

మీ స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే గనుక ఇప్పటికే చాలామంది Whatsappలో రియల్ టైం లొకేషన్ షేరింగ్ చేస్తూ ఉంటారు. పూర్తిగా వాట్సప్ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ఎప్పటికప్పుడు మీ ఆత్మీయుల లొకేషన్ తెలుసుకోవటానికి అనేక అద్భుతమైన Android Apps అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్ధాం.
Glympse
చాలా కాలం నుండి లభిస్తూ చాలా పాపులర్ అయిన అప్లికేషన్ ఇది. దీనిని మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. వారు కేవలం ఒకే ఒక లింక్ మీకు sms ద్వారా గానీ, Whatsapp ద్వారా గానీ షేర్ చేస్తే చాలు, వారి కదలికలను, ప్రస్తుతం ఉన్న లొకేషన్ ని మీరు నేరుగా బ్రౌజర్లో చూడగలుగుతారు. అలాగే ఒక నిర్దిష్టమైన సమయం తర్వాత లొకేషన్ షేరింగ్ ఆటోమేటిక్గా డిజేబుల్ అయ్యేవిధంగా దీంట్లో చేసుకోవచ్చు. దీనిని పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు.
Sygic Family Locator
మీ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వారి లొకేషన్ తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది వాడే పాపులర్ అప్లికేషన్ ఇది. ఎమర్జెన్సీ సమయంలో పిల్లలు తమ పేరెంట్స్ ని అలర్ట్ చేసే విధంగా దీంట్లో SOS బటన్ కూడా ఉంటుంది. అలాగే పిల్లలు స్కూల్, ఇతర గమ్యస్థానాలకు చేరుకున్న వెంటనే పేరెంట్స్ కి ఆటోమేటిక్ గా అలర్ట్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీ ఫోన్లో కూడా తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Geo Tracker
కేవలం మామూలు లొకేషన్ డేటా మాత్రమే కాకుండా, ట్రెక్కింగ్ లాంటిది చేసే వారికి ఉపయోగపడే విధంగా ఆల్టిట్యూడ్, వెర్టికల్ డిస్టెన్స్, స్లోప్ ఇంక్లినేషన్ వంటి అనేక ఇతర సదుపాయాలను ఇది కలిగి ఉంటుంది. ట్రెక్కింగ్ చేసే వారు తమ యోగక్షేమాలను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఈ అప్లికేషన్ ప్రయత్నించవచ్చు.