
Smartphoneలపై గంటల తరబడి శక్తివంతమైన గేమ్స్ ఆడే వారు ఈ మధ్య కూడా ఉంటున్నారు. ప్రత్యేకంగా గేమ్స్ ఆడుకోవడం కోసమే మెరుగైన స్పెసిఫికేషన్స్, గ్రాఫిక్ ప్రాసెసర్‌తో ఫోన్స్ విడుదల చేయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్స్ మరింత వేగంగా ఉండేలా Xiaomi సంస్థ ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది.
Windows డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టం వాడే వారికి చాలా కాలం నుండి వర్చ్యువల్ మెమరీ అనే పదం తెలిసే ఉంటుంది. మీ హార్డ్ డిస్క్ లో ఉండే కొంత ప్రదేశాన్ని VRAMగా వాడుతూ కంప్యూటర్ పనితీరు మెరుగు పరచడం ఈ టెక్నాలజీ ఉద్దేశం. దాదాపు అదే రకమైన టెక్నాలజీని ఇప్పుడు Xiaomi సంస్థ స్మార్ట్ ఫోన్లకి తీసుకొచ్చింది. RAMDISK అని పిలువబడే ఈ టెక్నాలజీ మొట్టమొదట Mi 10 Ultra ఫోన్లో నిక్షిప్తం చేస్తున్నారు.
ఈ ఫోన్లో ఉండే 16GB RAM ఒక ప్రత్యేకమైన మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు స్టోరేజ్‌గా పనిచేస్తుంది. సహజంగా ఏదైనా గేమ్ phone internal storageలో ఇన్స్టాల్ చేసినప్పుడు, ఆ ఇంటర్నల్ స్టోరేజ్ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి మీ ఫోన్లో ఎంత ర్యామ్ ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు, గేమ్ నెమ్మదిగానే ప్లే అవుతుంది. అయితే దీనికి భిన్నంగా ఈ సరికొత్త RAMDISK టెక్నాలజీ పనిచేస్తుంది.
RAMDISK Trial Modeని ఎనేబుల్ చేసినప్పుడు మీకు కావలసిన గేమ్ మీ ఫోన్ లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ లోకి కాకుండా నేరుగా ర్యామ్‌లో ఇన్స్టాల్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ అంటే ర్యామ్ చాలా వేగంగా ఉంటుంది కాబట్టి గేమ్ కూడా వేగంగా రెస్పాండ్ అవుతుంది. ఈ టెక్నాలజీ ఆధారంగా Peace Elite అనే గేమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు, కేవలం అది 10 సెకండ్స్ లో ఇన్స్టాల్ అయింది. మామూలుగా అయితే దీనికోసం ఒకటిన్నర నిమిషం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
అయితే ఇక్కడ ఓ కీలకమైన విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇలా నేరుగా ర్యామ్‌లో ఇన్స్టాల్ చేయబడిన గేమ్ కేవలం అంతసేపు ఆడుకోడానికి మాత్రమే బాగుంటుంది కానీ, ఒకవేళ మీ ఫోన్ రీస్టార్ట్ అయిన గానీ, బ్యాటరీ అయిపోయినా గానీ.. అది శాశ్వతంగా ఉండదు, మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతం కేవలం Mi 10 Ultra ఫోన్లో మాత్రమే లభిస్తున్న ఈ RAMDISK టెక్నాలజీ త్వరలో మిగిలిన Xiaomi phoneలు అన్నిటికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా ఫోన్ తయారీ సంస్థలు కూడా సరిగ్గా ఇలాంటి టెక్నాలజీ కాస్త అటూ ఇటుగా తీసుకొస్తాయి.