

2017నుండి Whatsapp వినియోగదారులకు Whatsapp Status ఫీచర్ లభిస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా మన దగ్గర ఉండే ఫోటోలు, వీడియోలు, GIF యానిమేషన్లు అందరికీ కనిపించే విధంగా statusగా సెట్ చేసుకోవచ్చు. అయితే ఈ స్టేటస్ కేవలం 30 సెకన్లు మాత్రమే ఎందుకు ఉంటుంది అనే సందేహం చాలా మందికి కలుగుతుంది.
మొదట్లో ఇలా!
2017లో Whatsapp Status సదుపాయం ప్రవేశపెట్టినప్పుడు, 90 సెకన్ల నిడివి కలిగిన వీడియో ని స్టేటస్ గా పెట్టుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత అది 30 సెకన్లకు తగ్గించబడింది. ఇక్కడ మరో విషయం గమనించాలి. లాక్ డౌన్ సమయం లో Whatsapp Statusకి ఉన్న 30 సెకన్ల నిడివిని మరింత తగ్గించి కేవలం 15 సెకన్లు మాత్రమే పెట్టుకునే విధంగా తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ మే 19, 2020 నుండి పూర్తిగా 30 సెకన్ల వీడియోని statusగా పెట్టుకునే వెసులుబాటు కల్పించారు.
ఎందుకు ఈ పరిమితి?
“ఎంత వీడియో కావాలంటే అంత సైజు పెట్టుకునే అవకాశం కల్పించవచ్చు కదా” ఎందుకిలా తక్కువ సైజ్ పెట్టుకునేలా పరిమితి విధించారు అనే సందేహం చాలామందికి సహజంగానే కలుగుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. Whatsapp సర్వర్ల మీద వీలైనంత వరకు భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ పరిమితి విధించారు. ఎక్కువ నిడివి కలిగిన వీడియోలు ఖచ్చితంగా ఎక్కువ స్థలాన్ని వాట్సాప్ సర్వర్లో ఆక్రమిస్తాయి. మామూలు సందర్భాలలో మనం Whatsapp ద్వారా ఇతరులకి పంపించే ఫోటోలు మరియు వీడియోలు నేరుగా అవతలివారికి పంపించబడిన తర్వాత Whatsapp సర్వర్లో స్టోర్ చెయ్యబడవు. కానీ, Whatsapp Status విషయంలో మాత్రం 24 గంటల పాటు మన స్నేహితులు అందరికీ దాన్ని చూపించడం కోసం Whatsapp సర్వర్లో స్టోర్ చేయబడి ఉండాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇలా status పెట్టుకున్నప్పుడు సర్వర్ మీద విపరీతంగా భారం పడకుండా ఇలా కేవలం 30 సెకన్ల వీడియో మాత్రమే పెట్టుకునే అవకాశం కల్పించారు.
లాక్ డౌన్ సమయంలో!
లాక్ డౌన్ సమయంలో 15 సెకన్లకి ఎందుకు తగ్గించారు అనే సందేహం కూడా మీకు కలగవచ్చు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు లాక్ డౌన్ కారణంగా, అందరూ ఇళ్లల్లో కూర్చుని వీడియో కంటెంట్ చూస్తుండడం వల్ల ఇంటర్నెట్ మీద భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేయడంతో Whatsapp తాత్కాలికంగా ఆ నిర్ణయం తీసుకుంది.