

Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లు వాడే వినియోగదారుల కోసం Google ఈ సంస్థ తాజాగా ఒక అద్భుతమైన సదుపాయం తీసుకొచ్చింది.
మీ Android phoneని పక్కనబెట్టి మీరు పని చేసుకునే సమయంలో మీ పరిసరాల్లో వినిపించే రకరకాల శబ్దాలను ఇది మీకు తెలియకుండా క్యాప్చర్ చేసి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వినిపిస్తుంది. Google సంస్థ చాలా కాలం నుండి అందిస్తున్న Live Transcribe అనే అప్లికేషన్ ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. ఉదాహరణకు మీ ఇంటి డోర్ బెల్ మోగినా, మీ ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నా, లేదా బయట కుక్క అరుస్తున్నా, బాత్రూమ్‌లో నీరు లీక్ అవుతున్నా ఆ శబ్దాలను ఈ సదుపాయం పసిగడుతుంది.
వాటికి సంబంధించిన సమాచారాన్ని మీకు మీ ఫోన్ మీద నోటిఫికేషన్ల రూపంలో చూపిస్తుంది. ప్రస్తుతానికి Google Pixel phoneలలోని Live Transcribe సదుపాయం ద్వారా లభిస్తున్న ఈ ఫీచర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు వాడుతున్న ఫోన్ లోకి కూడా Live Transcribe అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పొందొచ్చు. అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా దశలవారీగా అందించబడుతుంది. ఇప్పటికే Live Transcribe వాడుతున్న వారికి కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
మెషిన్ లెర్నింగ్ ఆధారంగా ఈ సౌండ్ నోటిఫికేషన్ సదుపాయం పనిచేస్తుంది. మీ ఫోన్ లో ఉండే మైక్రోఫోన్ ద్వారా రిసీవ్ చేసుకునే పది విభిన్నమైన శబ్దాలను ఇది గుర్తిస్తుంది. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే కాదు ఒకవేళ మీరు Android Wear ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ వాచ్ లాంటిది ఏదైనా వాడుతున్నా కూడా దాని మీద కూడా మీకు నోటిఫికేషన్ చూపించబడుతుంది.