
Google Chrome వెబ్ బ్రౌజర్ వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న Dark Mode సదుపాయం తాజాగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో గూగుల్ క్రోమ్ వాడుతున్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రాబడింది.
కొద్ది రోజుల క్రితం మ్యాక్ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న వారికి ఈ సదుపాయం వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా Windows కంప్యూటర్లు వాడుతున్నవారు, ఒకవేళ బీటా వెర్షన్ వాడడానికి సిద్ధపడినట్లయితే, Google Chrome 74 Beta వెర్షన్లో తాజాగా డార్క్ మోడ్ ప్రవేశపెట్టబడింది.
అయితే దీన్ని ఎనేబుల్ చేయడం ఎప్పటి కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సహజంగా ఒక అప్లికేషన్‌కి సంబంధించిన సెట్టింగ్స్ లో దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు లభిస్తాయి. అయితే, విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఇటీవలి వెర్షన్స్‌లో system wide dark mode ఎనేబుల్ చేయబడే విధంగా డిస్ప్లే సెట్టింగ్స్ లో కొత్త ఆప్షన్స్ లభిస్తున్న నేపథ్యంలో.. ఒకవేళ మీ దగ్గర గూగుల్ క్రోమ్ బీటా తాజా వెర్షన్ లభిస్తున్నట్లయితే.. మీరు గూగుల్ క్రోమ్ లో ఎలాంటి మార్పులు చేయాల్సిన పనిలేదు.
కేవలం మీరు చేయవలసిందల్లా మీ కంప్యూటర్లో డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్లి డార్క్ థీమ్‌ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. వెంటనే దాని ప్రభావం గూగుల్ క్రోమ్ మీద కూడా పడుతుంది. అప్పటివరకు నార్మల్ మోడ్‌లో ఉన్న గూగుల్ క్రోమ్ వెంటనే డార్క్ మోడ్‌లోకి మారిపోతుంది. గంటలతరబడి కంప్యూటర్ మీద సమయం గడిపే వారికి, కంప్యూటర్ స్క్రీన్ నుండి తెల్లటి లైట్ వల్ల కళ్ళ మీద ఒత్తిడి పడకుండా ఉండటం కోసం, పరోక్షంగా ఈ డార్క్ మోడ్ ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.