
Whatsapp దశలవారీగా అనేక కీలకమైన ఆప్షన్లను ఒకదాని తర్వాత మరొకటి తన అప్లికేషన్లో పొందుపరుస్తూ వస్తోంది. అధికశాతం సందర్భాలలో Whatsapp Beta వెర్షన్ వాడే వినియోగదారులకు మాత్రమే ఈ సరికొత్త ఆప్షన్స్ మొట్టమొదట అందుబాటులోకి వస్తాయి. కొన్ని వారాల తరువాత మాత్రమే ఫైనల్ వెర్షన్ వాడేవారికి ఇవి లభిస్తాయి. అదేవిధంగా వాట్సాప్ లో తాజాగా మరో కొత్త ఆప్షన్ బీటా యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చింది.
Whatsapp Beta 2.20.202.8 వెర్షన్ వాడుతున్న వినియోగదారులు ఇక మీదట అప్లికేషన్ పరంగా ఏమైనా సమస్యలు ఎదురైతే ఆ విషయాన్ని నేరుగా Whatsapp దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కొత్త వెర్షన్ లో వచ్చింది. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది కేవలం వాట్సప్ అప్లికేషన్ క్రాష్ అవటం గానీ, ఇతర సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే తప్పించి Whatsapp పరంగా వచ్చే మామూలు సందేహాలు, లేదా సమస్యల గురించి చెప్పడానికి కాదు.
Whatsapp అప్లికేషన్ లోనే అంతర్గతంగా Contact Us అనే విభాగంలోకి వెళితే Tell us more అనే ఒక ఖాళీ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ మీ సమస్య గురించి సమాచారాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాగే సంబంధిత సమస్య ఎందుకు ఏర్పడిందో వాట్స్అప్ సాంకేతిక బృందం విశ్లేషించడం కోసం ఆ క్రిందనే Include device information అనే ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేయడం ద్వారా మీ ఫోన్ మోడల్, అందులో ఉన్న ఇతర సెట్టింగ్స్ వివరాలు Whatsapp సాంకేతిక బృందం దృష్టికి తీసుకు వెళ్ళబడతాయి. వాటిని నిశితంగా పరిశీలించిన తర్వాత ఆ సమస్యకు గల కారణాలు వారు అర్థం చేసుకొని దానికి పరిష్కారాన్ని మీకు సూచించే అవకాశం ఉంది.
Whatsapp అప్లికేషన్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వెబ్సైట్ కి వెళ్లాల్సిన పని లేకుండా, నేరుగా ఎర్రర్ లాగ్స్‌తో వాట్సప్ సపోర్ట్‌ని సంప్రదించే అవకాశం కలగడం ఇదే మొట్టమొదటిసారి!