
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 59 చైనా అప్లికేషన్లను నిషేధించిన విషయం తెలిసిందే. TikTok, Shareit, CleanMaster వంటి భారీ మొత్తంలో అప్లికేషన్స్ వీటిలో ఉన్నాయి.
Android యూజర్ల కోసం Google Play Store, iPhone యూజర్ల కోసం App Store నుండి వాటిని విజయవంతంగా తొలగించగలిగారు గానీ చైనా ఫోన్ తయారీ కంపెనీలు మాత్రం ఈ నిషేధాన్ని సమర్థవంతంగా అమలుపరచడం లేదు. ఉదాహరణకు Cheetah Mobiles అనే చైనా సంస్థకు చెందిన Clean Master అప్లికేషన్ కేంద్ర ప్రభుత్వం చేత నిషేధించబడింది. అయితే Xiaomi, Realme సంస్థలు ఇప్పటికే విడుదల చేసిన వాటితో పాటు, కొత్తగా విడుదల చేస్తున్న ఫోన్లలో కూడా ఈ అప్లికేషన్ పరోక్షంగా వినియోగించటం గమనార్హం.
ఇవి ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా offlineలో కూడా ఫోన్లో పనిచేస్తాయి కాబట్టి, నేరుగా ఆ యాప్ పేర్లు యూజర్లకి కనిపించకుండా, కేవలం ఒక వినియోగదారుడు తన ఫోన్ క్లీన్ చేసుకోవాలని భావించినపుడు యూజర్‌కి బ్యాక్ గ్రౌండ్ లో Clean Master సర్వీస్ ద్వారా ఫోన్ క్లీన్ చేయడం గమనార్హం. వాస్తవానికి వివిధ ఫోన్ తయారీ సంస్థలు గతంలో నిషేధించబడిన అప్లికేషన్ లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఆయా అప్లికేషన్లను తాము విడుదల చేసే ఫోన్లలో నిక్షిప్తం చేస్తున్నాయి.
అయితే ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్ ల విషయంలో నిషేధించబడిన అప్లికేషన్లను శాశ్వతంగా వినియోగదారుడు తొలగించే విధంగా, లేదా ఫోన్ తయారీ కంపెనీనే వాటిని తొలగించే విధంగా ఒక ప్రత్యేకమైన అప్డేట్ విడుదల చేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని Xiaomi, Realme వంటి సంస్థలు సమర్థవంతంగా అమలు పరచవచ్చు. అయితే ఆ సంస్థలు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించడం లేదు.
ఇదిలా ఉంటే మరోవైపు కొత్తగా విడుదల చేస్తున్న ఫోన్లలో కూడా ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇకనైనా చైనా ఫోన్ తయారీ కంపెనీలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది.