
Android phone వాడుతున్నారా? పొరపాటున ముఖ్యమైన ఫోటో లేదా వీడియో డిలీట్ అయిందా? అయితే దాన్ని సులభంగా రికవర్ చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులు ఇక్కడ చూద్దాం.
రీసైకిల్ బిన్ పరిశీలించండి
ఇటీవలికాలంలో Samsung, ఇతర సంస్థలకు చెందిన కొన్ని smartphoneలలో అంతర్గతంగా ఉండే గ్యాలరీ అప్లికేషన్లో Recycle Bin అనే ఆప్షన్ కల్పించబడి ఉంటోంది. ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసినప్పుడు అవి శాశ్వతంగా డిలీట్ అవ్వకుండా, ఈ రీసైకిల్ బిన్‌లోకి వెళతాయి. కాబట్టి ఇతర డేటా రికవరీ పద్ధతులు ప్రయత్నించ బోయే ముందు Recycle Binలో మీరు డిలీట్ చేసిన ఫైల్స్ కనిపిస్తున్నాయేమో పరిశీలించి వాటిని తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. అయితే ఒకవేళ మీరు రీసైకిల్ బిన్ డిజేబుల్ చేసినట్లయితే చేయగలిగిందేమీ లేదు.
Cloud backup
Google Photos వంటి అప్లికేషన్ ఏదైనా మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నట్లయితే, కొన్ని సందర్భాలలో ముఖ్యమైన ఫోటోలు మరియు వీడియోలు ఆటోమేటిక్ గా దాంట్లోకి బ్యాకప్ అవుతాయి కాబట్టి, అదృష్టవశాత్తూ అవి అక్కడ ఉంటే వాటిని రికవర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే మీరు అక్కడ కూడా వాటిని డిలీట్ చేసినట్టయితే చేయగలిగిందేమీ లేదు.
వాట్సప్ ఫోటోల విషయంలో
మీ స్నేహితులు ఎవరైనా కొద్ది రోజుల క్రితం పంపించిన ముఖ్యమైన వాట్స్అప్ ఫోటో లేదా వీడియో పొరబాటున డిలీట్ చేసినట్లైతే, ఒక చిన్న టెక్నిక్ ద్వారా దాన్ని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. మీ ఫోన్లో లోకల్ గా గానీ, గూగుల్ డ్రైవ్ లో గానీ వాట్సప్ బ్యాకప్ ప్రతీరోజూ అవుతున్నట్లు అయితే, మీ ఫోన్లో వాట్స్అప్ అప్లికేషన్ తొలగించి, మళ్లీ ఇన్స్టాల్ చేసే సమయంలో chat backup restore చేయడం ద్వారా ఇంతకుముందు పోయిన ముఖ్యమైన ఫోటో లేదా వీడియోని తిరిగి పొందవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలలో బ్యాక్అప్ ఇంటిగ్రిటీ దెబ్బతిని ఉండటం వల్ల ఈ ప్రయత్నం వైఫల్యం చెందవచ్చు.
ఆండ్రాయిడ్ డేటా రికవరీ ఆప్స్
అన్నిటికంటే సమర్ధవంతంగా పని చేసే టెక్నిక్ Windows కంప్యూటర్ల కోసం అందుబాటులో ఉన్న వివిధ డేటా రికవరీ అప్లికేషన్ లను సంబంధిత కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి, డేటా కేబుల్ ద్వారా మీ ఫోన్‌ని ఆ పిసికి కనెక్ట్ చేసి డేటా రికవరీ ప్రయత్నించవచ్చు. అయితే ఇలాంటి డేటా రికవరీ అప్లికేషన్లు ప్రధానంగా మెమరీ కార్డు లో డేటాని సమర్థవంతంగా రికవర్ చేయగలుగుతాయి. ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉండే డేటాని ఫోన్ రూట్ చేస్తే తప్పించి రికవర్ చెయ్యలేవు. అయినా కూడా కొన్ని సార్లు డేటా వెనక్కి రాదు. ముఖ్యమైన డేటా ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నించడమే. Recuva, Android Data Recocvery వంటి టూల్స్‌ని దీని కోసం ఉపయోగించవచ్చు.
Google Play Storeలో నేరుగా ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకో కలిగే కొన్ని డేటా రికవరీ టూల్స్ ఉన్నప్పటికీ, అవి పెద్దగా ఫలితం ఇవ్వవు.