
Xiaomi సంస్థకు చెందిన Mi A3 ఫోన్ వాడుతున్న వినియోగదారుల కోసం తాజాగా ఒక అప్ డేట్ వచ్చింది. అయితే పొరబాటున కూడా దాన్ని ఇన్స్టాల్ చేయకండి. ఇదే విషయమై Xiaomi సంస్థ కూడా తన వినియోగదారులను హెచ్చరించింది.
Android One ప్రోగ్రాం లో భాగంగా లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ తో 1.4GB పరిమాణం కలిగిన అప్డేట్ ఒకటి వచ్చింది. దీంతో అనేక అవాంఛిత బగ్స్ ఉన్నాయి. అంతేకాదు భారతీయ మార్కెట్ కి ఏ మాత్రం సంబంధంలేని అనవసరమైన అప్లికేషన్స్, సర్వీసెస్ కూడా దీంట్లో ఉండటం గమనార్హం. ఉదాహరణకు Mi Telcel మరియు Claro Musica అప్లికేషన్లను తమ ఫోన్లో చూసిన వినియోగదారులు దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. అంతేకాదు, పొరపాటున ఈ అప్డేట్ చేసిన వినియోగదారులు ఫోన్ రీస్టార్ట్ అయిన తర్వాత బూట్ యానిమేషన్ గా Telecel లోగో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి Telcel అనేది మెక్సికన్ కంపెనీ. అది Xiaomi సంస్థకు, Android One ప్రోగ్రామ్‌కీ ఏ మాత్రం సంబంధం లేని సంస్థ. దురదృష్టవశాత్తు ఈ అప్లికేషన్ లను యూజర్లు తొలగించడానికి కూడా వీలు పడటం లేదు. అంతేకాదు తాజాగా వచ్చిన ఈ జూలై అప్డేట్ తర్వాత చాలామంది వినియోగదారుల ఫోన్లో ఉన్న రెండవ సింకార్డు సక్రమంగా పనిచేయడం లేదు. ఇదే అంశాన్ని Xiaomi సంస్థ అంగీకరిస్తూ.. ఈ అప్డేట్ ఇన్స్టాల్ చెయ్యొద్దు అంటూ వినియోగదారులకు సూచించటం మొదలు పెట్టింది.
ఈ లోపాలను సరిచేస్తూ త్వరలో మరో అప్డేట్ రాబోతుంది. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే Mi A3 ఫోన్ వాడుతూ ఉండి, లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టాల్ చేసి లేకపోతే, దాని జోలికి వెళ్ళకండి. ప్రస్తుతానికి దీన్ని ఇన్స్టాల్ చేసినవారికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. భారతీయ వినియోగదారులకు కాకుండా ఇతర మార్కెట్లకు ఉద్దేశించబడిన అప్డేట్ పొరపాటున భారతీయ వినియోగదారులకు అందించడం వలన ఏర్పడిన సమస్యగా దీన్ని భావించాలి.