
Whatsappలో సుదీర్ఘకాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న రెండు కొత్త సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. రెండూ కూడా అతి కీలకమైనవే.
Android, iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhoneలకి మారే వారికి తరచూ ఏర్పడే అతి పెద్ద సమస్య iOSలో అప్పటి వరకూ ఉన్న వాట్సప్ ఛాట్ బ్యాకప్ Androidలో రాకపోవడం, Androidలో ఉన్న ఛాట్ బ్యాకప్ iOSలోకి బదిలీ అవకపోవడం! దీని కోసం చాలామంది అనేక థర్డ్-పార్టీ అప్లికేషన్స్ ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో Whatsapp అలాంటి ఇతర అప్లికేషన్స్ తమ నియమాలను ఉల్లంఘించాయని, అలాంటివాటిని వాడొద్దని వినియోగదారులను హెచ్చరిస్తూ తనకు తానే స్వయంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తోంది.
దీనిద్వారా ఇకమీదట మీరు Android phone నుండి iPhoneకి మారుతున్నా, iPhone నుండి Androidకి మారుతున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా అప్పటివరకు ఉన్న ఛాట్ బ్యాకప్ మొత్తాన్నీ కొత్త ఫోన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
దీంతోపాటు కొంతమంది అధిక సమయం డెస్క్టాప్ కంప్యూటర్ మీద గడుపుతూ ఉండటం వల్ల Whatsapp Web ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి వారు Whatsapp Webలో యాక్టివ్‌గా ఉండాలంటే వాట్సప్ ఇన్స్టాల్ చేయబడి ఉన్న మొబైల్ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమవుతుంది. ఇక మీదట దీంతో సంబంధం లేకుండా, ఒకసారి ఒక నెంబర్ మీద వాట్స్అప్ వెబ్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత, ఒకవేళ సంబంధిత ఫోన్ నెంబర్ ఉన్న ఫోన్ నెట్‌కి కనెక్ట్ అయి లేకపోయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాట్స్అప్ వెబ్ పనిచేసే విధంగా Whatsapp కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తోంది.
Whatsapp Beta వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు అతి త్వరలో ఈ రెండు కొత్త సదుపాయాలు మొదట అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ ఫైనల్ వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు ఇవి లభించటం జరుగుతుంది.