ఈ బ్లాగు గురించి మీ మిత్రులకు తెలియజేయండి.

విహారి – బ్లాగు సమీక్ష

Aug 5th, 2008 | By | Category: Uncategorized
తెలుగు బ్లాగు ప్రపంచంతో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ విహారి పేరు సుపరిచితమే. http://blog.vihaari.net అడ్రసుతోనూ, “అనుభవాలు..అంతరంగాలు..అన్నీ సరదా పరదాల పదాల పందిరిలో” అన్న పేరుతో తెలుగు బ్లాగర్లపై హాస్యపు జల్లుల్ని విరజిమ్ముతూ, తనదైన చెరగని ముద్ర వేసిన ఈ బ్లాగరి ఇప్పటికే అలవోకగా శత టపాల సంఖ్యని దాటి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకు పోతున్నాడు. ఈ బ్లాగరి బ్లాగు రూపు రేఖలు కూడా బ్లాగు లోని టపాలకు మల్లేనే సర్వాంగ సుందరంగా, కొత్త పెళ్ళికూతురిలా ఎప్పుడూ ముస్తాబై ఉంటాయి.

నా దృష్టిలో ఒక విషయాన్ని ఎవరు రాసారో తెలియకుండా చదివి లేదా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకోగలిగితే, అది నాణ్యమైన హాస్యం కింద లెఖ్ఖ. ఎవరు రాసారో తెలిసి చదివినా నవ్వు రావొచ్చు, కానీ ఆ నవ్వులో మొదట చెప్పిన పరిస్థితిలో ఉన్నంత స్వచ్ఛత ఉండకపోవచ్చు. కారణాలు అనేకం. ఉదా: ఆ రచయితపై అప్పటికే ఓ విధమయిన మంచి అభిమానం ఏర్పడటం వగైరాలు. కాబట్టి తనెవరో తెలిసిన పాత పాఠకులతో పాటు, తనెవరో తెలియని కొత్త పాఠకులని కూడా ఎప్పటికప్పుడు నవ్వించగలిగేవాడే మంచి హాస్యాన్ని పండించేవాడు. ఓ రకంగా కొత్త పాఠకుడే ఈ విషయంలో హాస్య సృష్టికర్తకి సరైన సమీక్షకుడు.

ఈ దృష్ట్యా చూస్తే, తెలుగు బ్లాగుల్లో హాస్యానికి మంచి చిరునామా విహారి బ్లాగు అనటంలో సందేహం లేదు. పాతవాళ్ళను అలరిస్తూనే, క్రొత్త వారిని ఆకట్టుకోవటంలో విహారి సిద్ధహస్తుడు. నేను దాదాపుగా ఓ సంవత్సరకాలంగా విహారి బ్లాగు పాఠకుణ్ణే. హాస్యాన్ని ఓ నిమిషం పక్కనపెడితే, ఓ రచయితగా విహారికి భాషమీదున్న పట్టు బ్లాగుని హాస్యంతో నిమిత్తం లేకుండా కూడా చదివిస్తుంది. హాస్యం గిలిగింతలు పెడితే, వ్యంగ్యం కలిసిన హాస్యం పొట్టచెక్కలు చేయిస్తుంది. నిజానికి వ్యంగ్యం మరియు హాస్యం ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటే తప్ప అచ్ఛంగా హాస్యం అన్ని వేళళా రక్తి కట్టకపోవచ్చు. విహారి బ్లాగుల్లో కావలిసినంత హాస్యము, అంతకు మించిన వ్యంగ్యమూ నిత్యం విలసిల్లుతూ ఉంటాయి. ఉదాహరణకి, కాదరయ్యా Vs బ్లాగరయ్యా టపాలో కొత్త బ్లాగరి కష్టాలు వ్యంగ్యాత్మకంగా చెబుతున్నాడు చూడండి.

ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య టపాలో అనవసరంగా రాజీవ నామ జపం చేస్తూ హోరెత్తిస్తున్న కాంగీరేసు వాణ్ణి ఇలా చిత్రీకరించాడు.

ఇకపోతే సిద్ధ, బుద్ధ పేర్లతో రెండు పాత్రలను సృష్టించి వారి నోటి ద్వారా సమకాలీన పరిస్థితులపై వేయించే చురకలు తెలుసుకోవాలంటే మీరు సిద్ధ, బుద్ధ లను కలవాల్సిందే.

హాస్యం విషయానికొస్తే, చదివే ఓపికా తీరికా ఉండాలే గానీ కావాల్సినన్ని హాస్య టపాలు విహారి బ్లాగు సొంతం. మచ్చుకు కొన్ని…

డాక్టర్ చింగ జింగ చూ యాక్

హాస్యాన్ని నరనరాన జీర్ణించుకున్నవాడుకాకపోతే, తనకొచ్చిన కష్టంలో కూడా ఎవడు ఇలా “ఐయాం నాటే లెజెండ్ ” అంటూ హాస్యాన్ని వెతుక్కుని సుఖపడతాడు చెప్పండి?


ఒక హాస్య రచయితకుండవలసిన విషయ పరిజ్ఞానం, ఎప్పటికప్పుడు చుట్టూరా జరుగుతున్న విషయాలను టపాలలో చొప్పించగల నేర్పు విహారిలో సమృద్ధిగా ఉండబట్టే ఈ బ్లాగు నిత్య కళ్యాణం పచ్చతోరణముగా ఉందనడములో అతిశయోక్తి లేదు. ఇతరులు ఆశ్చర్యపడేలా, ఏమీ లేదనుకొన్న ఒక విషయానికి హంగులద్ది ఒక మంచి టపా సృష్టిలో విహారి నేర్పరితనం తప్పక ప్రస్తావించదగ్గదే. ఈ టపా “కేజీ బియ్యం అయిదు సెంట్లకు అర్జీ — 1″ చూడండి.


ఒక బ్లాగరిగా తాను రాసిన వంద టపాల అనుభవాన్ని రంగరించి కొత్త బ్లాగర్లకు మార్గదర్శకాలు ఇచ్చి, బ్లాగులు రాయటంలో మెళకువల్ని చెప్తున్నాడు ఈ టపాలో.


ఇకపోతే, నూరు టపాలు వ్రాయటం పూర్తయిన సందర్భములో ఈ బ్లాగరి “నూరుటపాల వారోత్సవం” అన్న పేరుతో ఒక వర్గాన్ని సృష్టించి దానిలో ఒక ప్రయోగాత్మకమైన వీడియో బ్లాగు సృష్టించాడు. ఈ టపా తెలుగు బ్లాగుల్లో ఓ నూతన ప్రక్రియగా తోటి బ్లాగరుల మన్ననలందుకున్నాడు.


ఈ బ్లాగరికి భాషాభిమానమూ మెండేనండోయ్. ఎక్కువగా వ్యావహారిక తెలుగులో తన టపాలను రాస్తున్నా, తాను పుట్టిన ఊరూ, చిన్ననాటి విషయాలని గుర్తుచేసుకుంటూ పుట్టిపెరిగిన ఆ రాయలసీమ మాండలికంలోనే ఆ విశేషాలను ఇలా మనతో పంచుకుంటున్నాడు.


అలానే ఇటీవలే తన బ్లాగులపై తనకున్న అభిమానాన్ని ప్రదర్శిచటానికి సిరివెన్నెల గారి ఓ గీతానికి పేరడీగా మరో బ్లాగు గీతం ఓ టపాగా రాసాడు.


ఇలా చెప్పుకుంటూ పోతే, ఏవో ఒకట్ల సంఖ్యలో టపాలు తప్పించి ప్రతి టపా ఒక ప్రత్యేక టపా స్థాయిలో ఉంటాయనటంలో అనుమానం లేదు. చదివే ఓపికా, తీరికా ఉండాలే గానీ చదివి మనసారా నవ్వుకోగలిగే టపాలు కోకొల్లలు.

ఇంతటి మంచి విందు భోజనంలో ఒకటి అరా ఫిర్యాదులు ఉన్నాయి.

మొదటిది, టపాల సైజు. తరచుగా విహారికి తాను అందిస్తున్న ఈ తీపి తీపి వంటకాన్ని పెద్ద మొత్తములో వడ్డించటం అలవాటు. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం.

రెండోది, విహారి పాత టపాలు శోధించటం అంటే, నిజంగా గనిలోనుంచి బొగ్గు తవ్వి తీసినంత కష్టమైన పని. సమీక్షకుడిగా నా కష్టాలే అందుకు సాక్షి. బహుశా, పాత టపాలను వేరే చోటికి తరలించి బ్లాగు వేగమందుకునేలా చెయ్యాలేమో.

హాస్యం పండించటం నిజంగా కత్తి మీద సామే. కాస్త గతి తప్పినా హాస్యం కాస్త అపహాస్యం అవుతుంది. అదీ వ్యంగ్యప్రధానమయితే మరింత ఒళ్ళు దగ్గరపెట్టుకు రాయటం అవసరం. లేకపోతే, పాఠకుల ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి రావచ్చు. ఈ సాధక బాధకాలని తట్టుకుంటూ, విహారి తడబాటు లేకుండా హాస్యాన్ని పండిస్తూనే ఉన్నాడు. విహారి హాస్య ప్రస్థానం ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ బ్లాగు సమీక్ష రాసింది మనలోని ఒక ప్రముఖ బ్లాగరు.కాని అది ఎవరో గుర్తించమని విహారి కి చాలెంజ్ విసిరారు సమీక్షకులు.. మిగతావారు ఎవరైనా చెప్పగలరా??

Liked this article? Read another similar article.
Stumble! for WP

7 comments
Leave a comment »

  1. తాబాసు గారు?

  2. నిస్సందేహంగా సీబీరావుగారే.

  3. బహుశా జనం గుర్తు పట్టేస్తారనేమో.. పక్షి బొమ్మ పెట్టలేదు!! :)

  4. అచ్ఛంగా హాస్యం అన్ని వేళళా

    పై వాక్యభాగంలో దొర్లిన రెండు అక్షరదోషాలే ఇది రాసినది తాలబాసు గారు కాదనడానికి ఋజువు. సీబీరావు గారు రెండేళ్ల నుంచి తెలుగు బ్లాగులోకంలో ఉండగా ఈ సమీక్షకుడు మాత్రం

    “నేను దాదాపుగా ఓ సంవత్సరకాలంగా విహారి బ్లాగు పాఠకుణ్ణే.”

    అంటున్నారు. ఇద్దరి మధ్యా సంవత్సరం తేడా ఉంది. :)

  5. బహుశా జనం గుర్తు పట్టకుండానేమో… అలా అంటున్నారు! :)

  6. ముందుగా నా బ్లాగును సమీక్షించి అన్నీ మంచి వాక్యాలే చెప్పినందుకు కృతజ్ఞతలు. కొంచెం ఎక్కువ కన్సెషన్‌ ఇచ్చినట్లున్నారు :-)

    ఇక పెద్ద టపాలు ఈ మధ్య బాగానే తగ్గించుకున్నా.పాత వాటిని శొధించడానికి సమయం ఎక్కువ తీసుకుంటుందన్నారు. నేను వర్డు ప్రెస్సును నా డొమైన్‌ లో వ్యస్థాపితం చేసుకున్నప్పుడు కుదురుతుందేమో చూడాలి.

    చదవగానే రావు గారు అనిపించింది. కానీ ఒక సంవత్సర కాలంగా పాఠకుణ్ణి అనే దగ్గర అనుమానాలొచ్చాయి.

    – విహారి

  7. విహారి గారి బ్లాగు సమీక్షని రాసినది “వికటకవి” శ్రీనివాస్ గారు. ఆయనకు, స్పందించిన బ్లాగు మిత్రులకు ధన్యవాదాలు.

Leave Comment