటర్లకు యాక్సెసింగ్ ని ప్రసాదించే ఈ RPC ప్రొటోకాల్ చాలా మంచిదే అయినా ఆపరేటింగ్ సిస్టమ్ లోని సెక్యూరిటీ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు సైతం మన పిసిలోకి చొరపడే అవకాశం ఉంది. ఇదే రకమైన దాడులు రెండు వారాల నుండి వెలుగులోకి రాగా మైక్రోసాఫ్ట్ సంస్థ వెంటనే ఓ కీలకమైన సెక్యూరిటీ updateని విడుదల చేసింది. మీరు ఒరిజినల్ విండోస్ వాడుతున్నట్లయితే Windows Update చేసేటప్పుడు ఈ సెక్యూరిటీ ప్యాచ్ ఆటోమేటిక్ గా ఇన్ స్టాల్ చెయ్యబడుతుంది. వివిధ విండోస్ వెర్షన్లు వాడేవారు ఈ క్రింది లింకుల నుండి ఈ అతి ముఖ్యమైన ప్యాచ్ ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. లేదా తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. నేను Vista Ultimate ఒరిజినల్ వాడుతున్నాను, సో Windows Update చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ కొత్త సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ అయిపోయింది. నిర్లక్ష్యం చెయ్యకండి.

విండోస్ 2000 కొరకు లింకు: ఇక్కడ క్లిక్ చేయండి
విండోస్ XP SP2, SP3ల కొరకు లింకు: ఇక్కడ క్లిక్ చేయండి
విండోస్ Server 2003 SP1, SP2ల కొరకు లింకు: ఇక్కడ క్లిక్ చేయండి
విండోస్ Vista, SP1ల కొరకు లింకు: ఇక్కడ క్లిక్ చేయండి
విండోస్ XP SP2, SP3ల కొరకు లింకు: ఇక్కడ క్లిక్ చేయండి
విండోస్ Server 2008 కొరకు లింకు: ఇక్కడ క్లిక్ చేయండి

ఇప్పటివరకూ 500 పోస్టులు!

October 24, 2008 Uncategorized 19 Comments

బ్లాగు మిత్రులందరికీ నమస్కారాలు. చాలా కాజువల్ గా జూలై 9, 2007న ప్రారంభించిన “సాంకేతికాలు” బ్లాగులో ఈరోజుకి 500 పోస్టులు పూర్తయ్యాయి. కొత్త పోస్ట్ చేద్దామని Dashboard ఓపెన్ చేస్తే ఈరోజు ఉదయం రాసినది 500వ పోస్టు అని అర్థమైంది. అందుకే ఈ సంతోషాన్ని మిత్రులతో పంచుకుందామని ఈ 501వ టపా రాస్తున్నాను. నిరంతరం ఈ బ్లాగుని ఆదరిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. సాంకేతికాలు బ్లాగుని ఎంతమంది చూస్తున్నారో (గణాంకాల ప్రకారం సంఖ్య తెలుస్తున్నా), ఎంతమందికి ఉపయోగపడుతోందో అన్న సందేహం అప్పుడప్పుడు తలెత్తుతున్నా, ఇతర సామాజిక అంశాల బ్లాగుల మాదిరిగా కామెంట్ల ప్రోత్సాహకాలు తక్కువే అయినా నేను రాసే ఈ పోస్టులు ఎవరో ఒకరికి ఎప్పుడోసారి ఉపయోగపడితే చాలు అన్న ఉద్దేశంతో పోస్టులు చేసుకుంటూ వెళ్లడం జరుగుతోంది. ఈ బ్లాగు నిర్వహణలో తన పూర్తి సహాయసహకారాలు అందిస్తున్న జ్యోతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు. రోజుల వారీ ఇప్పుడే లెక్కపెడితే బ్లాగు ప్రారంభించి ఇప్పటికి 465 రోజులైంది, 500 టపాలు రాయడం జరిగింది. బ్లాగు ప్రారంభించినప్పటి నుండి ఇంతవరకూ 60,541 విజిట్స్, లక్షా మూడు వేల చిల్లర pageviews నమోదయ్యాయి. ఇదీ స్థూలంగా ఇప్పటివరకూ “సాంకేతికాలు” బ్లాగు ప్రస్థానం. ఆదరించిన అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ…

- నల్లమోతు శ్రీధర్

వేర్వేరు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ లు కావాలంటే..

ఇటీవలి కాలంలో దాదాపు అధికశాతం సైట్లు, ఫోరమ్‌లు రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని పెడుతున్న తరుణంలో అన్ని సైట్లకూ ఒకే యూజర్ నేం పాస్ వర్డ్ ని ఉపయోగించడం కూడా శ్రేయస్కరం కాదు. అయితే ఎప్పటికప్పుడు కొత్త యూజర్ నేమ్, పాస్ వర్డ్ లు గుర్తు తెచ్చుకోవాలన్నా తలనొప్పి వ్యవహారమే. దీనికి పరిష్కారంగా RoboForm2Go అనే సాఫ్ట్ వేర్ ని డౌన్‍లోడ్ చేసుకుని  ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది కొత్త యూజర్‌నేం , పాస్ వర్డ్ లు  సూచించడంతోపాటు వాటిని గుర్తుంచుకుంటుంది. మరో విశేషం ఏమిటంటే ఇది పెన్ డ్రైవ్ లో ఎక్కడికైనా తీసుకువెళ్లగలిగే పోర్టబుల్ వెర్షన్. పెన్ డ్రైవ్ ని USB పోర్ట్ కి కనెక్ట్ చేసి దీని సెటప్ రన్ చేయాలి. ఓ చిన్న ఆప్షన్ ని ఎనేబుల్ చెయ్యడం ద్వారా హార్డ్ డిస్క్ లోకి ఇన్ స్టాల్ చెయ్యగలిగినా ప్రధానంగా పెన్ డ్రైవ్ కోసం ఉద్దేశించబడిన ప్రత్యేకమైన ఉచిత వెర్షన్ ఇది.

uninstallation కోసం ఇది వాడడం ఉత్తమం.

మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉన్న ఏదైనా సాఫ్ట్‌వేర్‌ని Windows Add/Remove programms ద్వారా uninstall చెయ్యడానికి ప్రయత్నించినప్పుడు ప్రోగ్రామ్ మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోకుండా రిజిస్ట్రీలోనూ, ఇతర సిస్టమ్ ఫోల్డర్లలోనూ, కొన్ని ఫైళ్లు అలాగే ఉండీపోతాయి. ఇలాంటీ వాటీని తొలగించడానికి విండోస్‌లోని add/remove ఆప్షన్‌కి బదులుగా Revo Uninstaller అనే సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించండి దీని ద్వారా ఏదైనా ప్రోగ్రాంని uninstall చేస్తున్నప్పుడు Built – in – Safe, Moderate, Advanced అనే పలు మోడ్‌లు లభిస్తుంటాయి. వాటిలో మనకు నచ్చినదానిని ఎంచుకోవచ్చు.

RAM లోపాలను టెస్ట్ చెయ్యడానికి..

మన కంప్యూటర్లో RAM ఫిజికల్ గా డామేజ్ అయితే తరచూ విండోస్, ఇతర సాఫ్ట్ వేర్లు క్రాష్ అవడం, సిస్టమ్ రీస్టార్ట్ అవడం వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ నేపధ్యంలో అసలు ఇప్పుడు మీ కంప్యూటర్ లో ఉన్న RAM Modules సక్రమంగా పనిచేస్తున్నాయో లేదా వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయో test చెయ్యడానికి MemTest అనే చిన్న ఉచిత ప్రోగ్రామ్ పనికొస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేశాక జిప్ ఫైల్ లో ఉండే Memtest.exe అనే ఫైల్ ని రన్ చేయండి. బాక్స్ లో All unused RAM అని ఉన్నప్పుడు, క్రింద Start Testing అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. RAM టెస్ట్ చెయ్యబోయే ముందు Word, Internet Explorer, Firefox వంటి అన్ని ప్రోగ్రాములు క్లోజ్ చేయండి. ఇకపోతే RAM టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా Alert వచ్చినట్లయితే టెస్టింగ్ పూర్తయ్యే వరకూ ఆగి, మరోమారు Testing రన్ చేయండి. మళ్లీ అదే దశలో Alert వస్తే RAMలోని ఆ ప్రదేశంలో ఫిజికల్ గా డామేజ్ అయినట్లు భావించాలి. ఇలా ఏదైనా alert వచ్చి RAM డామేజ్ అయిందన్న విషయం నిర్థారణకు వస్తే వెంటనే RAM మార్చుకోండి. లేదంటే ముఖ్యమైన డేటా లాస్ అవుతుంటుంది.

Search This Site:

Press75.com Press75.com Press75.com Press75.com

About Me

1996వ సంవత్సరంలో తెలుగులో మొట్టమొదట కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రారంభించే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో చెన్నైలో సూపర్ హిట్ తెలుగు ఫిల్మ్ మేగజైన్ కి సబ్ ఎడిటర్ గా కూడా ఏకకాలంలో పనిచేస్తూ 1998 వరకూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మనీషా కొయిరాలా, శంకర్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులెందరినో ఇంటర్వ్యూలు చేయడం మర్చిపోలేని అనుభవం. అయితే సినిమా రంగంలో ఉన్న అనారోగ్యకరమైన వాతావరణం వల్ల నాకంటూ ఓ ప్రత్యేకమైన ఉనికిని సృష్టించుకోవడం కోసం సినిమా రంగం నుండి బయటకు వచ్చి పూర్తిగా టెక్నాలజీ రంగంలో స్థిరపడడం జరిగింది. 96 నుండి 2001 వరకూ పలు కంప్యూటర్ పత్రికలకు ఎడిటర్ గా పనిచేసి.. 2001 నుండి "కంప్యూటర్ ఎరా" తెలుగు మంత్లీ మేగజైన్ ఎడిటర్ గా పత్రిక మొత్తాన్నీ రూపొందిస్తూ ఉన్నాను. అలాగే తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో మొట్టమొదటి టెక్నికల్ phone-in ప్రోగ్రామ్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యే అవకాశమూ 2010 జనవరి 20న కలిగింది. అప్పటి నుండి ఇప్పటివరకూ I News, ETV2, ABN ఆంధ్రజ్యోతి, NTV, Zee 24 గంటలు, సాక్షి టివి, మహా టివి, జాగృతి న్యూస్ వంటి ఛానెళ్లలో 90కి పైగా లైవ్, రికార్డెడ్ ప్రోగ్రాముల్ని చేయడం జరిగింది. 2007లో అత్యుత్తమైన నాణ్యతతో కూడిన పోస్టులతో, వీడియోలతో తెలుగులో మొదటి ప్రొఫెషనల్ టెక్నికల్ బ్లాగ్ గానూ, మొదటి వీడియో బ్లాగ్ గానూ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాగ్ ప్రత్యేకతను సంతరించుకుంది. అలాగే 2007 జనవరి 1న ప్రారంభించిన తెలుగులోనే మొట్టమొదటి టెక్నికల్ ఫోరమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక ఫోరమ్" 14 వేల మంది సభ్యులతో 10 వేలకు పైగా పోస్టులతో 2009 జూలై వరకూ నిర్వహించబడింది. దాంతోపాటే మొట్టమొదటి తెలుగు టెక్నికల్ ఛాట్ రూమ్ అయిన "కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం" అనే ఛాట్ రూమ్ రెండేళ్లలో వేలాది మందికి తెలుగు టైప్ చేయడం మొదలుకుని అనేక కంప్యూటర్ సంబంధిత సాంకేతిక సమస్యలకు తక్షణ సహాయం అందించింది. ఇకపోతే http://youtube.com/nallamothu అనే ఛానెల్ లో 361కి పైగా ప్రొఫెషనల్ క్వాలిటీ తెలుగు టెక్నికల్ వీడియోలు అందించాను. ఈ ఛానెల్ కి 1192 మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా తెలుగు వారందరకీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను.

Google Playలో పొందండి

ఇక్కడ RSS Feedకి Subscribe చేసి నేరుగా పోస్ట్ లు పొందండి