ఈ బ్లాగు గురించి మీ మిత్రులకు తెలియజేయండి.

బ్లాగుల సరస్సులో వికసించిన కల్హారం ..

Jun 5th, 2008 | By | Category: Uncategorized

తెలుగు బ్లాగులలో కవితాబ్లాగులది ఒక విశిష్టశ్రేణి. హృదయ బోషాణంలో పదిలపఱచుకున్న రంగురంగుల అనుభూతిరత్నాల వ్యక్తీకరణ కవితాబ్లాగుల ప్రత్యేకత. ప్రస్తుతం కవితాబ్లాగరులలో అధికసంఖ్యాకులు మహిళలే. ఒకరిద్దఱు బ్లాగ్‌కవులు సైతం లేకపోలేదు. కవితారచనకు ప్రాథమికంగా కావలసింది స్పందించగల అంతరంగం. ఆ అంతరంగానికి అనువైన పదజాలం సమకూడితే ప్రవహిస్తుంది కవితాసరిత. అదృష్టవశాత్తు, ఆ సత్తా ఉన్న కవయిత్రులు మనకు ఉండడంతో తెలుగు అంతర్జాలానికే ఒక వన్నె, ఒక శోభ ఇనుమడించాయి. మన తెలుగు బ్లాగావరణానికి సాహితీసౌరభమూ, సారస్వత విలువా సిద్ధించాయి. అలాంటి కవితాబ్లాగులన్నింటిలోకి శిఖరాయమానమైనది కల్హార.”

( http://swathikumari.wordpress.com ) ఇది టపాల రాశికంటే కూడ వాసికి ఎక్కువ ప్రసిద్ధికెక్కింది. బ్లాగావరణంలో దీనికి అభిమానులు కానివారు దాదాపుగా ఎవరూ లేరు. దీన్ని వ్రాస్తున్న అపురూప ప్రతిభాశాలిని శ్రీమతి స్వాతికుమారిగారు.

సంస్కృతంలో కల్హారముఅంటే కొంచెం ఎఱుపూ, కొంచెం తెలుపూ కలగలిసిన రంగులో ఉన్న కలువపువ్వు. తెలుపు నిర్మలత్వానికీ, ఎఱుపు భావోద్వేగానికీ ప్రతినిధులు. కలువపువ్వులాగానే శాంతరసమూ, స్పందనా, తాజాదనమూ తొణికిసలాడే తన బ్లాగుకు స్వాతికుమారిగారు కల్హారఅని నామకరణం చెయ్యడం ఎంతైనా సముచితం. కవయిత్రి కల్హారని Myriad of Musings అని అభివర్ణించారు దాని ఉపశీర్షికలో !

కల్హారబ్లాగు ఇప్పటికీ సరికొత్త టపాలతో నెజ్జనుల్ని అలరిస్తోంది. వాస్తవానికి ఇందులో కవితలే కాక మాటల తోటఅనే నామాంకం (లేబుల్) కింద ఆలోచనని రేకెత్తించే హృద్యమైన తెలుగు వచనవ్యాసాలూ, Expressions పేరుతో ఇంగ్లీషు వ్యాసాలూ, ఇంగ్లీషు కవితలూ కూడా ఉన్నాయి. ద్విభాషా (తెలుగు, ఇంగ్లీషు) బ్లాగైనప్పటికీ ఇందులోని తెలుగు టపాల తెలుగుదనం మాత్రం తన సహజస్వచ్ఛతతో మనల్ని పలకరిస్తుంది.

బ్లాగు మొదలుపెట్టినప్పుడే కవయిత్రి తన మిషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పూలు కూడా కొయ్యడానికి ఇష్టపడని సున్నితత్వం ఈ కవయిత్రికే సొంతం.

జీవన వేగంలో కాలంతో పాటు పరిగిడుతూనే

కాస్తంత తీరిక దొరగ్గానే మనసుతోటలో

అనుభూతుల పూలు రాలిపోకుండా

పూలసజ్జలో నింపుకుని తెలుగింటి ముంగిట

తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను

మరి కలువ పువ్వేమో అంత అందమైంది

నా మాలల కోసం కొలనులోంచి తియ్యటమేమిటని

ఇక్కడే ఒక కవితా కల్హారాన్ని పూయిద్దామని

ప్రతి రేకు కోసం ఒక కవిత రాసే పనిలో పడ్డాను.”

ఇంత శబ్దాధికారం ఉన్న కవయిత్రి కూడా భావవ్యక్తీకరణకు భాష అశక్తమైనది అనేస్తారు ఒకచోట :

నిశ్శబ్ధ ఏకాంతం, మౌనం ఇన్ని సంగతులు చెబ్తాయే!

బహుశా ఏమీ లేదని చెప్పటానికే మాటలు అవసరపడతాయి.”

మాటల తోట : స్వాతికుమారిగారి వ్యాసాలది కూడా కొంతవఱకు కవితాశైలేనని చెప్పుకోవచ్చు. తిలక్ రచించిన అమృతం కురిసిన రాత్రి గుఱించి సమీక్ష రాస్తూ రచయిత్రి అంటారు : ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉందును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే. ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వంగా కూడా అనిపించనూ వచ్చు.”

కరుడుగట్టిన భాషాభిమానులైనవారు కూడా చెప్పని సత్యాన్ని రచయిత్రి ఆవిష్కరించారు భాష అనే వ్యాసంలో :

నాకు తెలిసిన మూడో తరగతి చదివే పాప ఇంటికి ఆలస్యం గా వచ్చి తన నాన్న తో “Dad, i go to my friend home. So come late” అని చెప్పటం నాకు తెలుసు. పసితనం నుంచి ఇంగ్లిష్ తప్పనిసరిగా మాట్లాడాలి అని రూల్ పెట్టే బదులు ఇటువంటి పనికిమాలిన ఇంగ్లిష్ నేర్పేకన్నా పిల్లల్ని తెలుగులో మాట్లడుకోనివ్వటం నయమేమో అనిపిస్తుంది. స్కూల్ దశలో ఏ మీడియంలో బోధించాలి అనే దాని కన్నా బోధనా విధానం ముఖ్యం అన్నది నా అభిప్రాయం.” అంటూ అసలు సమస్యని సున్నితంగా బయటపెట్టారు.

ఒక మాట మాత్రం నిజం. ఏదో కోల్పోవడానికి సిద్ధపడితేనే మనం కల్హారబ్లాగు చదవకుండా హాయిగా కాలం గడిపెయ్యగలం !

సమీక్షకులు : తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

Liked this article? Read another similar article.
Stumble! for WP

3 comments
Leave a comment »

  1. Beautiful, written review. And Swatikumari garu congratulations

  2. [...] నా బ్లాగు పై సమీక్ష [...]

  3. good

Leave Comment