

Google Maps ఎప్పటికప్పుడు అనేక కొత్త ఆప్షన్లను తన అప్లికేషన్లో ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దేశంలోని 31 నగరాల్లో కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది.
లాక్ డౌన్ కారణంగా ఎక్కడికక్కడ కార్యకలాపాలు స్తంభించిపోయిన నేపథ్యంలో, అనేక మంది కార్మికులకు, పేదలకు ఆహారం, వసతి సదుపాయాలు చాలా కష్టంగా ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా కొంతమంది సేవాతత్పరత కలిగిన వ్యక్తులు అలాంటి వారిని గుర్తించి ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో అందరి అవసరాలను తీర్చలేవు.
వాస్తవానికి వివిధ నగరాల్లో అక్కడి ప్రభుత్వాలు, నగర పాలక సంస్థలు తక్కువ ధరకు గాని ఉచితంగా గానీ ఆహారాన్ని అందించే షెల్టర్లను ప్రారంభించడం జరిగింది. మరికొన్ని చోట్ల రాత్రి బస చేయటానికి కూడా వసతి సదుపాయం కల్పించబడింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 31 నగరాల్లో లభిస్తున్న ఇలాంటి సదుపాయాలను ఇకమీదట Google Maps ద్వారా సులభంగా వెదికి పట్టుకోవచ్చు.
మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి, Food Shelter Near Me, Night Shelter Near Me ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు దగ్గరలో ఉండే షెల్టర్ల గురించి సమాచారం పొందవచ్చు. Google India సంస్థ భారత ప్రభుత్వం మరియు స్మార్ట్ సిటీస్ బృందం సహకారంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సదుపాయం ఉపయోగించడం ద్వారా మీ దృష్టికి ఎవరైనా సరైన భోజన వసతి సదుపాయాలు లభించక ఇబ్బంది పడుతూ కనిపిస్తే, వారిని సంబంధిత ప్రదేశాలకు తరలించే అవకాశం కలుగుతుంది.