

ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ ఫ్రాడ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఏటీఎం మిషన్స్‌లో డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల నుండి కీలకమైన సమాచారం దొంగతనం చేసి, వాటి ఆధారంగా cloned కార్డులు తయారుచేసే కార్డ్ స్కిమ్మింగ్ ముఠాల గురించి చాలా మందికి తెలిసిందే.
అయితే ఈ సమస్య కేవలం ఏటీఎమ్ మిషన్లకే పరిమితం కాదు. మీరు తరచూ షాపింగ్ చేసే ఆన్లైన్ షాపింగ్ సైట్లలో కూడా, వాటిలో ఉండే సెక్యూరిటీ లోపాల ఆధారంగా ప్రమాదకరమైన స్కిమ్మింగ్ కోడ్‌ని హ్యాకర్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. వివిధ వస్తువుల పై డిస్కౌంట్లని ఆఫర్ చేసే discountmugs.com అనే వెబ్సైట్లో తాజాగా ఇలాంటి ఒక సంఘటన వెలుగుచూసింది. ఒక ప్రత్యేకమైన డిస్కౌంట్ సేల్ సందర్భంలో, ఆ వెబ్సైట్ సందర్శించి, వస్తువులు కొనుగోలు చేయడానికి తమ క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించిన వినియోగదారుల యొక్క కార్డ్ వివరాలు దొంగిలించబడతాయి.
ఆ వెబ్ సైట్ లో ఉండే సెక్యూరిటీ లోపాల ఆధారంగా ఆ సైట్ నిర్వాహకులకు ఏ మాత్రం అనుమానం రాకుండా హ్యాకర్లు స్కిమ్మింగ్ కోడ్ పొందుపరిచారు. దీంతో ఎవరైనా షాపింగ్ చేయడానికి వెళ్లి, పేమెంట్ పేజీలో తమ కార్డు వివరాలు ఎంటర్ చేసిన వెంటనే, ఆ సమాచారం మొత్తం హ్యాకర్లకి పంపించబడేది. తద్వారా చాలామంది బ్యాంక్ ఎకౌంట్లు ఖాళీ అయ్యాయి. ఇదే రకమైన ప్రమాదాలు మనం తరచూ వాడే ఆన్లైన్ షాపింగ్ సైట్లలో కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు.
ప్రముఖ షాపింగ్ సైట్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ఆడిట్ చేయటం ద్వారా మరింత సురక్షితంగా ఉండటం కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాయి. అయితే చిన్నా చితకా వెబ్సైట్లు మాత్రం నిర్లక్ష్యంగా ఉండడం వలన కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటి సైట్లలో మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది.