
Facebookతో పాటు Twitterలో కూడా చాలామంది అకౌంట్ కలిగి ఉంటున్నారు. అయితే అనేక మంది ఫేస్బుక్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు గానీ, ట్విట్టర్ లో లాగిన్ కావడం చాలా తక్కువ.
ఈ నేపథ్యంలో తాజాగా Twitter అధికారికంగా ఒక ప్రకటన చేసింది. గత ఆరు నెలల కాలంలో ఒకసారి కూడా లాగిన్ కాని అకౌంట్స్‌ని శాశ్వతంగా డిలీట్ చేయబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 11వ తేదీ నుండి ఇది అమలు పరచబడుతుంది. దీనికి సంబంధించి ఆయా ఇనాక్టివ్ అకౌంట్స్ కలిగి ఉన్న వినియోగదారులకు ట్విట్టర్ సంస్థ ఈ మెయిల్స్ కూడా పంపించడం మొదలు పెట్టింది.
ఈ నేపథ్యంలో మీరు ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ కలిగి ఉన్నట్లయితే, వెంటనే ఆలస్యం చేయకుండా ఒకసారి మీ అకౌంట్లో లాగిన్ అయినట్లయితే డిసెంబర్ 11వ తేదీన అది డిలీట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. కేవలం ఈ ఒక్క సారి మాత్రమే కాదు, ఇకమీదట వీలైనంతవరకు తరచూ మీ ట్విటర్ అకౌంట్ లోకి లాగిన్ కావడం ద్వారా అది శాశ్వతంగా కొనసాగే విధంగా చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు మొదలుకొని, అన్ని రంగాలకు చెందిన నిపుణులు Twitterలో అకౌంట్ కలిగి ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే ట్విట్టర్ వాడటం అలవాటు లేనివారు మెల్లగా అలవాటు చేసుకోవడం మంచిది.
గతంలో 140 క్యారెక్టర్లు మాత్రమే సాధ్యపడిన ఒక ట్వీట్ పరిమాణాన్ని ట్విట్టర్ సంస్థ పెంచిన విషయం తెలిసిందే. సమాజంలో జరిగే వివిధ అంశాల గురించి మీరు ఏవైనా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా వ్యక్తపరచాలి అంటే తగిన హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించి నేరుగా ట్విట్టర్లో పోస్ట్ చేయొచ్చు. “కంప్యూటర్ ఎరా” కూడా ఈ లింకులో స్వయంగా ట్విట్టర్ అకౌంట్ కలిగి ఉంది. దానిని మీరు ఫాలో కావచ్చు. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చు.