

దాదాపు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టంలలో ఎప్పటికప్పుడు అనేక సెక్యూరిటీ లోపాలు బయటపడుతుంటాయి. వివిధ యాంటీ వైరస్ మరియు సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఇలాంటి వాటిని గుర్తిస్తూ ఉంటాయి. సరిగ్గా అదే విధంగా Windows 10 ఆపరేటింగ్ సిస్టం లో ఉన్న అతి కీలకమైన లోపం గురించి తాజాగా మైక్రోసాఫ్ట్, మరియు గూగుల్ సంస్థల వినియోగదారులను హెచ్చరించాయి.
ఇక్కడ Windows 10తో Googleకి సమ్మర్ సంబంధం ఏంటి అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. వాస్తవానికి వివిధ ఆపరేటింగ్ సిస్టంలు, ఇతర అంశాల్లో ఉండే లోపాలను వెతికి పట్టుకోవటం కోసం Google సంస్థ ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కూడిన Project Zero అనే ఒక టీం నిర్వహిస్తోంది. అందులో పనిచేసే వారు ఈ తాజా లోపం గురించి గుర్తించి.. దాని వివరాలు మైక్రోసాఫ్ట్ సంస్థకు చెబుతూ వారం రోజుల లోపల దాన్ని సరి చేసుకోకపోతే బహిరంగంగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.
దురదృష్టవశాత్తు మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ వారం రోజుల లోపల దాన్ని సరి చేయకపోవడంతో Google Project Zero టీమ్ దానికి సంబంధించిన వివరాలను ఈ లింక్లో బహిరంగంగా పెట్టడం జరిగింది. కెర్నల్ క్రిప్టోగ్రఫీ డ్రైవర్లో ఉన్న ఈ సెక్యూరిటీ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే కంప్యూటర్లోకి ప్రవేశించి అందులో ఉండే సాధారణ యూజర్ పర్మిషన్ కూడా అడ్మినిస్ట్రేటివ్ హోదా లోకి మార్చి కంప్యూటర్ మరియు నెట్వర్క్ మీద పూర్తి స్థాయిలో యాక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.
అలా చేసిన తర్వాత ఖచ్చితంగా మీ కంప్యూటర్ లో ఉండే కీలకమైన ఫైల్స్ మరియు ఫోల్డర్లను తస్కరించడం, అంతేకాకుండా కీలకమైన సర్వీసులను నిలుపుదల చేయడం వంటి అనేక రకాల పనులను ఈ సెక్యూరిటీ లోపం ఆధారంగా చేసే అవకాశం ఉంది. Microsoft సంస్థ దీనికి ప్రధానమైన ప్యాచ్ విడుదల చేసే సన్నాహాల్లో ఉంది. అప్పటివరకు మీ కంప్యూటర్ విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.