
తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తూ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వినియోగదారుల ఆదరణ చూరగొంటున్న ACT Fibernet సంస్థ తాజాగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న వినియోగదారులకు అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేకుండానే వారు ప్రస్తుతమున్న ప్యాకేజీ లోనే మరింత స్పీడ్ అందించడం మొదలు పెట్టింది.
ఈ మేరకు ఇప్పటికే అనేక మంది వినియోగదారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. తాజాగా చోటు చేసుకున్న మార్పులు ప్రకారం 1050 రూపాయల నెలవారీ ప్లాన్‌కి ఇప్పటివరకు 75 Mbps స్పీడు మాత్రమే అందించబడేది. అది కాస్తా ఇప్పుడు 100 Mbpsకి పెంచబడింది. అలాగే గతంలో కేవలం 1299 రూపాయల చెల్లిస్తున్న వారికి ఇప్పుడు 150 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందించబడుతుంది. అలాగే నెలకు 1,999 రూపాయలు చెల్లిస్తున్న వారికి 200 Mbps స్పీడ్ అందించబడుతోంది. గతంలో ఇది కేవలం 150 Mbps స్పీడు మాత్రమే లభించేది.
కేవలం స్పీడ్ పెంచడం మాత్రమే కాదు, ఫెయిర్ యూసేజ్ లిమిట్ కూడా పెంచబడింది. గతంలో 1050 రూపాయల ప్లాన్‌కి గరిష్టంగా 600 GB మాత్రమే పరిమితి లభించగా, తాజాగా 750 GB వరకూ లిమిట్ పెంచబడింది. అలాగే 1299 రూపాయలు ప్లాన్ విషయంలో గతంలో ఉన్న 750 GB లిమిట్ స్థానంలో తాజాగా 1TB వరకూ నెలవారీ పరిమితి పెంచబడింది. అలాగే 1,999 రూపాయల ప్లాన్ విషయంలో గతంలో ఉన్న 1.25TB నుండి ప్రస్తుతం 1.5TBకి ఫెయిర్ యూసేజ్ లిమిట్ పెంచబడింది.