

కరోనా వైరస్ కారణంగా దాదాపు నెల రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రకాల వ్యాపారాలు ఇబ్బంది పడుతున్నాయి. దీని ప్రభావం mobile storeల మీద కూడా పడింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ బ్రాండ్లకి సంబంధించి నిర్వహించబడుతున్న అనేక మొబైల్ స్టోర్లు అమ్మకాలు లేకపోవడంతో ఖర్చును తగ్గించుకోవడం కోసం సిబ్బందిని తగ్గించే పనిలో పడ్డాయి. థర్డ్ పార్టీ మొబైల్ రిటైల్ షాప్లు మాత్రమే కాకుండా Xiaomi, HMD Global వంటి వివిధ ఫోన్ తయారీ కంపెనీలకు చెందిన రిటైల్ స్టోర్ లు కూడా ఇదే బాటలో ఉన్నాయి. అందరు ప్రమోటర్ లకు సంబంధించిన జీతాలు మార్చి 2020కి ఆయా సంస్థలు చెల్లించడం జరిగింది. అనేక సంస్థలు ఏప్రిల్ 2020 కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీతాలు చెల్లించే యోచనలో ఉన్నాయి.
అయితే ఇది పరోక్షంగా తమకు చాలా ఆర్థిక భారం అవుతుందని, ఏదో రూపేణా ఖర్చులు తగ్గించుకోవడం కోసం కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొన్ని సంస్థల ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే, వ్యాపారాలు మూతపడటం వల్ల మొబైల్ స్టోర్ లకు సంబంధించిన అద్దెలు కూడా భారంగా మారాయి. అనేక నగరాల్లో ప్రధాన కూడళ్లలో నెలకొల్పబడి ఉన్న మొబైల్ స్టోర్ల కోసం సంబంధిత భవన యజమానులకు పెద్ద మొత్తంలో అద్దెలు చెల్లించవలసి వస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మూడు నెలలపాటు EMIల మీద మారటోరియం విధించిందో, అదేవిధంగా అద్దెల విషయంలో కూడా భవన యజమానులు సమీక్షించాలని ఆ వ్యాపార సంస్థలు కోరుకుంటున్నాయి. దాదాపు అధికశాతం సంస్థలు, ఏప్రిల్ 2020 వరకు పరిస్థితిని ఎదుర్కోవడానికి మానసికంగా సన్నద్ధంగా ఉన్నాయి. ఇదే పరిస్థితి ఆ తర్వాత కూడా కొనసాగితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేవలం మొబైల్ స్టోర్లు మాత్రమే కాదు.. దేశంలోని అన్ని వ్యాపారాల పరిస్థితి ఇలాగే ఉంది.