ఒక కొత్త Computer కానీ, Laptop గానీ కొనాలంటే వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిన పనిలేదు. కేవలం రూ. 2,868లకే Amazon సైట్‌లో Raspberry Pi 3 Model B కొంటే సరిపోతుంది. దాంతో పాటు దాని కేస్‌ని రూ. 337కి అదే అమెజాన్ సైట్లో కొని ఆ కేస్‌లో Raspberryని అమర్చుకుంటే సరిపోతుంది. మీ పవర్‌ఫుల్ కంప్యూటర్ రెడీ అయిపోతుంది.
ఇంత డివైజ్ ఏం చెయ్యగలుగుతుంది అనుకుంటున్నారా? 10, 15 వేలు పెట్టి మనం కొనే ఓ netbook చేసే అన్ని పనుల్ని ఇది చేసి పెడుతుంది. Credit Card సైజులో ఉండే కేవలం ఒకే ఒక motherboard మీద రన్ అయ్యే శక్తివంతమైన Computerగా మనం దీన్ని పరిగణించవచ్చు. ఈ బోర్డ్‌కి మీరు ఏ Monitorనైనా కనెక్ట్ చేసుకుని పని పూర్తిస్థాయి కంప్యూటర్లా వాడుకోవచ్చు. ఈ motherboard మీద ఉండే USB పోర్టులకి keyboard, mouse వంటివి కనెక్ట్ చేసుకోవచ్చు.
Raspberry Pi నాలుగేళ్ల క్రితం 2012లో తొలిసారిగి విడుదలైంది. అప్పటి మోడల్‌తో పోలిస్తే తాజాగా పైన పేర్కొన్న మోడల్‌లో WiFi, Bluetooth వంటివి నేరుగా మదర్‌బోర్డ్ మీదనే పొందుపరచబడ్డాయి. అలాగే గతంలో ఉన్న 900 MHz ప్రాసెసర్ స్థానంలో 1.2 GHz క్లాక్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ కూడా దీనిలో అమర్చబడింది. 1 GB RAM, VideoCore IV 3D graphics card ఈ మదర్‌బోర్డ్ మీదే లభిస్తున్నాయి.
కుడిచేతి వైపు USB ports, LAN port, అడుగున microUSB power connector, ఈ మదర్‌బోర్డ్‌ని మోనిటర్‌కి గానీ, TVకి గానీ కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా HDMI port, 3.5 mm audio jack లభిస్తున్నాయి.
ఈ కంప్యూటర్ సాయంతో documentsని టైప్ చేసుకోవచ్చు, వెబ్‌సైట్లని బ్రౌజ్ చేసుకోవచ్చు, online movies చూడొచ్చు. పాటలు వినొచ్చు, games ఆడొచ్చు.. ఓ netbookతో ఏ తరహా పనులు చేసుకోవచ్చో అలాంటివి అన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు వాళ్లు తయారు చేసే ప్రాజెక్టులకు సంబంధించి microControllerలను కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మామూలు టివిని smart tvగా మార్చుకోవడానికి కూడా ఈ Raspberry Pi 3 పనికొస్తుంది.
ఈ డివైజ్ మీద పనిచెయ్యడానికి వీలుగా అనేక Linux ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌లు లభిస్తున్నాయి. NOOBS అనేది వాటిలో ఒకటి. దీన్ని నేరుగా Raspberry Foundation వెబ్‌సైట్ నుండి download చేసుకుని microSD కార్డ్‌లో ఆ ZIP ఫైల్‌లోని సమాచారాన్ని extract చేసి ఆ microSD కార్డ్‌ని Raspberry Pi 3కి కనెక్ట్ చేస్తే ఇక అది కంప్యూటర్‌లా బూట్ అవుతుంది. Snappy Ubuntu, Raspbian వంటి ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లు కూడా దీని కోసం లభిస్తున్నాయి. Microsoft కూడా Windows 10 IoT Core ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌ని Raspberry Pi 3 కోసం తయారు చేసింది.