

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అనేక రకాల కొత్త రకాల ఛాలెంజ్‌లు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఫోటోలు అప్లోడ్ చేయడం విషయంలో చాలామంది వెనకా ముందు ఆలోచించకుండా అప్లోడ్ చేస్తుంటారు.
గతంలో మనం చూసిన 10YearsChallenge, ఆ తర్వాత శారీఛాలెంజ్, ఇప్పుడు కపుల్ ఛాలెంజ్ విషయంలోనూ అందరూ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆగాలి అని ఒకరి వెంట మరొకరు ఉత్సాహంగా ఫేస్బుక్లో తమ జీవిత భాగస్వామితో దిగిన ఫోటోలు అప్లోడ్ చేయడం గమనిస్తూనే ఉన్నాం. అయితే దీని పట్ల స్థానిక పోలీస్ విభాగం స్పందించలేదు కానీ, పూనే నగర పోలీస్ ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేయడం విషయంలో వినియోగదారులకు హెచ్చరిక జారీ చేశారు.
కపుల్ ఛాలెంజ్ పేరుతో మీరు అప్లోడ్ చేసే ఫోటోలు చాలా సులభంగా మార్ఫింగ్ చేస్తారని, వాటి వలన ఎన్నో రకాల సమస్యలు ఏర్పడతాయని, కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని వినియోగదారులను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఒక మామూలు ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా క్షణాలలో నగ్నంగా తయారుచేసే టెక్నాలజీలు వచ్చిన నేపథ్యంలో ఇది చాలా ప్రమాదకరం.
ఇలా అప్లోడ్ చేసిన ఫోటోలను మార్ఫింగ్, రివెంజ్ పోర్న్, డీప్‌ఫేక్స్ వంటి పద్ధతుల ద్వారా దుర్వినియోగం చేసి సైబర్ నేరాలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీ ల గురించి గతంలో వివిధ తెలుగు టీవీ ఛానళ్లలో నేను చేసిన డెమోలు చాలా మందికి గుర్తుండే ఉంటాయి. మీరు అనుకున్నంత సురక్షితం కాదు, మీరు అప్లోడ్ చేసే ఫోటోలు. ముఖ్యంగా గతంలో కాస్త ఆచితూచి వ్యవహరించే వారు కూడా, ఈ మధ్యకాలంలో ఎలాంటి విచక్షణ లేకుండా సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేయడం చూస్తున్నాం.