

Windows ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే డెస్క్టాప్ కంప్యూటర్లు, లాప్టాప్లు అంటే చాలామందికి తరచూ గుర్తొచ్చే విషయం వైరస్.
తమ కంప్యూటర్ వైరస్ బారిన పడకుండా ఉండటం కోసం ఎక్కడబడితే అక్కడ క్లిక్ చేయకుండా, వేటినిబడితే వాటిని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండా చాలామంది నిరంతరం జాగ్రత్త వహిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎప్పుడో ఒకసారి పొరపాటున ప్రమాదకరమైన అప్లికేషన్లు కంప్యూటర్లో రన్ చేయడం, దాంతో తప్పనిసరిగా హార్డ్ డిస్క్ ఫార్మేట్ చేసి మళ్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Windows 10లో అతి త్వరలో రాబోతున్నInPrivate Desktop అనే సరికొత్త సదుపాయం ద్వారా ఇక ఈ బాధలు తప్పబోతున్నాయి. ఇకపై మీరు ఏదైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్ తప్పనిసరి పరిస్థితుల్లో మీ కంప్యూటర్లో రన్ చేయాల్సి ఉంటే.. వర్చ్యువలైజేషన్ ద్వారా ఒరిజినల్ విండోస్ ఫైళ్లు, ప్రోగ్రాములకు ఏ మాత్రం హాని కలగకుండా ఒక ప్రత్యేకమైన వాతావరణంలో దాన్ని రన్ చేసుకునే వెసులుబాటు ఈ InPrivate Desktop అనే సదుపాయం కల్పిస్తుంది.
ప్రస్తుతం Windows Preview Build 17718 వాడుతున్న Windows Insiderలకు ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే ఫైనల్ వెర్షన్ వాడుతున్న వారికి మార్చి 2019 లో ఈ InPrivate Dekstop ఫీచర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత Microsoft Storeలో ఇది ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ గా కనిపిస్తుంది. దాన్ని రన్ చేస్తే గనుక ఇప్పటివరకు మీరు వాడుతున్న ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఏమాత్రం హాని చేకూర్చకుండా వర్చ్యువలైజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఓ డెస్కుటాప్ ప్రత్యక్షమవుతుంది. అందులో మీరు ఎలాంటి ప్రమాదకరమైన ప్రోగ్రాంలనైనా రన్ చేసుకోవచ్చు. పని పూర్తయిన తర్వాత తిరిగి ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్లిపోవచ్చు.