

మొదట్లో వాట్సాప్ స్టేటస్ గురించి చాలామంది పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఇటీవలి కాలంలో చాలామంది దాన్ని బాగా వాడుతున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇతరులు ఏం స్టేటస్ పెట్టారా అని ఆసక్తిగా చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో వాట్సప్ సంస్థ స్టేటస్ విషయంలో కొన్ని కీలకమైన మార్పులు చేయబోతోంది. ఇప్పటివరకు వాట్సాప్ స్టేటస్ కేవలం మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతర కాంటాక్ట్స్ వారీగా రాండమ్‌గా చూపించబడుతూ ఉంటోంది. కొంతమంది ఫోన్ నెంబర్లు మన ఫోన్ బుక్ లో ఉంటాయి గానీ, వారితో పెద్దగా పరిచయం లేకపోవడం వలన వారి స్టేటస్ గురించి మనకు పెద్దగా ఆసక్తి కూడా ఉండదు. అలాంటప్పుడు వాట్సాప్ స్టేటస్ లో అలాంటి వారి స్టేటస్ కూడా మనకు ప్రధానంగా చూపించబడితే ఎలాంటి ఉపయోగం లేదు కదా.
అందుకే తాజాగా వాట్సప్ సంస్థ Whatsapp Status అప్డేట్ ల విషయం లో కీలకమైన మార్పు చేయబోతోంది. దీని ప్రకారం, మీరు ఎక్కువగా ఎవరి స్టేటస్ అప్డేట్లు చూడటానికి ఇష్టపడతారో వారివి మాత్రమే మీకు ప్రధానంగా చూపించబడతాయి. మీకు ఎవరి మీద ఆసక్తి ఎక్కువగా ఉందో తెలుసుకోవడం కోసం.. వాట్సప్ సంస్థ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. మీరు ఎక్కువగా ఎవరి స్టేటస్ అప్డేట్ లు చూస్తూ ఉంటారో అది పరిశీలిస్తూ ఉంటుంది. అలాగే తరచూ ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటారో ఆ వివరాల ఆధారంగా కూడా మీకు ముఖ్యమైన వ్యక్తులను ఇది గుర్తించగలుగుతుంది.
ఇప్పటికే ఇండియాలో తమ iPhoneలలో వాట్సాప్ వాడుతున్న కొంత మంది వినియోగదారులకు ఈ కొత్త స్టేటస్ అప్డేట్ algorithm అందుబాటులోకి తీసుకు రాబడినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫోన్లని వాడే వారికి కూడా ఇది కల్పించబడుతుంది.