Whatsapp ప్రైవసీ పాలసీ గురించి ఎందుకు భయం? మన భయాలు అర్ధరహితమా?

Does the whatsapp privacy policy dangerous

దాదాపు ఐదారేళ్లుగా వివిధ టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికల్లో ప్రైవసీ మరియు సెక్యూరిటీ గురించి నేను అనేక సందర్భాల్లో విశ్లేషణలు ఇవ్వటం జరిగింది. అప్పుడప్పుడే ప్రపంచవ్యాప్తంగా అనేక అప్లికేషన్స్ డేటా మైనింగ్ మొదలుపెట్టాయి. ఇప్పటికి దాదాపు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన సమాచారం Google, Microsoft, Facebook వంటి టెక్నాలజీ సంస్థలతో ఇతర మార్గాల్లో ఇతర సంస్థలు కూడా చేజిక్కించుకున్నాయి.

మరి కొత్తగా ప్రైవసీ పాలసీ ప్రమాదమా?

సహజంగా ప్రతి టెక్నాలజీ కంపెనీ ఎప్పటికప్పుడు తన నియమ నిబంధనలు అప్డేట్ చేస్తూ ఉంటుంది. కొత్త సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వచ్చేటప్పుడు, ప్రొడక్ట్ దృక్పధాన్ని మార్చేటప్పుడు వీటిని మన ముందు ఉంచుతారు. గతంలో గూగుల్ లాంటి సంస్థలు అనేక సందర్భాలలో ఇలా నియమ నిబంధనలు మారుస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాట్స్అప్ విషయంలో ఫేస్బుక్ తీసుకు వచ్చిన తాజా ప్రైవసీ పాలసీ నిజానికి అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు మనం వాడుతున్న Facebook, Google, Youtube లాంటి అన్ని యాప్స్ భారీ మొత్తంలో డేటా సేకరిస్తున్నాయి. నిజానికి కొత్తగా మునిగిపోయేది ఏమీ లేదు.

Whatsapp Businessని మరింత మెరుగు పరచడం కోసం, వ్యాపార సంస్థలకు తమ ఖాతాదారులతో వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయడం కోసం Facebook కొన్ని మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే బుక్ మై షో, స్విగ్గీ వంటి వాటిలో ఆర్డర్ పెట్టినప్పుడు వాట్సాప్ లో వాటి వివరాలు అందించే విధంగా ఇంటిగ్రేషన్ చేయబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలకు మరింత ప్రయోజనం కల్పించడం కోసం Whatsappలో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, మీ లొకేషన్, డివైజ్ మోడల్, ఐపీ అడ్రస్ వంటి వివరాలను సేకరించి ఆయా వ్యాపార సంస్థలు మనకు సేవలు అందించడం కోసం స్టోర్ చేసుకునే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పించబోతోంది.

Whatsapp Businessలో నేరుగా వినియోగదారులు ప్రోడక్టులను, సర్వీసులకి ఆర్డర్ చేసి పేమెంట్ చేసే అవకాశం కూడా రాబోతోంది కాబట్టి, వాట్సప్ పేమెంట్స్ లావాదేవీ వివరాలను కూడా ఆయా వ్యాపార సంస్థలు రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకునే వెసులుబాటుని ఫేస్‌బుక్ కల్పిస్తూ దానికి మన ఆమోదాన్ని కోరుతూ ప్రైవసీ పాలసీ ముందుపెట్టింది. అంతే తప్పించి కొత్తగా మనం భయపడాల్సింది ఏమీ లేదు. సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన లేనివారు హడావుడి చేయడం తప్పించి గతంలో జరిగిన భారీ మొత్తంలో ప్రైవసీ ఉల్లంఘనలతో పోలిస్తే ఇది చాలా చిన్న విషయం.

గమనిక: Amazon, Flipkartలో లేటెస్ట్ డీల్స్, డిస్కౌంట్ పొందాలా? https://telegram.me/bestdealscera అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

వీరిని ప్రశ్నించాలి..

అంతెందుకు.. మన దేశంలోని వివిధ ప్రభుత్వాలు తప్పనిసరిగా మీ ఫోన్లో ఉండాలి అంటూ ఒత్తిడి పెడుతున్న అనేక అప్లికేషన్స్ భారీ మొత్తంలో వినియోగదారుల నుండి రియల్ టైం లొకేషన్ మొదలుకొని, వ్యక్తిగత సమాచారం మొత్తాన్నీ సేకరిస్తున్నాయి. వాటిలో అనేక ఫ్రేమ్ వర్క్ ‌లు అంతర్గతంగా పొందుపరచబడి ఉన్నాయి. ఆ డేటా కు ఎలాంటి రక్షణా లేదు. అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలు ఆధార్ కార్డు మొదలు కొని, అనేక వ్యక్తిగత వివరాలను ఇంటి దగ్గరకు మనుషుల్ని పంపించి సేకరిస్తున్నాయి. ఇదంతా విపరీతమైన డేటా మైనింగ్. వీటిని ప్రశ్నించటం మనకు చేతకాదు.

ఇక్కడ ఫేస్‌బుక్‌ని వెనకేసుకు రావడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు జనాల హడావుడి చేసున్నంత విషయం దీనిలో లేదు. ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ లాంటి సంస్థలు 10 ఇయర్ ఛాలెంజ్, మీకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టడం, మీ చుట్టుపక్కల ఫోటోలు అప్లోడ్ చేయమని తాయిలాలు ఇవ్వడం వంటి అనేక మార్గాల ద్వారా డేటా దొంగిలిస్తూ ఉన్నాయి. నిజంగా డేటా ప్రైవసీ కోరుకునే వారు ఉన్నపళంగా గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్, సిగ్నల్, టెలీగ్రామ్ వంటి అన్ని అప్లికేషన్స్ వాడటం నిలిపివేయాలి. పొద్దున్నే లేచి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ప్రైవసీ గురించి మాట్లాడే వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. ఏదేమైనా ఇండియాలో పటిష్టమైన ప్రైవసీ చట్టాలు రావాలి. అయితే నా ఉద్దేశం ప్రకారం.. ప్రభుత్వాలు అలాంటి చట్టాలు రావడాన్ని పెద్దగా హర్షించవు. కారణం వాళ్లు ఇప్పుడు ప్రజల డేటాను దొంగతనం చేసే పనిలో ఉన్నారు. కాబట్టి తమకే అది అడ్డంకి అవుతుందని అలాంటి చట్టం రాకుండా వాయిదా వేస్తూ ఉంటారు.

-Sridhar Nallamothu, Privacy & Cyber Expert

Computer Era
Logo
Enable registration in settings - general