
Android phoneలలో ఇటీవలికాలంలో 6 జిబి నుండి గరిష్టంగా 16 జీబీ వరకు RAM కలిగిన ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా smartphoneలు మరింత శక్తివంతంగా మారేకొద్దీ మల్టీటాస్కింగ్ మెరుగుపడుతుంది గానీ మరోపక్క బ్యాటరీ కూడా వేడెక్కుతూ ఉంటుంది. తద్వారా బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది.
ఒక ఆపరేటింగ్ సిస్టం కి వివిధ ప్రోగ్రాముల పనితీరు మెరుగ్గా ఉండేలా చూడటం తో పాటు, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా వచ్చేలా చూడడం అతి కీలకమైన అంశం. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న Google ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ మెరుగ్గా వచ్చేలా చాలాకాలం నుండి అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అందుబాటులోకి వచ్చిన Doze mode అలాంటి వాటిలో ఒకటి.
అయితే దానికి అదనంగా తాజాగా Android 11 ఆపరేటింగ్ సిస్టంలో గూగుల్ సంస్థ ఒక శక్తివంతమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. అదే క్యాఛే దశలో ఉన్న అప్లికేషన్లను ఫ్రీజ్ చేయడం! ఎప్పుడైతే వాటిని మళ్ళీ వినియోగదారుడు వాడడం మొదలు పెడతాడో అప్పుడు అన్‌ఫ్రీజ్ చెయ్యడం ఈ ప్రక్రియలో ఒక భాగం. సహజంగా మనం ఫోన్లలో ఒకేసారి పలు అప్లికేషన్లు ఓపెన్ చేసి పని చేసేటప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న అప్లికేషన్ మాత్రమే యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. మిగిలిన అప్లికేషన్స్ అన్ని మెమరీలో క్యాఛే చేయబడతాయి. రీసెంట్ అప్లికేషన్స్ ద్వారా గానీ, మనకు కావలసిన అప్లికేషన్ ఐకాన్ మళ్లీ టాప్ చేయడం ద్వారా గానీ మనం సంబంధిత అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అప్పటివరకు cacheలో ఉన్న యాప్ తిరిగి వెనక్కి తీసుకు రాబడుతుంది.
సరిగ్గా ఇలా cache చేయబడి ఉన్న అప్లికేషన్స్‌ని తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడం ద్వారా అవి cpu సైకిల్స్ మరియు, ఇతర సిస్టం వనరులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం ద్వారా పరోక్షంగా బ్యాటరీ ఆదా అయ్యే విధంగా చేయటం Android 11లో కొత్తగా వచ్చిన సదుపాయం. వాస్తవానికి Android 11 ఆపరేటింగ్ సిస్టం కొంతకాలం క్రితం అందుబాటులోకి వచ్చినా కూడా తనకి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా కూడా అధికారికంగా లేదు. కానీ అంతర్గతంగా Android 11కి సంబంధించిన కోడ్ పరిశీలించినపుడు Google సంస్థ ఈ కొత్త సదుపాయాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లు అర్థమవుతోంది.