
Samsung అంటే కేవలం smartphoneలు మాత్రమే కాదు.. దశాబ్దాల తరబడి TVలు, మిక్సీలు, ఫ్రిజ్‌లు వంటి అనేక గృహోపకరణాలను అది తయారు చేస్తూ వస్తోంది. సరిగ్గా అదే ఒరవడిని అందిపుచ్చుకుంటూ తాజాగా Xiaomi, OnePlus, Realme వంటి సంస్థలు అన్నీ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నాయి.
Xiaomi 2014లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు కేవలం smartphoneలు మాత్రమే తయారు చేస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాతి కాలంలో Smart TVలను, ఎయిర్ ప్యూరిఫైయర్లు, బ్రష్‌లు, స్మార్ట్ కెమెరాలు ఇలా అనేక రకాల ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. సరిగ్గా అదే బాటలో Realme, OnePlus కూడా కొనసాగుతున్నాయి. భారతీయ వినియోగదారుడు బ్రాండ్ వాల్యూ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అన్న విషయం గ్రహించిన smartphone తయారీ సంస్థలు తమకు పెద్దగా ఆధిపత్యం లేని విభాగాల్లోకి సైతం ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
Xiaomi సంస్థ Smart TVలను విడుదల చేసిన తొలినాళ్లలో ఆ మోడల్స్ కొనుగోలు చేయటానికి చాలామంది సంశయించారు. కానీ ఈ మధ్య కాలంలో ఎలాంటి అనుమానాలు లేకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక బ్రాండ్ కేవలం కొత్త లో మాత్రమే ఇబ్బంది పడుతుంది. ఒకసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించిన తర్వాత సుదీర్ఘ కాలంలో అది కొనసాగగలుగుతుంది. కేవలం ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ మాత్రమే కాదు, smart home విభాగానికి చెందిన వాయిస్ అసిస్టెంట్, సెక్యూరిటీ కెమెరాలు, స్మార్ట్ ప్లగ్ లు, స్మార్ట్ బల్బులు వంటి అన్ని రకాల విభాగాల్లోకి సంబంధిత సంస్థలు ప్రవేశిస్తున్నాయి.
ఇండియాలో smartphoneల తర్వాత smart TVలు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ స్క్రీన్ పరిమాణం కలిగిన టీవీలను తక్కువ ధరకే అందిస్తూ.. పోటాపోటీగా మార్కెట్లో అనేక సంస్థలు కొత్త మోడల్స్ విడుదల చేస్తున్నాయి. మున్ముందు మనం అనేక రకాల కొత్త ఉత్పత్తులు చూడబోతున్నాం.