

చాలా మందికి తెలియని విషయం విండోస్ ఆపరేటింగ్ సిస్టం సక్రమంగా పనిచేయాలంటే, మన కంప్యూటర్లో తప్పనిసరిగా తగిన మొత్తంలో ఖాళీ స్థలం ఉండాలి. అది కూడా విండోస్ ఇన్స్టాల్ చేయబడి ఉన్న C డ్రైవ్‌లో వీలైనంత ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. అయితే అనేకమంది తెలిసీ తెలియక C డ్రైవ్‌లో ఇష్టమొచ్చినట్లు డేటాను store చేస్తూ దాన్ని నింపేస్తుంటారు.
ఈ నేపథ్యంలో స్టోరేజ్ స్పేస్ తగ్గిపోయే కొద్దీ పరోక్షంగా విండోస్ పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తాజాగా ఓ కీలకమైన మార్పు చేసింది. Windows 10 వెర్షన్ 1903 మొదలుకొని, ఇకపై ఆపరేటింగ్ సిస్టంలో 7 GB స్థలం యూజర్లతో ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా రిజర్వ్డ్ స్టోరేజ్ గా పరిగణించబడుతుంది. ఇది పూర్తిగా ఆపరేటింగ్ సిస్టం కోసమే వాడబడుతుంది.
ఏం స్టోర్ చేస్తారు?
7 GB మైక్రోసాఫ్ట్ తీసుకుంటోంది సరే, అందులో ఎలాంటి డేటా స్టోర్ చేయబడుతుంది అనే సందేహం మీకు ఆల్రెడీ వచ్చి ఉండవచ్చు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఎప్పటికప్పుడు విడుదల చేసే విండోస్ అప్డేట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్యూటర్లో స్మూత్ గా ఇన్స్టాల్ అయ్యేవిధంగా, టెంపరరీ ఫైల్స్, క్యాఛే, ఇతర ముఖ్యమైన విండోస్ ఫంక్షన్లకు ఈ స్పేస్ ఉపయోగించబడుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేసుకునే అదనపు ఆప్షనల్ ఫీచర్లు, ఇన్స్టాల్ చేయబడిన లాంగ్వేజ్‌లను బట్టి ఈ స్పేస్ మారుతూ ఉంటుంది. వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రిజర్వ్డ్ స్పేస్ తొలగించటానికి వీలు లేదు.
ఇకపోతే విండోస్ ఎప్పటికప్పుడు రిజర్వ్డ్ స్పేస్‌లో స్టోర్ చేయబడిన ఫైళ్లని పరిశీలిస్తూ, వాటిలో అవసరం లేని వాటిని తొలగిస్తూ ఉంటుంది. అలాగే అవసరమైన కొత్త వాటిని సేవ్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ విండోస్ ఇన్స్టాల్ చేయబడిన కంప్యూటర్లలో ప్రస్తుతానికి రిజర్వ్డ్ స్పేస్ తీసుకోబడదు. ఒకవేళ మీరు ఏదైనా కంప్యూటర్ లో Windows 10 వెర్షన్ 1903 కొత్తగా ఇంస్టాల్ చేయబోతున్నట్లయితే అప్పుడు మాత్రమే మీ అనుమతి తో సంబంధం లేకుండా అదనంగా 7GB reserved space వాడుకోబడుతుంది.