

Whatsapp అందరూ తప్పనిసరిగా వాడుతున్నారు కాబట్టి, అందులో అంతర్గతంగా లభిస్తున్న ఒక సెట్టింగ్ చాలామంది ఎనేబుల్ చేసి ఉంటున్నారు. దానివల్ల ఇటీవలికాలంలో ప్రైవసీ సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపధ్యంలో దాన్ని డిజేబుల్ చేసుకోవటం ఉత్తమం.
Whatappలో ఎప్పటికప్పుడు మీ ఛాట్ మొత్తం బ్యాక్అప్ అవ్వడం కోసం Google Driveలో ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాం కదా. సహజంగా మన ఫోన్లో స్టోరేజ్ మిగుల్చుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఇలా గూగుల్ డ్రైవ్ లోకి మీ వాట్సాప్ బ్యాక్అప్ అవడంలో ఒక ప్రధానమైన సమస్య ఉంది. ఇలా బ్యాకప్ అయ్యే సమయంలో మీ ఛాట్ ప్లెయిన్‌గా బ్యాకప్ అవుతుంది. దాని మీద ఎలాంటి ఎన్క్రిప్షన్ అప్లై చేయబడదు. ఈ కారణం చేత మీ గూగుల్ అకౌంట్ యాక్సిస్ చేయగలిగిన ఎవరైనా ఆ డేటాబేస్ సులభంగా యాక్సెస్ చేసి అందులో మీ ఛాట్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు.
iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే iPhone యూజర్లకి కూడా ఇదే రకమైన ప్రమాదం ఉంటుంది. వారు తమ iCloud అకౌంట్ లోకి చాట్ బ్యాకప్ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొని ఉంటారు. అక్కడ కూడా ఛాట్ ప్లెయిన్‌గా బ్యాకప్ అవుతుంది. అందుకే మీరు Android వాడుతున్నా, iOS వాడుతున్నా క్లౌడ్ స్టోరేజ్ లోకి చాట్ బ్యాకప్ అయ్యే విధంగా కాకుండా మీ లోకల్ స్టోరేజీలో, అంటే మీ ఫోన్ లోనే ఎప్పటికప్పుడు వాట్స్ఆప్ బ్యాకప్ అయ్యే విధంగా సెట్టింగ్ మార్పిడి చేసుకోవడం మొత్తం. దీనివలన మీ ఛాట్ సురక్షితంగా ఉంటుంది.
ముఖ్యంగా ఇటీవల ముంబై డ్రగ్స్ కేసులో సరిగ్గా ఇదే పద్ధతి ఆధారంగా గూగుల్ స్టోరేజ్ నుండి చాట్ బ్యాకప్ వెలికితీసి విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే. నేర పరిశోధన విషయంలో ఇది బానే ఉంటుంది కానీ, వ్యక్తుల ప్రైవసీ విషయంలో మాత్రం ఈ ఆప్షన్ ద్వారా చాలా ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వెంటనే మీ Whatsapp అప్లికేషన్ ఓపెన్ చేసి, అందులో backup optionsలో Google Drive, iCloudలకి బదులు లోకల్ బ్యాకప్‌ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.