

హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ACT Fibernet బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ వాడుతున్న వినియోగదారులకు శుభవార్త.
దేశవ్యాప్తంగా 16 నగరాల్లో సేవలు అందిస్తున్న ఈ సంస్థ, తాజాగా తన వినియోగదారులందరికీ 100 GB అదనపు బ్రాడ్బ్యాండ్ డేటా ఇవ్వడం మొదలు పెట్టింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవల్సిన విషయం, ఇది కేవలం నెల రోజులకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఎలాంటి పనులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం మీకు మీ ప్లాన్ ద్వారా లభిస్తున్న నెలవారీ ఫెయిర్ యూసేజ్ లిమిట్ డేటాకి అదనంగా ఈ 100 GB క్రెడిట్ చేయబడుతుంది.
ఇది ఇప్పటికే మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే కనుక ఒకసారి మీ ఫోన్ లో ACT Fibernetకి సంబంధించిన మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు 1050 రూపాయల ప్లాన్ వినియోగిస్తూ ఉన్నట్లయితే, దాని ద్వారా మీకు లభించే 750 GB డేటా కి బదులుగా, ప్రస్తుతం 850 GB డేటా లభిస్తుంది. ప్రస్తుతానికి ఇది కేవలం ఒక నెల రోజులకు మాత్రమే ఇది వర్తిస్తున్నప్పటికీ ఇది మరి కొన్ని నెలలపాటు పొడిగించ బడే అవకాశాలు కూడా లేకపోలేదు.
ఒకపక్క రిలయన్స్ జియో గిగాఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందరికీ అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో, ఇప్పటికే బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న పలు సంస్థలు తమ వినియోగదారులను మరింతగా ఆకట్టుకోవడం కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. అందులో భాగంగా రాబోయే ఐదు నెలల పాటు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయనటంలో సందేహమే లేదు.